Kasuri methi Making: కసూరి మేతిని ఇలా ఇంట్లోనే తయారుచేసుకుంటే ఏడాదంతా వాడుకోవచ్చు
Kasuri methi Making: వంటల్లో కసూరి మేతి వేస్తే ఆ రుచే వేరు. ఆ వంటకం ఘుమఘుమలాడిపోవడం ఖాయం.
Kasuri methi Making: నాన్ వెజ్ కూరలకు, బిర్యానీలకు కసూరి మేతి ఉండాల్సిందే. ఇది మంచి సువాసనను, రుచిని అందిస్తుంది. కసూరి మేతిని అందరూ మార్కెట్లో కొనుక్కుంటారు. నిజానికి దీన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. దీన్ని చాలా సులువుగా మీరే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఒకసారి నేర్చుకుంటే అవసరమైనప్పుడల్లా ఇంట్లోనే తయారు చేయొచ్చు.
కసూరి మేతి తయారీ ఇలా
1. కసూరి మేతి తయారు చేయడానికి ముందుగా మెంతి ఆకులను కొని తెచ్చుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి.
2. ఇప్పుడు ఒక గిన్నె నీటిలో ఉప్పును వేసి బాగా కరిగేలా చేయాలి. ఈ మెంతి ఆకులను అందులో వేసి ఓ పావుగంట పాటు వదిలేయాలి.
3. తరువాత ఆ ఆకులను తీసి నీళ్లు పారబోయాలి. ఆకులను ఒక పొడి వస్త్రంలో వేసి నీరంతా పీల్చుకునేలా నొక్కాలి.
4. తడి మొత్తం పోయేలా గాలికే ఆరబెట్టాలి. ఇలా మూడు రోజులు పాటు గాలికి ఆరబెడితే అవి పొడిగా మారుతాయి.
5. పొడిగా అయిన వాటిని ఎర్రటి ఎండలో మళ్లీ ఆరబెట్టాలి. ఓ గంటసేపు ఎండలో ఎండితే చాలు అవి పూర్తి పొడిగా మారుతాయి.
6. ఒకవేళ ఎక్కడైనా తడి దనం ఉంది అని సందేహం వస్తే వాటిని ఓవెన్లో ఒక నిమిషం పాటు ఉంచండి. మొత్తం తడి పోతుంది.
7. ఇంట్లో ఓవెన్ లేని వారు పెనం లేదా కళాయిలో వేసి కాసేపు వేయించినా చాలు. అవి పొడిగా మారిపోతాయి.
8. అంతే... కసూరిమేతి సిద్ధమైనట్టే. వీటిని గాలి చొరబడని డబ్బాల్లో వేసి నిల్వ చేయండి. ఒక్కసారి చేసుకుంటే ఏడాదంతా వాడుకోవచ్చు.
కసూరి మేతిని తయారు చేసేది మెంతి ఆకులతోనే కాబట్టి వాటిల్లో ఉండే పోషకాలన్నీ కసూరి మేతి ద్వారా కూడా అందుతాయి. డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న వారు కసూరి మేతిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. కసూరి మేతి మసాలా దినుసుల జాబితాలోకే వస్తుంది. ఇది మంచి రుచిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది. కసూరి మేతి రోజు తింటే మలబద్ధకం సమస్య రాదు. బరువు తగ్గేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ట్రైగ్లిజరైడ్స్ ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి జీర్ణ సమస్యలు ఏవీ రాకుండా అడ్డుకుంటాయి.
దీనిలో ఫైబర్ కూడా ఎక్కువే. దీన్ని తినేవారు మలబద్ధకం సమస్య బారిన పడకుండా ఉంటారు. కస్తూరి మేతిని క్రమం తప్పకుండా తింటే పేగుల్లో మంట పుట్టడం, విరేచనాలు వంటివి రాకుండా ఉంటాయి. కసూరి మేతిని క్యారెట్, బంగాళదుంపలకు జతగా ఉండితే చాలా టేస్టీగా ఉంటుంది. కసూరి మేతి వేసి బంగాళదుంపల కూరను వండితే రుచి అదిరిపోతుంది. ప్రోటీన్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ b6, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, నియాసిన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్ కే, ఫాస్పరస్ వంటివన్నీ దీని ద్వారా లభిస్తాయి.
ఇంట్లోనే ఉన్న మహిళలు కసూర్ మేతిని బిజినెస్ గా కూడా ఎంచుకోవచ్చు. ఇంట్లోనే కసూరి మేతిని తయారు చేసి చిన్న చిన్న ప్యాకెట్లను కట్టి చుట్టుపక్కల ఉన్నవారికి అమ్ముకోవచ్చు.