Kids Work at Home: పిల్లలతో ఇంటి పనులు చేయిస్తే, వారి భవిష్యత్ బాగుంటుందా? వారితో ఎలాంటి పనులు చేయించాలి?-if you do household chores with your children will their future be better what kind of chores should you do ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kids Work At Home: పిల్లలతో ఇంటి పనులు చేయిస్తే, వారి భవిష్యత్ బాగుంటుందా? వారితో ఎలాంటి పనులు చేయించాలి?

Kids Work at Home: పిల్లలతో ఇంటి పనులు చేయిస్తే, వారి భవిష్యత్ బాగుంటుందా? వారితో ఎలాంటి పనులు చేయించాలి?

Ramya Sri Marka HT Telugu

Kids Work at Home: పిల్లలతో ఇంటి పనులు చేయించడం మంచిదట. వినడానికి కాస్త కొత్తగా అనిపించినా ఇది నిజం. వారి వయసుకు తగిన ఇంటి పనులు, బాధ్యతలు అప్పగించడం చాలా ముఖ్యం. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, భవిష్యత్తులో మంచి నిర్వహణ, సామాజిక నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

చిన్నారితో టేబుల్ శుభ్రం చేయిస్తున్న తల్లి (Shutterstock)

పిల్లలతో ఇంటి పనులు చేయించడానికి చాలా మంది తటపటాయిస్తుంటారు. చాలా వరకూ గారాభంతోనో, వారు సరిగా చేయలేరనే ఉద్దేశ్యంతోనో ఇంటి పనులకు దూరంగా ఉంచుతారు. కానీ, ఇలా చేయడం మంచి పద్ధతి కాదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే.. కొందరి పిల్లల్లో స్వతాహాగా ఇంటి పనులు చేయాలనే ఉత్సాహం కనిపిస్తుందట. అలాంటి చిన్నారులను వారించి ఆ ఆలోచనను విరమించుకునేలా చేయడం వారి భవిష్యత్తును కష్టతరంగా మారుస్తుందట. పనులు చేయిస్తేనే పిల్లల భవిష్యత్తుకు మంచిదట. ఎలాగో తెలుసుకుందాం రండి..

పిల్లల వయసుకు తగినట్లుగా కొన్ని బాధ్యతలు, పనులు అప్పగించడం ద్వారా వారు కొన్ని సామాజిక నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఇలా చేయడం వలన వారు మరింత బాధ్యతాయుతంగా, ఆత్మవిశ్వాసంతో పెరుగుతారట.అంతేకాకుండా, కుటుంబంతో వారి బంధం బలపడుతుందట. పిల్లల మంచి అభివృద్ధికి వారి రోజువారీ కార్యక్రమంలో చదువు, ఆటలతో పాటు కొన్ని చిన్న ఇంటి పనులు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. పిల్లలతో ఏ రకమైన పనులు చేయించాలి. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

పిల్లలతో ఇంటి పనులు చేయించడం ఎందుకు ముఖ్యం?

  • నిపుణుల ప్రకారం, పిల్లలను చిన్న చిన్న ఇంటి పనుల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రేరేపించడం, లేదా పిల్లలు చేయాలనుకున్నప్పుడు వారిని ఆపకుండా ప్రోత్సహించడం వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేస్తుంది.
  • గమనించి చూడండి చిన్నదో పెద్దదో పక్కన పెడితే వారికి ఏదైనా బాధ్యత అప్పగించినప్పుడు పిల్లలు చాలా గర్వంగా ఫీలవుతారు. కుటుంబంలో తమకు కూడా కొంత పాత్ర ఉందని, వారు చాలా ముఖ్యమైన వ్యక్తి అని వారికి అనిపిస్తుంది. దీనివల్ల పిల్లల్లో బాధ్యతాయుతమైన వైఖరి ఏర్పడుతుంది. ఇది వారికి భవిష్యత్‌లో ఎంతో ఉపయోగపడుతుంది.
  • అంతేకాకుండా ఇచ్చిన పనిని చేసినప్పుడు వారిలో తెలియని ఓక తృప్తి కలుగుతుంది. ఇది వారిలో కాన్ఫిడెన్స్‌ను, వారి మీద వారికి నమ్మకాన్నిపెంచుతుంది. ఇలా చేయడం వల్ల పిల్లలు చిన్న వయస్సు నుంచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను పెంచుకుంటారు.
  • వారి పనులు వారికి అప్పచెప్పడం వల్ల ప్రతి చిన్న పనికి తల్లిదండ్రులపై ఆధారపడరు. దీనివల్ల వారి నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. దీని వల్ల భవిష్యత్తులో వారు ఎవరి మీద ఆధారపడకుండా చేస్తుంది.
  • ఇది కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచుతుంది.ఇది వారి భవిష్యత్తును మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది.

పిల్లలతో ఏ రకమైన పనులు చేయించాలి..

పిల్లలకు ఎల్లప్పుడూ వారి వయసుకు తగిన కొత్త పనులు లేదా బాధ్యతలు అప్పగించండి. వారు సురక్షితంగా ఉండే, ఎక్కువ కష్టం లేని పనులు వారితో చేయించండి.

ఉదాహరణకు, మీరు వారితో చేయించగల కొన్ని పనులు:

  1. ఇంట్లోని, పెరట్లోని మొక్కలకు నీరు పోయడం,
  2. ఉదయం లేవగానే తమ బెడ్ సర్దుకోవడం,
  3. తమ బట్టలు మడత పెట్టుకునేలా చేయడం,
  4. భోజనం చేసే టేబుల్ సిద్ధం చేయడం లేదా భోజనం తర్వాత టేబుల్ శుభ్రం చేయడం,
  5. వారు తిన్న పాత్రలు కడగడం,
  6. చెప్పులను క్రమబద్ధం చేయడం,
  7. వారి బొమ్మలను, పుస్తకాలను సరైన ప్రదేశంలో ఉంచుకోవడం,
  8. ఇంట్లో పెంపుడు జంతువు ఉంటే దానికి ఆహారం ఇవ్వడం.
  9. పిల్లలు కొంత పెద్దవారైతే, మీరు కిరాణా షాపింగ్‌లో వారి సహాయం తీసుకోవచ్చు.

తల్లిదండ్రులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి..

  • పిల్లలతో ఇంటి పనులు చేయించేటప్పుడు తల్లిదండ్రులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటంటే..
  • పనులు చేయించాలి కదా అని వారితో చాలా పనులు చేయించకూడదు. వారి రోజువారీ కార్యక్రమంలో చదువు, ఆటలు, ఇతర కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
  • ముఖ్యంగా పిల్లలు ఏ పని చేసినా వారికి ప్రశంసలు ఇవ్వాలి. పనిలో తప్పులను ఎత్తిచూపకుండా ఎలా చేయాలో చెప్పాలి. పూర్తయిన తర్వాత వారిని ప్రశంసిస్తూ, వారి సహాయం మీకు ఎంత ఉపయోగపడిందో వారికి వివరించాలి.
  • అంతేకాకుండా వారితో కొంత సమయం గడిపాలి, కలిసి కొన్ని ఆహ్లాదకరమైన కార్యక్రమాలు చేయాలి, కబుర్లు చెప్పాలి.
  • ఏ పనిలోనైనా పిల్లల నుండి పరిపూర్ణతను ఆశించకూడదు, బదులుగా వారితో కలిసి పనిచేసి, ప్రేమతో పనిని మెరుగుపరచడం ఎలాగో నేర్పాలి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం