Bapatla Beach Tour : బాపట్ల టూర్.. తెలంగాణ వాళ్లు బీచ్ చూడాలనుకుంటే.. ఈ ఆప్షన్ బెస్ట్-hyderabad to bapatla beach tour in low budget surya lanka beach tour guidance ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bapatla Beach Tour : బాపట్ల టూర్.. తెలంగాణ వాళ్లు బీచ్ చూడాలనుకుంటే.. ఈ ఆప్షన్ బెస్ట్

Bapatla Beach Tour : బాపట్ల టూర్.. తెలంగాణ వాళ్లు బీచ్ చూడాలనుకుంటే.. ఈ ఆప్షన్ బెస్ట్

Anand Sai HT Telugu
May 07, 2024 04:30 PM IST

Suryalanka Beach : ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. బీచ్ చూడాలి అనుకునేవారు.. నేరుగా కారు రెంట్ తీసుకుని బాపట్ల వెళ్తున్నారు.

బాపట్ల బీచ్
బాపట్ల బీచ్

బీచ్ చూడాలి అని చాలా మంది అనుకుంటారు. సముద్రం ఒడ్డున వచ్చే అలలు కాళ్లకు తాకుతుంటే కలిగే ఆనందం వేరు. సమద్రంలో దాగి ఉన్న అందాలు చూడాలని చాలా మంది కోరుకుంటారు. అయితే ఇందుకోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. బాపట్ల బీచ్ వెళితే సరిపోతుంది. దీనినే సూర్యలంక బీచ్ అని కూడా అంటారు. ఇక్కడకు వెళితే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది జంటలు ఇక్కడకు వెళ్లి బీచ్ చూసి ఎంజాయ్ చేస్తారు.

ఇటీవలి కాలంలో హైదరాబాద్ నుంచి బాపట్లకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతుంది. బీచ్ చూడాలి అనుకునేవారు.. నేరుగా సూర్యలంక బీచ్ కు వెళ్తున్నారు. ఇతర ప్రాంతాల్లోని టూరిస్టులు ఏపీలో ఉన్న ఈ బీచ్ చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. సూర్యలంక బీచ్ ఒడ్డు చాలా విశాలంగా ఉంటుంది. పర్యాటకులు బీచ్‌లో రద్దీగా ఉన్న అనుభూతిని పొందకుండా సరదాగా గడపవచ్చు. సముద్ర ప్రేమికులు ఇక్కడకు వెళితే తెగ ఎంజాయ్ చేస్తారు. ప్రశాంతమైన వాతావరణం మీ బాధలన్నింటినీ మరచిపోయేలా చేస్తుంది. జీవితకాలం పాటు మీకు మంచి జ్ఞాపకాలను అందిస్తుంది.

బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ వెళ్లేందుకు 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. కుటుంబం, స్నేహితులతో సెలవులు గడపడానికి సరైన ప్రదేశం, సూర్యలంక బీచ్ ఆసక్తిగల ప్రయాణికులకు ఇష్టపడే ప్రదేశం. ఈ సముద్రతీరానికి పర్యాటకులు విశ్రాంతిని పొందేందుకు వస్తారు. సముద్ర అలల ప్రతిధ్వని మధ్య ఏకాంతంగా గడపాలని ఎదురుచూసే ప్రకృతి ప్రేమికులకు సూర్యలంక బీచ్ అద్భుతమైన గమ్యస్థానం అని చెప్పవచ్చు.

సూర్యలంక బీచ్‌లో వేసవి కాలంలో వేడి ఎక్కువగానే ఉంటుంది. అయితే సాయంత్రం 6 గంటల వరకూ చేరుకుంటే బాగుంటుంది. ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి. వేడి తట్టుకోలేకపోతారు. సూర్యలంక బీచ్‌లో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు బాగుంటుంది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. సూర్యలంక బీచ్‌లో సెలవులకు ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు.

సూర్యలంక బీచ్‌కి ప్రయాణం చేయడం సులభం. హైదరాబాద్ నుంచి వెళ్లాలి అనుకునేవారు నేరుగా కారు తీసుకుని వెళ్లవచ్చు. మార్కెట్లో సెల్ఫ్ డ్రైవ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 320 కిలో మీటర్ల వరకూ దూరం ఉంటుంది. అయితే మీరు ఎంజీబీఎస్ వెళితే మీకు బస్సులు కూడా దొరుకుతాయి. ట్రైన్ మార్గంలోనూ బాపట్ల చేరుకోవచ్చు. తెలంగాణ వారు బీచ్ చూడాలి అనుకుంటే బాపట్ల బీచ్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే తక్కువ ఖర్చులో అయిపోతుంది. సూర్యలంక బీచ్ స్విమ్మింగ్, సన్ బాత్ కోసం గొప్ప గమ్యస్థానం అని చెప్పవచ్చు.

సూర్యలంక బీచ్‌కు సమీపంలో ఉన్న భావనారాయణ స్వామి దేవాలయం ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం. ఈ ఆలయం 15వ శతాబ్దం నాటిది. భావనారాయణ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన మతపరమైన ప్రదేశాలలో ఒకటి. శ్రీ ఆంజనేయ దేవాలయం సూర్యలంక బీచ్ నుండి 0.3 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పర్యాటకులకు బస చేసేందుకు ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి. హరిత బీచ్ రిసార్ట్, సూర్యలంక బీచ్ రిసార్ట్ బీచ్‌కు దగ్గరగా ఉన్న రిసార్ట్‌లు. ఈ రిసార్ట్స్‌లోని కాటేజీలు బీచ్‌సైడ్‌లో ఆనందించేందుకు బాగుంటాయి. అందుబాటు ధరలో బీచ్ చూడాలి అనుకుంటే బాపట్ల బీచ్‌కు వెళ్లి రావొచ్చు.

Whats_app_banner