Hypothyroidism: ఆడవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే వారికి హైపోథైరాయిడిజం ఉన్నట్టే లెక్క
Hypothyroidism: థైరాయిడ్ అనేది అధికంగా మహిళలను ప్రభావితం చేస్తున్న సమస్య. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి హైపోథైరాయిడిజం. దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
ఆధునిక కాలంలో థైరాయిడ్ సమస్యల బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరిగిపోతోంది. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం... ఈ రెండు రకాల థైరాయిడ్లు మహిళల శరీరాన్ని నీరసించేలా చేస్తున్నాయి. థైరాయిడ్ అనేది సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక గ్రంథి. ఇది మన శక్తి స్థాయిలను, జీవక్రియను, సాధారణ ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది. అందుకే థైరాయిడ్ సమస్య వస్తే దైనందిన జీవితంలో మార్పులు కనిపిస్తాయి. ఈ థైరాయిడ్ సమస్య పురుషుల కంటే మహిళలను ఎక్కువగా వేధిస్తోంది.
థైరాయిడ్ సమస్యలు రెండు రకాలు ఒకటి. హైపో థైరాయిడిజం.. అవసరమైన దానికన్నా థైరాయిడ్ హార్మోన్లను తక్కువగా ఉత్పత్తి చేస్తే వచ్చే ఆరోగ్య సమస్య ఇది. ఇక హైపర్ థైరాయిడిజంలో మన శరీరానికి అవసరానికి మించి హార్మోన్లు ఉత్పత్తి కావడం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. ఈ రెండింటికి కూడా ప్రతిరోజు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనం హైపోథైరాయిడిజం లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.
హైపోథైరాయిడిజం లక్షణాలు
రుతుస్రావం సమయంలో, మెనోపాజ్ సమయంలో, గర్భం ధరించినప్పుడు, మహిళల్లో హార్మోన్ల మార్పులు అధికంగా కనిపిస్తాయి. ఆ సమయంలో థైరాయిడ్ రుగ్మతలు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. కాబట్టి స్త్రీలు తరచూ థైరాయిడ్ ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. హైపోథైరాయిడిజం బారిన పడితే బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనికి అలసిపోతారు. తగినంత నిద్ర పోయిన తర్వాత కూడా వారికి ఇంకా అలసటగా, నీరసంగానే ఉంటుంది. ఇది బద్ధకంగా అనిపించేలా చేస్తుంది. అసహనంగా అనిపించడం, చలిగాలి తగిలితే చాలు చికాకు పడడం వంటివి హైపోథైరాయిడిజంలో కనిపించే లక్షణాలు. థైరాయిడ్ గ్రంథులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి బాధ్యత వహిస్తాయి. స్త్రీలు పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల మార్పులను గమనిస్తారు.
పీరియడ్స్ ఎక్కువ రోజులు కావడం, నెలలో ఎక్కువసార్లు పీరియడ్స్ రావడం వంటివి జరుగుతాయి. థైరాయిడ్ సరిగా పనిచేయకపోవడం వల్ల హార్మోన్లు అసమతుల్యత ఏర్పడి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. బరువు పెరగడం అనేది కూడా హైపోథైరాయిడిజంలో ప్రసిద్ధ లక్షణం. థైరాయిడ్ గ్రంధి జీవక్రియను నియంత్రిస్తుంది. ఇది తక్కువగా హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు జీవక్రియను అందిస్తుంది. అప్పుడు శరీరం కొవ్వు నిల్వలను పెంచుకుంటుంది. అందుకే బరువు అతిగా పెరిగిపోతారు. గోళ్ళు, జుట్టు పల్చబడడం అనేది కూడా హైపోథైరాయిడిజంలో కనిపించే లక్షణాలే. థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు చర్మం, జుట్టు పొడిబారినట్టు అవుతుంది. కనుబొమ్మల దగ్గర కూడా ఉన్న వెంట్రుకలు కూడా రాలిపోతూ ఉంటాయి.
థైరాయిడ్ సమస్యలో కనిపించే లక్షణాలు సాధారణంగా ఉంటాయి, కాబట్టి ఎక్కువ మంది దీన్ని గుర్తించలేరు. స్త్రీలకు తరచూ కీళ్ల నొప్పులు రావడం, కండరాలు బలహీనంగా అనిపించడం వంటివి కూడా థైరాయిడ్ సమస్యగానే భావించాలి. దేనిపైనా ఏకాగ్రత కుదరకపోవడం, మానసికంగా బద్ధకంగా ఉండడం, ఏ పనీ చేయాలనిపించకపోవడం ఇవన్నీ కూడా థైరాయిడ్ గ్రంధిలో ఉన్న సమస్యలను సూచించేవే. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు థైరాయిడ్‌ను పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.