తినే ఆహారంలో ఉప్పును తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఉప్పు అధికంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు. అయితే అదే వైద్యులు ఉప్పును పూర్తిగా తీసుకోకపోయినా కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉప్పు మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఎంత తీసుకోవాలో వివరిస్తున్నారు.
ఉప్పు అంటే సోడియం క్లోరైడ్. సోడియం మన శరీరంలో కీలక పాత్ర పోషించే ఒక ఎలక్ట్రోలైట్. కాబట్టి సోడియం మనకు ఖచ్చితంగా కావాల్సిన పోషకమే. దాన్ని పూర్తిగా తగ్గిస్తే కొన్ని రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.
ఎప్పుడైతే మీరు ఉప్పుని తీసుకోవడం చాలా వరకు తగ్గించేస్తారో అప్పుడు రక్తంలో సోడియం స్థాయిలు తగ్గిపోతాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. రక్త కణాలలో, చుట్టుపక్కల ద్రవ సమతుల్యతను నియంత్రించడానికి సోడియం ఎంతో సహాయపడుతుంది. ఎప్పుడైతే సోడియం తగ్గిపోతుందో శరీరంలో నీటి స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల కణాలు ఉబ్బిపోతాయి. మెదడులోని కణాలు వాచినట్టు అవుతాయి. దీనివల్ల నాడీ వ్యవస్థ కూడా పనితీరు దెబ్బతింటుంది. రక్తంలో తక్కువ సోడియం స్థాయిలు ఉండడం ప్రమాదకరం. దీన్ని హైపోనాట్రేమియా అంటారు.
శరీరంలో ఉప్పు తగ్గడం వల్ల వచ్చే వ్యాధి హైపోనాట్రేమియా. ఈ వ్యాధి వస్తే వికారం, వాంతులు వచ్చినట్టు అనిపిస్తాయి. తలనొప్పిగా ఉంటుంది. ఏ విషయమూ త్వరగా అర్థం కాదు. గందరగోళంగా అనిపిస్తుంది. తీవ్ర అలసటగా, శక్తిహీనంగా అనిపిస్తుంది. మగతగా ఉంటుంది. చిరాకు, కోపం త్వరగా వస్తాయి. కండరాలు బలహీనంగా అవుతాయి.ఈ వ్యాధి తీవ్రంగా మారితే మూర్ఛ వచ్చి కోమాలోకి వెళ్లిపోతారు. మరణం కూడా సంభవించవచ్చు.
మన ఆరోగ్యంలో నరాల వ్యవస్థది ముఖ్య పాత్ర. నరాలు బలహీనంగా మారితే ఎన్నో సమస్యలు వస్తాయి. కండరాల పనితీరు కూడా సోడియం తగ్గిపోవడం వల్ల మారిపోతుంది. అలాగే ఎప్పుడైతే శరీరంలో లేదా రక్తంలో సోడియం స్థాయిలు పూర్తిగా పడిపోతాయో అప్పుడు డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. శరీరం తనకు కావాల్సిన నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. అలాగే శరీరంలో సోడియం స్థాయిలు తగ్గినప్పుడు ఇన్సులిన్ నిరోధకత కూడా పెరిగిపోతుంది. అంటే టైప్2 డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కొన్ని అధ్యయనాలు ఈ విషయాన్ని నిర్ధారించాయి.
సోడియం ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుందన్నది నిజమే. అలాగే సోడియం పూర్తిగా తగ్గించడం వల్ల కూడా రక్తపోటు పడిపోయే అవకాశం ఉంటుంది. ఇది కూడా గుండెకు హాని చేస్తుంది. సోడియం అవసరానికి మించి శరీరానికి అందించకపోతే గుండె సమస్యలు వస్తాయి. మరణ ప్రమాదం కూడా అధికంగానే ఉంటుంది.
హైపోనాట్రేమియా వ్యాధి ఎక్కువగా పెద్ద వయసు వారిలో కనిపిస్తుంది. అలాగే మూత్ర విసర్జనకు మందులు తీసుకునేవారు, యాంటీ డిప్రెసెంట్ వంటివి తీసుకునే వారిలో కూడా వచ్చే అవకాశం ఉంది. గుండె, మూత్రపిండాలు, కాలేయ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా సోడియం తగ్గించడం వల్ల త్వరగా హైపోనాట్రేమియా బారిన పడవచ్చు.
ఉప్పు మన ఆరోగ్యానికి అత్యవసరమైనది. అయితే దాన్ని మితంగానే తీసుకోవాలి. శరీరం సరిగా పనిచేయాలంటే కొంత మొత్తంలో సోడియం అవసరమవుతుంది. కానీ రుచి కోసం ఎంతోమంది ఎక్కువ ఉప్పును వేసుకుంటారు. దీని వల్ల హైబీపీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే వైద్యులు ఉప్పును తగ్గించమని చెబుతారు. కొంతమంది తెలియక ఉప్పును పూర్తిగా తగ్గిస్తారు. దీనివల్ల హైపోనాట్రేమియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పును పూర్తిగా మానేయడం లేదా అధికంగా తినడం... రెండూ ప్రమాదకరమే. మీకు ఎంత అవసరమో అంత ఉప్పును తినాలి. అధిక ఉప్పు వేసుకోకుండా, అలా అని మరీ చప్పగా కాకుండా ఉప్పును వంటల్లో వాడాలి. దీన్ని మితంగా తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. పైగా మన శరీరంకి సోడియం అత్యవసరం. కాబట్టి ఉప్పు నుంచి సోడియం కూడా అందుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం