Dosa Pindi: దోశ పిండి పుల్లగా మారిపోతే ఈ చిట్కాలు పాటిస్తే పుల్లదనం తగ్గిపోయి, దోశెలు క్రిస్పీగా వస్తాయి
Dosa Pindi: ప్రతి ఇంటో ఇడ్లీ లేదా దోశ బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండాల్సిందే. దీని తయారీకి సిద్ధం చేసిన పిండి కొన్ని గంటల్లోనే పులిసి పోతుంది. అది పులిసి పోకుండా చేయాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకోండి.
ఆరోగ్యకరమైన అల్పాహారం అంటే గుర్తుకు వచ్చేది ఇడ్లీలు, దోశెలు. ఈ దక్షిణ భారతీయ వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇడ్లీ, దోశను తినేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడతారు. పిల్లలకు స్కూల్ ప్యాక్ చేయడానికి కూడా ఈ వంటకాలు ఈజీగా ఉంటాయి. కొబ్బరి చట్నీతో ఈ టిఫిన్లు తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఉదయం పిల్లల స్కూల్ లంచ్ సిద్ధం చేసేటప్పుడు దోశ పిండి పులిసిపోతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు కొంతమంది ఆ పిండిని పడేస్తారు. నిజానికి పడేయాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఆ పులుపును తగ్గించుకోవచ్చు.
కొబ్బరి పాలు
పిండి పుల్లగా మారితే అందులో కొబ్బరి పాలు లేదా కొబ్బరి పొడి కలపాలి. ఇలా చేయడం వల్ల పిండిలోని పులుపు తొలగిపోతుంది.
అల్లం పేస్ట్
దోశ పిండి రుచిలో కొద్దిగా పుల్లగా ఉంటే అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ను అందులో వేయచ్చు. ఈ రెమెడీ చేయడానికి, కొద్దిగా అల్లం, పచ్చిమిర్చిని తీసుకొని దాని పేస్ట్ తయారు చేయండి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను పిండిలో బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి.
బియ్యం పిండి లేదా ఉప్మా రవ్వ
దోశ పిండిలో కొద్దిగా బియ్యం పిండి లేదా ఉప్మారవ్వ లేదా ఇడ్లీ రవ్వ కలపడం వల్ల పిండిలో ఉండే పులుపు కూడా తగ్గుతుంది. పిండి పరిమాణం కూడా పెరుగుతుంది. మరో రోజుకు ఈ పిండి మిగులుతుంది. బియ్యం పిండి లేదా సెమెలినా కలిపాక అవసరమైనంత మేరకు నీటిని కూడా వేయాలి.
ఇడ్లీ, దోశె పిండి పులియకుండా ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. పిండిని గది ఉష్ణోగ్రత వద్దే ఒక ఎనిమిది గంటలు ఉంచితే త్వరగా పులిసిపోతుంది. కాబట్టి ఫ్రిజ్ లో కచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే ఉప్పు తక్కువగా కలపాలి. లేదా పూర్తిగా కలపకుండా ఫ్రిజ్ లో పెట్టుకోండి. దోశెలు వేసుకునే ముందు కొంత మొత్తాన్ని తీసి ఒక గిన్నెలో వేసి అందులో ఉప్పు కలుపుకోండి. దోశెలు లేదా ఇడ్లీలు వండే ముందే ఫ్రిజ్ లోంచి పిండి గిన్నెను బయట పెట్టుకోవాలి. అలాగే అందులో వేసిన మినపప్పు ఎక్కువై పోయినా కూడా పిండి త్వరగా పులుస్తుంది. మెంతులు కలిపినా కూడా పులిసే ప్రక్రియ వేగంగా మారుతుంది. కాబట్టి మెంతులు వేయడం మానేయాలి.