Gardening: మెంతికూర, పాలకూరను ఇలా ఇంట్లోనే పెంచితే, ఆకలు నిండుగా వస్తాయి-if fenugreek and lettuce are grown at home like this the leaves will be full ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gardening: మెంతికూర, పాలకూరను ఇలా ఇంట్లోనే పెంచితే, ఆకలు నిండుగా వస్తాయి

Gardening: మెంతికూర, పాలకూరను ఇలా ఇంట్లోనే పెంచితే, ఆకలు నిండుగా వస్తాయి

Haritha Chappa HT Telugu
Nov 07, 2024 12:30 PM IST

Gardening: శీతాకాలంలో మెంతులు, పాలకూర ఎక్కువగా తింటారు. అవి ఈ సీజన్లో అధికంగా పెరుగుతాయి. మీరు వీటిని కొనే కన్నా ఇంట్లోనే చిన్న చిట్కాలతో పెంచితే అవి నిండుగా ఆకులతో విరగకాస్తాయి.

మెంతికూర, పాలకూర పెంపకం
మెంతికూర, పాలకూర పెంపకం (Shutterstock)

ఈ రోజుల్లో కిచెన్ గార్డెనింగ్ ఒక ట్రెండ్ గా మారింది. చాలా మంది ఇంట్లోనే సీజనల్ కూరగాయలను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్వచ్ఛమైన, పురుగులు మందులు వాడని తాజా కూరగాయలు తినాలంటే, వాటిని ఇంట్లో పెంచుకోవడం మంచిది. మార్కెట్ లో దొరికే ఆకుకూరలతో పోలిస్తే ఇంట్లోనే పండించినవి ఫ్రెష్ గా ఉంటాయి. వాటితో వండిన వంటకాలు కూడా ఎంతో రుచిగా ఉంటాయి. ఈ సీజన్ లో మీ కిచెన్ గార్డెన్ లో పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరలను పండించడానికి ప్రయత్నించండి. అవి చాలా సులువుగా పెరుగుతాయి. వాటిని పెంచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

పాలకూర పెంపకం

కిచెన్ గార్డెన్ లో పాలకూర పండించాలంటే ముందుగా దానికి మట్టిని సిద్ధం చేసుకోవాలి. పాలకూర మంచి నాణ్యమైన మృదువైన నేలలో పండించాలి. నేల సారవంతం కావడానికి, దానికి వర్మీ కంపోస్టు, పేడ ఎరువు కలపండి. ఇప్పుడు పాలకూర గింజలను మట్టిలో కాస్త లోతుగా నొక్కండి. పాలకూర పెరగడానికి ఎక్కువ నీరు అవసరం లేదు, కాబట్టి ఒకటి లేదా రెండు రోజులకు ఒకసారి నీరు పోయడం మంచిది. మట్టిలో తేమ ఉండేలా చూసుకోండి. ఈ విధంగా దాదాపు రెండు వారాల పాటూ చూసుకుంటే పాలకూర ఆకులు పెరగడం మొదలవుతాయి. ఈ పాలకూరపై పురుగుల మందులు చల్లలేదు కాబట్టి, ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.

మెంతికూర ఎలా పెంచాలి?

పాలకూర మాదిరిగానే మెంతికూరను కూడా పెంచవచ్చు. మెంతులతో సులువుగా మెంతి మొక్కలను పెంచేయచ్చు. ఇందుకోసం వర్మీ కంపోస్టు, పేడ ఎరువును మట్టిలో వేసి మట్టి నాణ్యతను పెంచుకోవాలి. మెంతులు నీటిలో ఒక రాత్రంతా నానబెట్టాలి. తరువాత తీసి తడిగుడ్డలో ఒకరోజు ఉంచండి. అవి మొలకలు రావడం మొదలవుతాయి. అలా మొలకలు వస్తున్నప్పుడు వాటిని మట్టిలో నాటండి. ప్రతి రోజూ నీటిని చిలకరిస్తూ ఉండండి. ఎక్కువ నీరు పోస్తే మొలకలు కుళ్లిపోతాయి. కాబట్టి చాలా తక్కువగా నీళ్లు చల్లాలి. ఇలా ఒక మూడు వారాలు చూసుకుంటే చాలు మెంతి ఆకులు పెరగడం మొదలవుతాయి. ఈ మెంతికూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

పాలకూర, మెంతికూర రెండూ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. పాలకూరలో నిండుగా పోషకాలు ఉంటాయి. పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు ఉంటాయి. పాలకూరను తరచూ తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డుకోవచ్చు.

మెంతి కూర వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. నాడీ వ్యవస్థకు, పక్షవాతానికి, మలబద్ధకానికి ఇది ఔషధంలా పనిచేస్తుంది. దగ్గు, ఉబ్బసం, ఊబకాయం, సైనస్ వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా మెంతికూర చక్కగా పనిచేస్తుంది. కాబట్టి పాలకూర, మెంతికూరను ఇంట్లోనే పెంచుకుని వాడుకోవడం మంచిది.

Whats_app_banner