Thursday Motivation: కరిగిపోతే కానీ తెలియదు కాలం విలువ, అది మీ చేతుల్లో ఉన్నప్పుడే వినియోగించుకోండి
Thursday Motivation: ఎవరిని అడిగినా బాల్యం చాలా తీయగా ఉంటుందనే చెబుతారు. ఎందుకంటే ఆ కాలం మళ్ళీ రాదు. అదే కాదు గడిచిపోయిన కాలం ఎప్పుడూ తీయగానే ఉంటుంది. అందుకే కాలం మీ చేతిలో ఉన్నప్పుడే దాన్ని చక్కగా వినియోగించుకోవాలి.
Thursday Motivation: కాలం... ఇదొక నిరంతర నదీ ప్రవాహంలాంటిది. ఎవరి కోసమో ఒక్క సెకను కూడా ఆగదు. నిత్యం కొత్త రోజులను, వారాలను, నెలలను మోసుకొస్తూనే ఉంటుంది. గడిచిపోయిన క్షణాన్ని తీసుకురావడం ఈ ప్రపంచంలో వందల కోట్ల ఆస్తులున్న బిలియనీర్లే కాదు, ఎంత గొప్ప సైంటిస్ట్ వల్ల చేతకాదు. కాబట్టి కాలం విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ క్షణాన్ని ఇప్పుడే ఆస్వాదించాలి. అర్థవంతంగా వినియోగించుకోవాలి.
కాలం విచిత్రమైనది. అది అన్నింటినీ తనలో లీనం చేసుకుంటుంది. అందుకే కాలం గురించి చెబుతూ నిఘంటువులు ‘కలయతి ఇతి కాల:’ అనే అన్నాయి. చెడునైనా, మంచినైనా తనలోనే ఇముడ్చుకునేది కాలం. ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల్లో కాలాన్ని లెక్క కట్టే శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉంది. కాలం విలువను అర్థం చేసుకునేది మనిషే. గడుస్తున్న ఒక్క క్షణం మీ ఆయుష్షు నుంచి తరిగిపోతుందని అర్థం చేసుకోవాలి. రేపు సాధించాలనుకున్నది ఈరోజే సాధిస్తే గడిచిపోయిన కాలం గురించి బాధపడాల్సిన అవసరం భవిష్యత్తులో రాదు.
ఒకప్పుడు మనిషి ఆయుష్షు నూరేళ్లు. కానీ ఇప్పుడు 70 ఏళ్ళు బతకడమే కష్టంగా మారింది. కాబట్టి వాయిదా పద్ధతులను మానేసి రేపు చేయాల్సింది ఈరోజే చేయండి. లేకపోతే ‘అయ్యో అప్పుడు చేసుంటే బాగుండేదే’ అని బాధపడాల్సిన సమయం వస్తుంది. యవ్వనంలో చేయాల్సిన పనులు యవ్వనంలోనే చేయాలి. యవ్వనంలో ఎంత కష్టపడితే వృద్ధాప్యంలో అంతగా సుఖపడవచ్చని పెద్దలు చెబుతారు. ఏ ప్రాయంలో చేయాల్సింది ఆ ప్రాంతంలో చేయకపోతే కాలం మళ్ళీ తిరిగి రాదు.
మీరు జీవితంలో ఏది సాధించాలనుకున్నా ఈ క్షణం నుంచి దానికోసం పనిచేయడం మొదలుపెట్టండి. లేకుంటే కరిగిపోయిన కాలాన్ని తలుచుకొని బాధపడాల్సి వస్తుంది. జీవితంలోకి తొంగి చూసుకున్నప్పుడు వృధా చేసిన సమయాలే కనిపిస్తాయి.
వేలకోట్ల నువ్వు సంపాదించడమే విజయం కాదు. జీవితంలో ఆనందం, సంతోషం ఉన్న క్షణాలను పోగేసుకోవడం విజయమే. కాలాన్ని కేవలం డబ్బు సంపాదించడం కోసం, విజయం సాధించడం కోసం మాత్రమే కాదు... ఆనందంగా కొన్ని లక్షణాలు జీవించడం కోసం కూడా వినియోగించుకోండి. లేకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే విజయం కోసం మీరు పరిగెత్తిన పరుగులు, సంపద పోగు కోసం మీరు కష్టపడిన కష్టమే కనిపిస్తుంది. ఆ సంపదనం అనుభవించిన రోజు ఒకటి ఉండదు. యమధర్మరాజు మీ ముందుకు వచ్చాక ఒక గంట జీవితం అదనంగా ఇవ్వమని అడిగినా కూడా ఒప్పుకోడు. మీరు సాధించిన విజయాలు, సంపదను వదిలి పూర్తి చేతులతో వెళ్లాల్సిందే. కాబట్టి ఈ క్షణాన్ని ఆనందంగా జీవించేందుకు వినియోగించుకోండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పని ఈ క్షణమే ప్రారంభించండి.