Kitchen tips: గోధుమపిండి ఇలా ఉంటే దాని ఎక్స్‌పైరీ డేట్ ముగిసిపోయిందని అర్థం, ఇలా నిల్వ చేయండి
Kitchen tips: మనదేశంలో అన్నం తరువాత ఎక్కువ తినేది రోటీలు, చపాతీలనే. వీటిని గోధుమపిండితోనే తయారుచేస్తారు. లంచ్, డిన్నర్లలో కూడా రోటీలను తినేవారు ఉన్నారు. అయితే మీరు వాడే గోధుమ పిండి తాజాదో కాదో తెలుసుకోండి. అది ఎక్స్ పైరీ అయితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఉదయం నుంచి రోటీ, చపాతీలతో మొదలుపెట్టేవారు ఎంతో మంది ఉన్నారు. ఉత్తర భారతదేశంలో గోధుమ పిండితోనే ప్రధానంగా ఆహారాన్ని తింటారు. ఇక బరువు తగ్గించాలన్న ప్రయాణంలో దక్షిణ భారతదేశంలో కూడా ప్రతిరోజూ చపాతీలు తినేవారి సంఖ్య పెరిగిపోయింది. రాత్రి పూట ప్రతిరోజూ చపాతీలు తిని బరువును అదుపులో పెట్టుకునేవారి సంఖ్య ఎక్కువ. మనదేశంలో అన్నం తరువాత గోధుమపిండినే అధికంగా వాడుతారు. దీనితో ఇంకా ఎన్నో టేస్టీ వంటకాలు వండుకోవచ్చు. ఆలూ పరాఠా, గోధుమ పిండి స్వీట్లు వంటివి చేసుకోవచ్చు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
గోధుమ పిండిని అధికంగా వాడతారు కాబట్టి, మహిళలు గోధుమ పిండిని నెల మొత్తం ఆర్డర్ చేసి నిల్వ చేస్తారు. అయితే గోధుమ పిండి కూడా కొంత కాలం తర్వాత చెడిపోతుందని మీకు తెలుసా? గోధుమ పిండికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. కానీ ఈ విషయం ఎంతో మందికి తెలియదు. గోధుమ పిండి గడువు ముగిసిపోతే దాన్ని వాడకూడదు. ఈ పిండి చెడిపోతే ఆ విషయాన్ని తెలుసుకోలేక ఎంతో మంది తినేస్తూ ఉంటారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ కు కారణం అవుతుంది. గోధుమ పిండి గడువు ముగిసిపోతే ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
గోధుమ పిండి చెడిపోయిందో లేదో తెలుసుకోవడం ఎలా?
గోధుమ పిండిలో ఉన్న సహజ నూనెలు కాలక్రమేణా ఆక్సీకరణం చెందడం ప్రారంభిస్తాయి. ఇది పిండి రుచి, నాణ్యతను ప్రభావితం చేస్తుంది. చెడుగా మారిన గోధుమ పిండిని గుర్తించడానికి కొన్ని సులభమైన చిట్కాలను ప్రయత్నించవచ్చు.
చెడిపోయిన గోధుమ పిండిని గుర్తించడానికి, మొదట దానిని వాసన చూడటం ద్వారా తనిఖీ చేయండి. పిండి వింతగా లేదా రాన్సిడ్ వాసన ఉంటే అది పాడైపోయినది అని అర్థం చేసుకోండి.
గోధుమ పిండి రంగును గమనించడం ద్వారా అది ఎలా ఉందో నిర్ధారణ చేసుకోవాలి. చెడిపోయిన పిండి పసుపు లేదా గోధుమ రంగులోకి మారిపోతుంది. గోధుమ పిండి పాడైతే దాని రంగు కచ్చితంగా మారిపోతుంది.
పిండిలో చిన్న కీటకాలు లేదా దుమ్ము లాంటి కణాలు కనిపించినా కూడా అది పాడైనదని అర్థం చేసుకోవాలి. అలాంటి పిండిని బయటపడేయాలి.
గోధుమ పిండిని ఎలా నిల్వ చేయాలి?
గోధుమ పిండి ఎక్కువ మొత్తంలో మీరు తీసుకుంటే దాన్ని భద్రపరుచుకోవాలి. ఇందుకోసం ఆ పిండిని సాధారణ గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాలి. ఒకసారి గోధుమపిండి కొంటే మూడు నెలల్లో వాడేయాలి. గోధుమ పిండి ప్యాకెట్ పై ఎక్స్ పైరీ డేట్ ఎప్పుడు ఉందో చూడండి. ఆ తేదీలోపే ఆ పిండిని వాడేయాలి. ఈ పిండిని ఫ్రిజ్ లో భద్రపరుచుకుంటే దాని షెల్ఫ్ లైఫ్ 6 నెలల వరకు పెరుగుతుంది. కాబట్టి గోధుమ పిండిని దాన్ని బట్టి వాడాలి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్