ఈతరం అమ్మాయిలకు బ్రా అత్యవసర లోదుస్తులుగా మారిపోయింది. శరీరాకృతిని అందంగా చూపించేందుకు బ్రాలు సహాయపడతాయి. పాఠశాల స్థాయి నుంచి అమ్మాయిలు బ్రా ధరించడం మొదలుపెట్టారు. అయితే ఇప్పటికీ బ్రా ధరించడం పై ఎన్నో అపోహలు, సందేహాలు ఉన్నాయి.
బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని నమ్మే వాళ్ళు ఎక్కువే. అందుకే చాలామంది గ్రామస్తులు, చీరలు కట్టుకునే వారు బ్రా ధరించడానికి ఇష్టపడడం లేదు. అయితే బ్రాకు, బ్రెస్ట్ క్యాన్సర్ కు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు నిపుణులు. తాత్కాలిక సౌకర్యం కోసమే ధరించాలని, అసౌకర్యంగా ఉంటే మానేయవచ్చని చెబుతున్నారు. అంతేతప్ప అది రొమ్ములపై ఎలాంటి తీవ్రమైన ప్రభావాలను చూపించదని వివరిస్తున్నారు. నీ శరీరాకృతి అందంగా కనిపించాలనుకుంటే బ్రా ధరించవచ్చు. లేదా మీకు వాటితో అసౌకర్యంగా అనిపిస్తే మానేయవచ్చు. అంతేకానీ బ్రా వేసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని మాత్రం భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
స్త్రీ రొమ్ములు.. క్షీర గ్రంధులను, కొవ్వును కలిగి ఉంటాయి. అదంతా మెత్తని కణజాలంతో నిర్మితమై ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత పాలు స్రవించేందుకు రొమ్ముల్లో క్షీర గ్రంధులు ఉంటాయి. కొంతమందిలో క్షీర గ్రంధులు ఎక్కువగా ఉంటే, మరి కొంతమందిలో తక్కువగా ఉంటాయి. అందుకే కొందరి రొమ్ములు పెద్దవిగా ఉంటే మరికొందరికి చిన్నగా ఉంటాయి. ఈ క్షీర గ్రంధులు కూడా వయసుతోపాటు క్షీణిస్తూ ఉంటాయి. దానివల్లే వయసు పెరుగుతున్న కొద్ది స్తనాలు జారిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఎక్కువ మంది బ్రా ధరిస్తూ ఉంటారు. అంతేకానీ బ్రా వేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని ఇప్పటివరకు ఏ సైన్సు నిరూపణ చేయలేదు.
అయితే మీ శరీర పరిమాణానికి తగ్గట్టు లోదుస్తులను ఎంపిక చేసుకోవాలి. అలా కాకుండా మరీ బిగుతుగా ఉన్న బ్రాను ధరిస్తే అక్కడ చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గాలి తగలక చెమట పట్టి దురద వంటి చర్మ సమస్యలు వస్తాయి. అలాగే రొమ్ముల్లో నొప్పి కూడా రావచ్చు. కాబట్టి మీ శరీర నిర్మాణానికి తగ్గ సైజు బ్రాలను ఎంచుకోవాలి.
ముఖ్యంగా పెద్ద రొమ్ములు ఉన్న స్త్రీలు కచ్చితంగా బ్రాలను ధరిస్తే మంచిది. ఎందుకంటే ఆ రొమ్ములు బరువు వెన్నుపై పడకుండా ఉంటుంది. రొమ్ములను బ్రా సరైన స్థానంలో ఉంచుతుంది. దీనివల్ల వెన్ను నొప్పి కూడా రాకుండా ఉంటుంది.
మార్కెట్లో రొమ్ములు వదులు కాకుండా ఉండేందుకు కొన్ని క్రీములను అమ్ముతున్నారు. నిజానికి ఇలాంటి క్రీములు వాడడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. సహజంగా వయసు ముదిరాక ఇలా రొమ్ములు వదులు కావడం వంటివి జరుగుతాయి. వాటిని ఏ క్రీములు కూడా మార్చలేవు. శాస్త్రీయంగా కూడా ఆ క్రీములు పనిచేస్తాయని నిరూపణ కాలేదు.
శరీరంలో సహజంగా జరుగుతున్న మార్పులను ప్రతి స్త్రీ అంగీకరించాల్సిందే. వయసు పెరిగే కొద్ది రొమ్ములు జారిపోవడం అనేది సాధారణం. అలాగే పాలిచ్చే తల్లులకు కూడా ఇలా రొమ్ములు వదులుగా అవుతాయి. రొమ్ముల్లో ఉండే క్షీర గ్రందుల్లో పాలు నిండిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలను తలుచుకొని ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు.
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అధికంగా వస్తుంది. కాబట్టి ప్రతి మహిళలు నెలకొకసారి అయినా ఇంట్లోనే స్వీయ పరీక్ష చేసుకోవాలి. ముఖ్యంగా రుతుస్రావం తర్వాత ప్రతినెలా మహిళలు రొమ్ములను పరీక్షించుకోవాలి. తమ చేతులతోనే రొమ్ములను మెల్లగా నొక్కుతూ పరిశీలించాలి. మీకు ఏదైనా గట్టిగా కణితిలాగా చేతికి అనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మహిళలు ఇలా ప్రతినెలా తమకు తాము స్వీయ పరీక్ష చేసుకోవడం చాలా అవసరం. ఇక 40 ఏళ్లు దాటిన వారు ఏడాదికి ఒకసారి అయినా మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. మామోగ్రామ్ అనేది రొమ్ము క్యాన్సర్ ను కనిపెట్టే పరీక్ష. మన దేశంలో రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అందుకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం