ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ పై ఎదురుదాడి మొదలుపెట్టింది. పహల్గాంలోని ఉగ్రవాద చర్యకు ధీటైన సమాధానం చెబుతోంది. బోర్డర్ వెంబడి కాల్పులు జరుగుతున్నాయి. యుద్ధం ఎంత చిన్నదైనా కూడా దాని ప్రభావం ఆ దేశంలో నివసిస్తున్న సామాన్య ప్రజలపై కచ్చితంగా ఉంటుంది.
మేము నేరుగా యుద్ధంలో పాల్గొనడం లేదు కదా ఇక మనపై ఎందుకు ప్రభావం.. అనుకోవచ్చు. మీకు తెలియకుండానే మీ హృదయం, మనస్సులపై లోతైన అనుభూతిని యుద్ధం కలిగిస్తుంది. మీకు తెలియకుండానే భయం, ఒత్తిడి వంటివి మీలో మొదలైపోతాయి. దీన్నే యుద్ధ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఆంగ్లంలో దీన్ని వార్ సిండ్రోమ్ అని లేదా వార్ ట్రామా సిండ్రోమ్ అని పిలుచుకుంటారు.
దేశంలో యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు ఒక వ్యక్తిని లోపల నుండి విచ్ఛిన్నం చేసే సిండ్రోమ్ ఇది. దీని గురించి ఆ వ్యక్తికి కూడా తెలియకపోవచ్చు. ఎంతోమందికి ఇలాంటి ఒక సిండ్రోమ్ ఉంటుందని కూడా తెలియదు. కానీ యుద్ధ పరిస్థితులు మీకు తెలియకుండానే మిమ్మల్ని లోపల నుంచి తినేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
వార్ సిండ్రోమ్ అనేది మీకు ఏదైనా పెద్ద గాయం తగలడం వల్ల లేదా ప్రమాదం జరిగిన తర్వాత యుద్ధం వంటి పరిస్థితులలో ఏర్పడే ఒక వ్యాధి. ఒక వ్యక్తి తన ప్రాణాలకు ముప్పు కలుగుతుందని భావించినప్పుడు లేదా తీవ్ర హింసను చూసినప్పుడు అతని మనసు ఆ ఒత్తిడిని భరించలేక పోతుంది. ఆ ఒత్తిడి క్రమంగా వారు సిండ్రోమ్ గా మారుతుంది. ఇది అధికంగా మారితే డిప్రెషన్ బారిన పడవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవచ్చు. చిన్న చిన్న విషయాలకి భయం వేయవచ్చు.
వార్ సిండ్రోమ్ తో బాధపడే వారిలో పీడకలలు అధికంగా వస్తాయి. వారు చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న శబ్దాలకు ఆందోళన చెందుతూ ఉంటారు. ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి గట్టిగా పిలిచినా షాక్ అవుతారు. అలాగే ఆ వ్యక్తి ఒంటరిగా, నిరాశగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తాడు. యుద్ద విశేషాలను పదే పదే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు.
ఈ వార్ సిండ్రోమ్ అనేది సామాన్య ప్రజలనే కాదు యుద్ధంలో పాల్గొనే సైనికులను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాగే యుద్ధ ప్రాంతాలకు దగ్గరగా నివసించే పౌరులు, చిన్న పిల్లలు అధికంగా దీని బారిన పడతారు. యుద్ధం కొన్ని రోజుల్లోనే ముగిసిపోయినా ఈ వార్ సిండ్రోమ్ తగ్గాలంటే మాత్రం మనుషులలో ఏళ్ల సమయం పడుతుంది.
వార్ సిండ్రోమ్‌ని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ తమకు తామే మోటివేట్ చేసుకోవాలి. అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడాలి. కుటుంబం, స్నేహితుల మద్దతు తీసుకోవాలి. మనసుకు ప్రశాంతతను ఇచ్చే ధ్యానం, యోగా వంటివి చేయాలి.
వార్ సిండ్రోమ్ అనేది ఒక నిశ్శబ్ద హంతకుడు. అతడు మిమ్మల్ని లోపల నుండే నాశనం చేయగలడు. కాబట్టి మీరు మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశాన్ని కాపాడే ప్రక్రియలోనే యుద్ధం జరుగుతుంది. దేశమే లేకపోతే మనకు ఈ రక్షణే ఉండదు. కాబట్టి దేశాన్ని కాపాడుకోవాలంటే అప్పుడప్పుడు యుద్ధం చేయాల్సిందే. ఆ యుద్ధానికి మీరు మానసికంగా సిద్ధం అవ్వాల్సిందే.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)