Dark home: ఇంట్లో కళ లేకుండా చీకటిగా ఉంటోందా? ఈ మార్పులతో వెలుతురు నిండుతుంది-if not getting proper lighting in home then follow these tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dark Home: ఇంట్లో కళ లేకుండా చీకటిగా ఉంటోందా? ఈ మార్పులతో వెలుతురు నిండుతుంది

Dark home: ఇంట్లో కళ లేకుండా చీకటిగా ఉంటోందా? ఈ మార్పులతో వెలుతురు నిండుతుంది

Koutik Pranaya Sree HT Telugu
Oct 28, 2024 07:07 PM IST

Dark home: ఇంట్లో చీకటిగా ఉంటోందా? వెలుతురుతో నిండిపోవాలంటే ఇంట్లో కొన్ని మార్పులు చేయాల్సిందే. ఒక్కసారి కాస్త డబ్బు ఖర్చుపెడితే జీవితాంతం ఇల్లు ప్రకాశవంతంగా ఉంటుంది.

చీకటి గదికి చిట్కాలు
చీకటి గదికి చిట్కాలు (freepik)

కొన్ని ఇళ్లలో వెలుతురు చాలా బాగా వస్తుంది. మరికొన్ని ఇళ్లలో చీకటిగా అనిపిస్తుంది. సూర్యరశ్మి సరిగ్గా పడకపోవడం వల్లనే ఈ సమస్య. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోకి తక్కువ వెలుతురు వచ్చినా కూడా ఇల్లు ప్రకాశవంతంగా అనిపిస్తుంది. అవేంటో చూడండి.

1. పరదాలు:

కిటికీల్లోంటి వచ్చే వెలుతురును పరదాలు ఆపేస్తాయి. మీరెలాంటి పరదాలు ఎంచుకుంటున్నారనేది చాలా ముఖ్యం. సన్ షేడ్స్ వాడటం చాలా మంచిది. ఇవి ఎండవల్ల వచ్చే వేడిని గది లోపలికి రానివ్వవు. కానీ, వెలుతురు మాత్రం ఇస్తాయి. కిటికీకి అడ్డుగా ఏదో పెట్టినట్లు చీకటిగా అనిపించదు. చలికాలంలో చలినుంచి తట్టుకోడానికి షీర్ కర్టెయిన్లు వాడొచ్చు. అవి పారదర్శకంగా ఉంటాయి. దాంతో వెలుతురు వస్తుంది. అలాగే మీకసలు కిటికీలకు అడ్డుగా ఏమీ పెట్టాల్సిన అవసరం లేకపోతే అలాగే వదిలేయడం ఉత్తమం.

2. లేత రంగులు:

గది గోడలకున్న రంగులు ఇంటి వెలుతురు మీద బాగా ప్రభావం చూపుతాయి. లేత రంగులుంటే గది ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ముదురు రంగు వల్ల చీకటి పెరుగుతుంది. ప్రతీ రంగుకు LRV- లైట్ రిఫ్లెక్టెన్స్ వ్యాల్యూ అని ఉంటుంది. అది ఎంత ఎక్కువుంటే ఆ రంగు వెలుతురును అంతలా పరావర్తనం చేస్తుందన్న మాట. ఉదాహరణకు ఏ రంగునూ పరావర్తనం చేయని నలుపు రంగు ఎల్‌ఆర్‌వి సున్న ఉంటే.. అన్ని రంగులను పరావర్తనం చేసే తెలుపు రంగు ఎల్‌ఆర్‌వి 100 ఉంటుంది. ఈ విషయం పెయింట్ డబ్బా మీద రాసి ఉంటుంది. కనీసం ఎల్‌ఆర్‌వి 70, ఆపై సంఖ్య ఉన్న రంగులను ఎంచుకుంటే గదిలో చీకటి అనిపించదు.

3. సీలింగ్ రంగు:

గది గోడలకే కాదు సీలింగ్ కు కూడా డిజైన్ల కోసం ముదురు రంగు వేసేస్తున్నారు. అలా కాకుండా తెలుపు రంగు ఎంచుకుంటే మంచిది. గది పెద్దగా కనిపించడంతో పాటూ, వెలుతురూ బాగుంటుంది.

4. మెటాలిక్ ఫినిషింగ్:

గోల్డ్, సిల్వర్, రోజ్ గోల్డ్ లాంటి రంగులు మెటాలిక్ ఫినిషింగ్ ‌తో ఉంటాయి. అలంకరణ వస్తువులు, ఫోటో ఫ్రేములు, బల్బు హోల్డర్లు.. ఇలాంటివన్నీ మెటాలిక్ ఫినిషింగ్ ఉన్నవి వాడితే వాటి మెరుపు వల్ల కాస్త వెలుతురు పెరుగుతుంది. ప్రకాశవంతంగా అనిపిస్తుంది.

5. పెద్ద కిటికీలు:

ఇప్పుడు పైన సీలింగ్ నుంచి కింద ఫ్లూర్ తాకే కిటికీలు ట్రెండ్. బాల్కనీ వైపు అలాంటి కిటికీ పెట్టించుకోండి. ఇల్లు మొత్తం వెలుతురుతో నిండిపోతుంది.

6. గ్లాస్ డూర్ ఇన్సర్ట్స్:

ఇంటికి ఉండే ముఖ్య ద్వారం నుంచే వెలుతురు ఎక్కువగా వస్తుంది. దాన్ని గనక మూసి ఉంచితే సగం వెలుతురు ఆపేసినట్లే. కానీ ప్రైవసీ కోసం బారుగా తెరిచి ఉంచలేం. అలాంటప్పుడు ఆ తలుపులకే గ్లాస్ ఇన్సర్ట్స్ వచ్చేలా చూసుకోవాలి. అలాగే ముఖ్య ద్వారం పక్కనుండే కిటికీలకు కూడా గాజు అద్దాలు వాడితే సరిపోతుంది. వెలుతురులో వచ్చే మార్పు మీరే చూస్తారు.

7. ఫ్లూరింగ్, టైల్స్ :

నలుపు, వుడెన్, ముదురు రంగు ఫ్లూరింగ్ వల్ల గదిలో చీకటి ఎక్కువవుతుంది. కాబట్టి లేత రంగు ఫ్లూరింగ్ ఉండాలి. ఒకవేళ కార్పెట్ వేస్తే వాటిని కూడా ఎరుపు, నీలం రంగులు కాకుండా లేద గులాబీ, లేత నీలం.. లాంటి రంగుల్లో ఎంచుకోవాలి. కిచెన్, బాత్రూంలలో వాడే టైల్స్ కూడా నలుపు రంగు కాకుండా తెలుపు రంగువి ఎంచుకోవాలి. వీటిని మెయింటెన్ చేయడం కష్టమే కానీ.. చీకటి ఉండకూడదంటే తప్పదు.

Whats_app_banner