Blood Health: ఇలాంటి పనులు చేస్తే రక్తం మందంగా మారి గడ్డ కట్టేస్తుంది జాగ్రత్తా
Blood Health: రక్తం గడ్డ కట్టడం అనేది చాలా తీవ్రమైన సమస్య. కాబట్టి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కొన్ని అలవాట్లను వదిలేస్తే ఈ సమస్య రాదు.
శరీరంలో మన ఆరోగ్యాన్ని నిర్ణయించేది రక్తం. రక్తంలో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా చాలు శరీరం మొత్తం కనిపిస్తుంది. అలాగే రక్తం గడ్డ కట్టడం అనేది తీవ్రమైన ప్రాణాంతక సమస్యగా మారిపోతుంది. మెదడులో రక్తం గడ్డ కడితే అది బ్రెయిన్ స్ట్రోక్ కు కారణం అవుతుంది. అలాగే పక్షవాతం, మరణం వంటివి కూడా సంభవించవచ్చు. కాబట్టి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వంటివి జరగకుండా జాగ్రత్తపడాలి. అలా జాగ్రత్త పడాలంటే మీరు చెడు ఆహారపు అలవాట్లను, జీవనశైలిని వదిలేయాలి. మీకు కొన్ని రకాల అలవాట్లు ఉంటే రక్తం మందంగా మారి గడ్డకట్టే అవకాశం ఉంటుంది.
మనం తినే ఆహారం రక్తప్రసరణ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి అధికంగా ఉప్పు, అధిక చక్కెర ఉండే పదార్థాలను తీసుకోకూడదు. అలాగే కొవ్వు పదార్థాలను కూడా తగ్గించాలి. నూనెలో బాగా డీప్ ఫ్రై చేసిన ఆహారాన్ని తింటే సమస్యలు వస్తాయి. అలాగే నిప్పులపై నేరుగా కాల్చిన ఆహారాన్ని కూడా తీసుకోకూడదు. ఇవన్నీ కూడా రక్తనాళాలు కుచించుకుపోయేలా చేస్తాయి. ఎప్పుడైతే రక్తనాళాలు కుచించుకు పోతాయో... రక్తప్రసరణ సరిగ్గా జరగదు. అలాగే రక్త గడ్డకట్టే ప్రమాదం కూడా పెరిగిపోతుంది.
శారీరక శ్రమ లేకపోయినా
ఎంతోమంది కూర్చునే ఉద్యోగాలను చేస్తూ ఉంటారు. అలా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు కూర్చునే ఉంటారు. ఇలా చేయడం వల్ల ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దీని కారణంగా కూడా రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మద్యపానం, ధూమపానం
శరీరంలో ఎన్నో రోగాలకు మద్యపానం, ధూమపానం అనేవి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడా రక్తాన్ని మందంగా మారుస్తాయి. ఆల్కహాల్ లో ఉండే రసాయనాలు రక్తనాళాలను దెబ్బతీస్తాయి. ధూమపానం రక్తం గడ్డకట్టే ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. కాబట్టి మీరు ఈ రెండు అలవాట్లను వెంటనే మానేయాల్సిన అవసరం ఉంది.
ఒత్తిడి
విపరీతమైన మానసిక ఒత్తిడి అనేది శారీరక, మానసిక ఆరోగ్యం పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడి వల్ల శరీరంలో కార్డిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇది బీపీని పెంచుతుంది. తద్వారా రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తం గడ్డకట్టే అవకాశాన్ని కూడా పెంచుతుంది.
నిద్రకు ప్రాధాన్యత
తగినంత నిద్ర లేకపోయినా, అనారోగ్యకమైన జీవనశైలి ఉన్నా బీపీ షుగర్ స్థాయిలు పెరిగిపోతాయి. హార్మోన్ల అసమతుల్యత కూడా పెరిగిపోతుంది. ఇలాంటి సమస్యలన్నీ రక్తం గడ్డ కట్టడానికి దారితీస్తాయి. కాబట్టి మీరు నిద్రను తక్కువ అంచనా వేయకుండా ప్రతిరోజు 8 నుంచి తొమ్మిది గంటలు రాత్రిపూట నిద్రపోవడం ముఖ్యం. లేకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. రక్తం గట్టిపడుతుంది. ఇది మొదటిలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)