ఉప్మా అందరికీ నచ్చాలని లేదు. కానీ అందరికీ నచ్చేలా కొబ్బరి ఉప్మాను వండుకోవచ్చు. తమిళనాడులో ఎక్కువగా ఈ కొబ్బరి ఉప్మాను తింటూ ఉంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. గోధుమ రవ్వతో చేసే ఈ కొబ్బరి ఉప్మా మీకు కూడా నచ్చుతుంది. ఒక్కసారి దీన్ని రెసిపీ చూసి ఎలా చేయాలో ప్రయత్నించండి.
గోధుమ రవ్వ - ఒక కప్పు
కొబ్బరి తురుము - రెండు స్పూన్లు
మినప్పప్పు - ఒక స్పూను
పచ్చిశనగపప్పు - ఒక స్పూన్
ఎండుమిర్చి - రెండు
కరివేపాకులు - గుప్పెడు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
నెయ్యి - రెండు స్పూన్లు
ఆవాలు - అర స్పూను
నీరు - సరిపడినంత
నూనె - రెండు స్పూన్లు
క్యారెట్ - ఒకటి
అల్లం తరుగు - అర స్పూను
పచ్చి కొబ్బరి ముక్కలు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
1. కొబ్బరి ఉప్మాను తయారు చేసేందుకు ముందుగా రెండు స్పూన్ల కొబ్బరి తురుమును పక్కన పెట్టుకోండి.
2. అలాగే కొబ్బరి ముక్కలను చిన్నగా కోసి పక్కన పెట్టుకోండి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి గోధుమ రవ్వను వేసి వేయించండి.
4. ఇందులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తే మంచి సువాసన వస్తుంది. రవ్వ రంగు మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి.
5. ఈ రవ్వను తీసి పక్కన పెట్టుకోండి.
6. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అల్లం తురుము, క్యారెట్ ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు వేసి వేయించండి.
7. ఇవన్నీ కూడా రంగు మారే వరకు వేయించండి. ఆ తర్వాత అందులో ఉప్మా ఉడకడానికి సరిపడా నీళ్లు పోయండి.
8. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడే కొబ్బరి తురుమును కూడా వేసి బాగా కలుపుకోండి. అందులో రుచికి సరిపడా ఉప్పుని వేయండి.
9. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను అందులో వేసి కలుపుతూ ఉండండి.
10. చిన్న మంట మీద దీన్ని గరిటతో కలుపుతూనే ఉండండి. లేకపోతే ఉండలు కట్టే అవకాశం ఉంది.
11. ఇది దగ్గరగా అయిన తర్వాత పైన నెయ్యి వేసి మళ్లీ బాగా కలపండి.
12. గోధుమ రవ్వ వేశాక స్టవ్ ను సిమ్ లోనే ఉంచి వండాలి. ఆ తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి.
13. ఓ పది నిమిషాలు పాటు మూత తీయకుండా అలాగే ఉంచండి. ఆ తర్వాత మూత తీసి ఈ కొబ్బరి ఉప్మాను ఏదైనా చట్నీతో తింటే అదిరిపోతుంది.
సాధారణ ఉప్మాతో పోలిస్తే ఈ కొబ్బరి ఉప్మా టేస్టు అందరికీ నచ్చుతుంది. దీని చేయడం కూడా చాలా సులువు. ఒకసారి ప్రయత్నించి చూడండి.