Tight Bra: బిగుతు బ్రా వేస్తే సౌకర్యం అనుకుంటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయ్ జాగ్రత్త
Tight Bra: బిగుతుగా ఉండే బ్రా వేసుకోవడం వల్ల మహిళలఛాతీపై అనవసరమైన ఒత్తిడి ఏర్పడుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి అనేక సమస్యలు వస్తాయి. ఎలాంటి బ్రాలు వేసుకోవాలో, బిగుతు బ్రాల వల్ల కలిగే నష్టాలేమిటో, వాటి వాడకం గురించి జాగ్రత్తలు తెల్సుకోండి.
వక్షోజాల ఆరోగ్యం, ఆకృతి కోసం, సౌకర్యం కోసం మహిళలు బ్రా వేసుకోవడం అనివార్యం. అయితే ఈ లాభాలన్నీ సరైన బ్రా వేసుకున్నప్పుడు మాత్రమే పొందగలరు. కైరోప్రాక్టిక్, ఆస్టియోపతి అధ్యయనం సుమారు 80 శాతం మంది మహిళలు తప్పు సైజు బ్రాను ధరిస్తున్నారని చెబుతోంది. ఇందులో 70 శాతం మంది మహిళలు వాళ్లకు నప్పే కన్నా చిన్న సైజులో బిగుతుగా ఉండే బ్రాలు, 10 శాతం మంది చాలా పెద్ద సైజు బ్రాలు ధరిస్తున్నారని తేలింది. హార్వర్డ్ యూనివర్శిటీలో నిర్వహించిన ఒక పరిశోధనలో బిగుతు బ్రా ధరించడం వల్ల మహిళల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందనీ తేలింది. బ్రాలు ఎలాంటివి వేసుకోవాలో, టైట్ బ్రాలు ధరించడం వల్ల కలిగే నష్టాలేమిటో, బ్రాలను శుభ్రం చేయడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.
బ్రా వేసుకోవడం అలా మొదలు:
చాల ఏళ్ల క్రితం గ్రీస్ మహిళలు బ్రాలు వేసుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో ఉన్ని లేదా నార పట్టీలతో బ్రాలను తయారు చేసేవారు. ఇది మహిళలు వక్షోజాల చుట్టూ చుట్టుకునేవారు. ఆ తర్వాత మారుతున్న కాలానికి అనుగుణంగా బ్రా లుక్, ఆకారం కూడా గణనీయంగా మారిపోయాయి.
బిగుతు బ్రా వేసుకుంటే నష్టాలు:
రక్త సరఫరా:
వక్షోజాల పరిమాణం ఎక్కువగా ఉన్న మహిళలు మరీ బిగుతుగా ఉండే బ్రా ధరిస్తే బ్రా లైన్ చోట, దాని చుట్టూ ఉండే కండరాల్లో రక్త ప్రసరణ తగ్గుతుంది. చెమట కూడా ఎక్కువగా వస్తుంది. బ్రా బిగుతుగా ఉండటం వల్ల సులువుగా చెమట ఆరిపోదు. అలాగే పేలవమైన రక్త ప్రసరణ కారణంగా భుజం, వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. దీంతో పాటే బిగుతు బ్రా వల్ల శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది అవుతుంది.
ర్యాషెస్:
బిగుతుగా ఉండే బ్రా ధరించడం వల్ల చెమట చేరి దాంతో ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు వస్తాయి. టైట్ బ్రాలు చర్మానికి అంటుకునే ఉండటం వల్ల బ్రా లైన్ చుట్టూ దురద, మంట, దద్దుర్లు ఏర్పడతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ సమస్య మరీ విపరీతంగా ఉంటుంది. దీంతో పుండ్లు కూడా కొందరిలో కనిపిస్తాయి.
శరీరం భంగిమ:
టైట్ బ్రా ధరించడం వల్ల తమ భంగిమ దెబ్బతింటుంది. భుజాల మీద ఒత్తిడి పెరుగుతుంది. బ్రా బిగుతుగా అనిపించడం వల్ల మీకు తెలీకుండానే ప్రతిసారీ కాస్త ముందుకు వంగి కూర్చోవడం అలవాటవుతుంది. దాంతో కాస్త సౌకర్యంగా అనిపిస్తుంది. దీంతో దీర్ఘకాలంగా శరీర భంగిమ మీద ప్రభావం ఉంటుంది. నిలబడ్డప్పుడు, కూర్చున్నప్పుడు కాస్త ముందుకు వంగుతారు.
ఎసిడిటీ:
మీరు పూర్తి ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి పాటిస్తున్నా కూడా ఎసిడిటీ సమస్య వేధిస్తుంటే ఇదీ ఒక కారణమే. బిగుతు బ్రాలు ఎసిడిటీ సమస్య పెంచుతాయి. బిగుతుగా ఉండే బ్రా ఛాతీపై ఒత్తిడిని పెంచుతుంది, ఇది ఛాతీ వైపు యాసిడ్ రిఫ్లక్స్‌ను పెంచుతుంది.
బ్రా శుభ్రం చేయండిలా:
బ్రాలు ఉతకడానికి వాషింగ్ మెషీన్ వాడుతుంటే వాటి మన్నిక గురించి జాగ్రత్త అవసరం. వాటికోసం బ్రా మెష్, బ్రా వాషింగ్ బ్యాగ్ లాంటివి వాడితే వాటిలో ఉంచి వాషింగ్ మెషీన్ లో వేయండి. ఇలా చేస్తే బ్రా ఆకారం దెబ్బతినదు. అలాగే ఉతికిన బ్రాను బాగా గాలి, ఎండ సోకే చోట ఆరబెట్టండి. ఎవరికీ కనిపించకూడదని చాలా మంది బ్రాను ఆరేసి దాని మీద ఇంకేదైనా కప్పేస్తారు. ఇలా ఆరబెట్టడం తప్పు మార్గం అని గుర్తించండి. దాంతో ఇన్ఫెక్షన్ల ప్రమాదం మరింత పెరుగుతుంది.
టాపిక్