Brain Tumor Early Signs: మెదడులో కణితి ఏర్పడితే ప్రారంభంలో ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి, నిర్లక్ష్యం చేస్తే మరణమే
Brain Tumor Early Signs: బ్రెయిన్ ట్యూమర్ అనేది ప్రపంచంలో నాల్గవ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. బ్రెయిన్ ట్యూమర్ ప్రాణాంతకమైనది. మెదడులో కణితి ఏర్పడితే కొన్ని ప్రారంభ లక్షణాలు ఉంటాయి. వీటిని చాలా మంది తేలికగా తీసుకుంటారు.
బ్రెయిన్ ట్యూమర్ ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి. దాని లక్షణాలను ప్రారంభ దశలో గుర్తించడం కొంచెం కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. లక్షణాలు కనిపించినప్పటికీ, చాలా మంది వాటిని సాధారణ ఆరోగ్య సమస్యలుగా భావించి మర్చిపోతారు. బ్రెయిన్ ట్యూమర్ వస్తే కనిపించే అత్యంత సాధారణ లక్షణం దీర్ఘకాలిక తలనొప్పి. దీన్ని చాలా మంది పట్టించుకోరు. మానసిక ఆందోళన, డీహైడ్రేషన్ వంటి సమస్యల వల్ల కూడా తలనొప్పి వస్తుంది. కానీ బ్రెయిన్ ట్యూమర్ సూచించే ప్రారంభ లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.
బ్రెయిన్ ట్యూమర్ తలనొప్పి
బ్రెయిన్ ట్యూమర్స్ కు సంబంధించిన లక్షణాల్లో తలనొప్పి సాధారణమేనని వైద్యులు చెబుతున్నారు. ఈ తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు రోజులో ఎక్కువ సార్లు తతలనొప్పి రావచ్చు. కొందరికి ఉదయం పూట తలనొప్పి వచ్చి వాంతులు కూడా అవుతాయి. ఇలా తలనొప్పి పదే పదే వస్తుంటే నిర్లక్ష్యం వహించకండి. ఎందుకైనా మంచిది మెదడు ఆరోగ్యాన్ని పరీక్షించుకోండి.
మెదడులో సమస్యలు
మెదడులో ఉన్న సమస్యలే మెదడు కణితులకు దారితీస్తాయి. మూర్ఛ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా బ్రెయిన్ ట్యూమర్ రావచ్చు. అయితే బ్రెయిన్ ట్యూమర్ మెదడులోని న్యూరాన్లను చికాకుపెడుతుంది. దీనివల్ల కండరాల సంకోచాలు, తిమ్మిరి, జలదరింపు ఏర్పడతాయి. ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
దృష్టి లోపాలు
మెదడులో ఉండే సమస్యలు లేదా బ్రెయిన్ ట్యూమర్ వంటివి కంటిలోని ఆప్టిక్ నరాలను ప్రభావితం చేస్తాయి. ఒక్కోసారి దృష్టి లోపానికి కూడా దారితీస్తాయి. మరికొందరు రోగులకు డిప్లోపియా వంటి కంటి సమస్యలు రావచ్చు. మీకు కంటి చూపులో ఎలాంటి తేడాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకండి. అవి మెదడులోని కణితిని సూచించవచ్చు.
నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు
పై లక్షణాలన్నింటితో పాటు కొందరికి వినికిడి లోపం కూడా రావచ్చు. పిల్లలు, పెద్దలు, మధ్య వయస్కుల్లో.. అకస్మాత్తుగా వినికిడి లోపం ఎదురైతే దీని గురించి వైద్యుడిని సంప్రదించండి. కొంతమంది నడుస్తున్నప్పుడు సరిగా నడవలేక తూగిపోతూ ఉంటారు. నడకలో ఇబ్బంది ఎదురైతే ఏమాత్రం ఆలస్యం చేయకండి. కదలికను నియంత్రించే లేదా సమన్వయం చేసే మెదడు ప్రాంతమైన సెరెబెల్లమ్ లో కణితులు తలెత్తినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. దీనితో పాటు, మెదడులోని ఒక భాగంలో బలహీనత లేదా తిమ్మిరి కూడా మెదడు కణితికి హెచ్చరిక సంకేతంగానే భావించాలి.
మెదడులో కణితులు ఏర్పడితే అభిజ్ఞా పనితీరును ప్రభావితం చేస్తాయని చెప్పలేం. మెదడులో కణితి ఉన్న ప్రదేశాన్ని బట్టి జ్ఞానం ప్రభావితం కావచ్చు, కానీ మెదడులోని కొన్ని ప్రాంతాలలో కణితులు వస్తే మాత్రం అభిజ్ఞా క్షీణత మొదలువుతుంది. వారు సరిగా మాట్లాడలేరు. ప్రవర్తన అసాధారణంగా అనిపిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
బ్రెయిన్ ట్యూమర్స్ అంటే క్యాన్సరా?: మెదడులో కనిపించే కణితులన్నీ క్యాన్సర్ కావు. ఎందుకంటే కొన్ని ఎలాంటి హాని చేయనివి కూడా ఉంటాయి. ప్రాణాంతకం కాని కణితులను తొలటగిస్తే రోగులు సాధారణ జీవితాన్ని గడుపుతారు.
బ్రెయిన్ ట్యూమర్ జన్యుపరమైన సమస్య: మెదడులో పెరిగే ఈ కణితులలో కొన్ని వంశపారంపర్యంగా వస్తాయి. అన్ని కణితులు వంశపారంపర్యమైనవి కావు.
బ్రెయిన్ ట్యూమర్ వృద్ధుల్లోనే వస్తుందా: బ్రెయిన్ ట్యూమర్ కేవలం వృద్ధులను మాత్రమే ప్రభావితం చేయదు, ఎందుకంటే ఇది పిల్లలు, యువకులు, మధ్య వయస్కులతో సహా ఏ వయస్సులోనైనా సంభవిస్తుంది.
మొబైల్ ఫోన్ ను అతిగా వాడితే వస్తుందా?: ప్రస్తుతం సెల్ ఫోన్ల వాడకం వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు లేవు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
ఇది కూడా చదవండి:
సంబంధిత కథనం
టాపిక్