Sunday Motivation: ఆరోజు ఆమె చనిపోయి ఉంటే ఇప్పుడు ఐఏఎస్ అధికారి అయ్యేదా? ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదు
Sunday Motivation: సమస్యలు వస్తే కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించే వారి సంఖ్య ఎక్కువే. ఒక్కసారి ఈమె జీవితాన్ని చదవండి.. మరణించాలన్న కోరిక మరణిస్తుంది.

Sunday Motivation: తెలిసీ తెలియని వయసులో పెళ్లి. చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలు. వేధించే అత్త, రక్తం వచ్చేలా కొట్టే భర్త. వీటన్నింటినీ భరించింది సవితా ప్రధాన్. ఏళ్లు గడుస్తున్నా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేదు. కనీసం గర్భంతో ఉన్నప్పుడు కూడా పొట్ట నిండా ఆహారం తిననిచ్చేవారు కాదు అత్త, భర్త. అయినా జీవితం మీద ఆశతో బతికింది సవితా.
సవితా ప్రధాన్... మధ్యప్రదేశ్ లోని మండి గ్రామానికి చెందిన ఆదివాసి. ఆమె పదో తరగతి పూర్తి చేసింది. ఇలా పది పూర్తయిందో లేదో తన కన్నా 11 ఏళ్ళు పెద్దవాడికి ఇచ్చే అమ్మానాన్న పెళ్లి చేశారు.
ఆమెను కోడలిలా కాకుండా పని మనిషిలాగే చూసింది అత్తింటి కుటుంబం. ఎంత ఆకలేసినా అందరూ తిన్నాకే తినాలి, ఏమీ మిగలక పోతే తినకుండా పస్తులు ఉండాలి, కానీ మళ్ళీ వండకూడదు. నవ్వకూడదు. టీవీ చూడకూడదు. నలుగురితో మాట్లాడకూడదు. వీటిని ఉల్లంఘిస్తే రక్తం వచ్చేలా కొట్టేవాడు భర్త. అయినా పిల్లల కోసం అవన్నీ భరించింది.
ఇరవై ఏళ్ల వయసు రాకముందే అన్ని కష్టాలను చూసింది. ఆమెకు బతకాలన్న ఆశ రోజుకు తగ్గిపోతూ వస్తోంది. ఒకరోజు ఇక అత్త, భర్తతో వేగలేననుకుంది. తన చీరతో ఉరి వేసుకోవడానికి సిద్ధపడింది. అదే సమయంలో కిటికీలోంచి ఆమె అత్త ఆ దృశ్యాన్ని చూసింది... కానీ ఆపేందుకు ప్రయత్నించలేదు. కనీసం ఎందుకు ఇలా చేస్తున్నావని కూడా అడగలేదు. మానవత్వం లేని మనుషుల గురించి తన ప్రాణాన్ని ఎందుకు తీసుకోవాలనుకుంది సరిత. వెంటనే మెడకు చుట్టుకున్న చీరను తీసి పక్కన పడేసింది. ఇద్దరు పిల్లలను తీసుకొని బయటికి వెళ్లిపోయింది. ఓ బ్యూటీపార్లర్లో పనికి కుదిరింది. అలాగే పిల్లలకు ట్యూషన్లు చెప్పడం, వంట పనులు చేయడం... ఇలా దొరికిన పనులు చేసి పిల్లలను సాకింది. అలాగే ఆగిపోయిన చదివును మొదలుపెట్టింది. బీఏ పూర్తి చేసింది.
బీఏ పూర్తయ్యాక ఎమ్ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసింది. ఆమె చదువులో చాలా చురుకు. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. చదువు పూర్తయ్యాక మంచి జీతం వచ్చే ఉద్యోగం కోసం వెతుకుతుండగా యూపీఎస్సీ నోటిఫికేషన్ కనిపించింది. ఆ ఉద్యోగం ఎంత గొప్పదో ఆమె చూడలేదు. కేవలం ఆ ఉద్యోగం వల్ల వచ్చే జీతం చూసింది. ఆ జీతంతో తను, తన ఇద్దరు పిల్లలను చక్కగా పెంచుకోవచ్చని భావించింది. తన తల్లి సాయం తీసుకొని రాత్రి పగలు ఖాళీ దొరికినప్పుడల్లా చదివింది. చివరికి మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించింది. అప్పుడు ఆమె వయసు కేవలం 24 ఏళ్లు.
ఆమె ఇంత పెద్ద ఉద్యోగం సాధించినా కూడా భర్త వేధిస్తూనే ఉన్నాడు. ఆ వేధింపులను ఆమె భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసి విడాకులు తీసుకుంది. ఉద్యోగం సాధించాక తన మనసుకు నచ్చిన వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. తన ఇద్దరు పిల్లలతో ఇప్పుడు సంతోషంగా ఉంది. ఆ రోజు ఆత్మహత్య చేసుకొని ఉంటే ఆమె ఇప్పుడు ఇంత పెద్ద ఉద్యోగి అయ్యేది కాదు. అందుకే తనలాంటి ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని చెబుతోంది సవితా ప్రధాన్.
ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఎలాంటి వారి కోసం మీరు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నారో విశ్లేషించుకోండి. విలువ లేని వ్యక్తుల కోసం మీరు మీ ప్రాణాన్ని వృధాగా పోనివ్వకూడదు. మీకోసం మీరు బతకాలి. మీమీద ఆధారపడిన వాళ్ల కోసం బతకాలి. గొప్పగా జీవించేందుకు బతకాలి. ఒక్కసారి ఏదైనా సాధించి చూడండి. మీ బతుకుపై ఆశ కచ్చితంగా పుడుతుంది.