భార్యాభర్తలుగా మారిన తర్వాత తల్లిదండ్రులుగా మారాలని ఆరాటపడుతూ ఉంటారు. ఎంతోమంది అయితే కొంతమందికి మూడో నెలలో లేదా నాలుగో నెలలో గర్భస్రావం అవుతూ ఉంటుంది. అలా గర్భస్రావం అయినప్పుడు మహిళలదే తప్పుగా భావిస్తుంది సమాజం.
ఇంట్లో పెద్దవారు కూడా మహిళలని తప్పుపడుతూ ఉంటారు. భర్తకు ఎలాంటి సంబంధం లేదనుకుంటారు. నిజానికి భర్తలో ఉండే కొన్ని లోపాలు భార్య గర్భస్రావానికి కారణమవుతాయి. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అవగాహన లేక ప్రతిసారీ మహిళను నిందిస్తూ ఉంటారు.
భార్యకు గర్భస్రావం అయితే దానికి ఆమె మాత్రమే బాధ్యురాలు కాదు. భర్త కారణంగా కూడా ఆమెకు గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయి. భర్తలో ఎలాంటి లోపాలు ఉన్నప్పుడు భార్యకు గర్భస్రావం అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయో తెలుసుకోండి.
మగవారిలో కూడా పునరుత్పత్తి సమస్యలు లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువే. భర్త కారణంగా కూడా గర్భం దాల్చలేకపోతున్న మహిళల సంఖ్య సమాజంలో అధికంగానే ఉంది. మగవారి వీర్యకణాల్లో లోపాలు ఉంటే గర్భం ధరించినా కూడా ఆ గర్భం నిలబడకపోవచ్చు. తరచూ గర్భస్రావాలు జరిగితే కేవలం భార్య మీద నింద వేయకండి. భర్త కూడా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. భర్త వీర్యకణాలు లోపాలు ఉన్నప్పుడు అవి సరిగా ఎదగనప్పుడు లేదా వీర్యకణాల్లో డిఎన్ఏ లోపాలు ఉన్నప్పుడు గర్భం దాల్చిన కూడా త్వరగానే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు చెబుతున్నారు.
గర్భస్రావం అయినప్పుడు ఎందుకు ఆ గర్భస్రావం అయిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం భార్యాభర్తలిద్దరూ పరీక్షలు చేయించుకోవాలి. భర్తకు వీర్య కణాల ఎనాలసిస్ చేస్తారు. ఆ పరీక్షలో వీర్య కణాల్లో ఉన్న లోపాలు బయటపడతాయి. వీర్యకణాలు పూర్తిగా ఎదగకపోయినా లోపాలు ఉన్న కూడా అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వీర్యకణాల్లో డిఎన్ఏ లోపాలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కూడా భార్య గర్భం దాల్చిన కొన్ని రోజులకే గర్భస్రావం కావచ్చు.
భార్య గర్భం దాల్చిన వెంటనే తమలో ఏదీ లోపం లేదని అనుకుంటాడు భర్త. తనలోనే లోపం ఉంటే గర్భం దాల్చడమే కష్టం అని భావిస్తాడు. నిజానికి గర్భం దాల్చిన తర్వాత కూడా భర్త కారణంగా గర్భస్రావం అవ్వచ్చు. వీర్యకణాలు గర్భం దాల్చిన వరకు సహకరించి ఆ తర్వాత పిండం ఎదుగుదలకు సహకరించకపోవచ్చు. అలాంటి సమయంలో కూడా గర్భస్రావం జరిగే అవకాశం ఉంది.
గర్బస్రావం అయ్యాక గర్భాశయాన్ని పూర్తిగా శుభ్రం చేసుకున్న తర్వాతే ఇంటికి వెళ్ళాలి. చాలామంది గర్భస్రావం అయ్యాక గర్భాశయం క్లీన్ చేయించుకోకపోతే అందులో అబార్షన్ తాలూకు ముక్కలు ఉండిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇన్ఫెక్షన్లు పెరగవచ్చు. ఒక్కొక్కసారి ఆ ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారితే గర్భాశయాన్నే కోల్పోవాల్సి రావచ్చు. కాబట్టి గర్భస్రావం అయిన ప్రతిసారి పరిశుభ్రంగా క్లీన్ చేయించుకోవాలి. ఆ తర్వాతే గర్భం ధరించేందుకు ప్రయత్నించాలి.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)
టాపిక్