Pigeons: బాల్కనీలో పావురాలు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయా? వీటిని తగిలిస్తే రావు
Pigeons: బాల్కనీలో తరచుగా పావురాలు రావడం వల్ల ఇబ్బంది పడుతుంటే ఈ చిట్కాలు తెల్సుకోండి. ఇవి పావురాలు రాకుండా కాస్త కాపాడతాయి.

ఎగిరే పక్షులు మన కళ్ల ముందుంటే చూడ్డానికి ఆహ్లాదంగా అనిపిస్తుంది. అది కాస్తా ఇబ్బందిగా మారితేనే తగ్గించే మార్గాల కోసం వెతకాల్సి వస్తుంది. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలో ఉండేవాళ్లకు చాలా చోట్ల పావురాల వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. బాల్కనీల్లోకి వచ్చి రెట్టలు వేయడం, ఈకల వల్ల మరీ అశుభ్రంగా తయారవుతుంది. వాటి దుమ్మునుంచి, రెక్కల నుంచి, రెట్టల నుంచి కొన్ని వ్యాధులు వస్తాయనే భయం కూడా ఉంటుంది. వాటి శబ్దాలతో కూడా కాస్త ఇబ్బందే. అయితే ఎన్నిసార్లు తరిమికొట్టినా మళ్లీ మళ్లీ ఎక్కువ సంఖ్యలో పావురాలు వచ్చి ఇబ్బంది పెడితే కొన్ని చిట్కాలు పనిచేస్తాయి.
పావురాలు రాకుండా చిట్కాలు:
పాలిథీన్ కవర్‌తో:
బాల్కనీలో పావురాల గుంపుతో ఇబ్బంది పడుతుంటే ఈ చిట్కా పని చేస్తుంది. దానికోసం నలుపు రంగు ప్లాస్టిక్ కవర్ ఉంటే సరిపోతుంది. వీలైతే పెద్ద సైజు డస్ట్ బిన్ బ్యాగ్ వాడటం ఉత్తమం. దీంట్లో పాత న్యూస్ పేపర్లు నింపి ముడి వేసేయండి. ఒక హ్యాంగర్ లేదా తాడు సాయంతో దీన్ని బాల్కనీలో వేళాడదీయండి. సూర్యరశ్మి ఈ కవర్ మీద పడి బ్యాగ్ ఎక్కువగా మెరుస్తుంది. ఆ మెరుపుకు పావురాలు తొందరగా వచ్చి వాలిపోవు.
మొక్కలు:
బాల్కనీలో పావురాలు ఎక్కువగా వస్తే కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను కుండీలో పెట్టి పావురాలు ఎక్కువగా వచ్చే చోట ఉంచండి. లేదా పావురాలు వచ్చి బాల్కనీలో కూర్చునే చోట హ్యాంగింగ్ ప్లాంటర్లలో పెట్టి వేలాడదీయండి. దీంతో పావురాలు రావడం తగ్గిపోతుంది.
డీవీడీ:
ఎండ పడితే బాగా మెరిసే వస్తువులను బాల్కనీలో పెట్టొచ్చు. డీవీడీ, అద్దం, మెరిసే కవర్లు లాంటివి వేళాడదీయండి. వాటిమీద వెలుతురు పడి కాంతిని పరావర్తనం చేస్తాయి. ఆ వెలుతురు, మెరుపుకు దగ్గరికి రావాలంటే పావురాలు భయపడతాయి.
గింజలు వేయడం:
పక్షుల కోసం సీడ్స్, గింజలు, బియ్యం లాంటివి పెట్టడం అందరికీ నచ్చుతుంది. అది మంచి అలవాటు కూడా. అయితే మీకు ఇబ్బంది ఉన్నచోటు కాకుండా ఇంటి పైన, లేదా మీకు ఇబ్బంది లేని చోట వాటిని పెట్టండి. పావురాలకు ఆహారం పెట్టడం అలవాటు అయితే ఒకే చోటుకు రోజూ వస్తుంటాయి. కాబట్టి ఆహారం పెట్టే చోటు మార్చండి చాలు.
టాపిక్