Stop People pleasing: మన్ననల కోసం మారుతూ ఉంటే జీవితానికి మనుగడ లేదు.. మీ వ్యక్తిత్వాన్ని మీ గొప్పతనం-how to stop living for people pleasing ways to overcome it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Stop People Pleasing: మన్ననల కోసం మారుతూ ఉంటే జీవితానికి మనుగడ లేదు.. మీ వ్యక్తిత్వాన్ని మీ గొప్పతనం

Stop People pleasing: మన్ననల కోసం మారుతూ ఉంటే జీవితానికి మనుగడ లేదు.. మీ వ్యక్తిత్వాన్ని మీ గొప్పతనం

Koutik Pranaya Sree HT Telugu
Aug 12, 2024 05:00 AM IST

Stop People-pleasing: ప్రజలను మెప్పించాలనే ఆలోచన మీ జీవన నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ దురాలోచన నుంచి బయటకు వస్తేనే మీ వ్యక్తిత్వం విలువ మీకు అర్థం అవుతుంది. దాన్నుంచి బయటపడే మార్గాలు తెల్సుకోండి.

ఇతరుల మెప్పుకోలు కోసం పాకులాడకండి
ఇతరుల మెప్పుకోలు కోసం పాకులాడకండి (Pexels)

మన చుట్టుపక్కల ఉన్న మనుషులకు నచ్చేలా బతకాలని చాలా మంది వారి వ్యక్తిత్వాన్ని మార్చుకుంటారు. ఇతరుల ఆనందం కోసం తమలో తాము ఎంతగా అయినా మార్పు చేర్పులు చేసుకుంటారు. ఈ క్రమంలో అసలు వాళ్ల అసలు వ్యక్తిత్వం ఏంటో కూడా మర్చిపోతారు. శూన్యం తప్ప అంతరంగంలో ఏమీ మిగలదు.

ఇతరుల అవసరాలకు అనుగుణంగా, వాళ్ల కోరికలు తీర్చడానికి, వారిని సంతోష పెట్టాలనే ఆలోచనతో వాళ్లను వాళ్లే పనంగా పెట్టుకుంటారు. సొంత అవసరాలను కూడా ఖాతరు చేయరు. ఇతరులను సంతోషపెట్టడానికి చాలా కష్టపడతారు. చెప్పాలంటే ఇతరుల ఇష్టం కన్నా వాళ్ల సొంత ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా అపరాధంగా భావిస్తారు.

అక్కడి నుంచే మొదలు:

ఇతరులకు తగ్గట్లు మసలుకోవడం అలవాటు అవడానికి చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైంది బాల్య అనుభవాల ప్రభావం. తల్లిదండ్రులు కఠిన మనస్కులై ఉండటం, ఎప్పుడూ వాళ్లను విమర్శించడం, ప్రశంసించక పోవడం వల్ల దీర్ఘకాలికంగా ఆత్మ స్థైర్యం కోల్పోయి వేరే వాళ్ల మన్ననలు పొందడమే ముఖ్య ఉద్దేశమనే ఆలోచనకు చేరతారు. లేదంటే వాళ్లకందరూ దూరంగా వెళ్లిపోతారనే ఆలోచనతో ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎవరి ప్రేమా పొందకపోవడం వల్ల పెద్దయ్యాక అందరితో మంచి వాళ్లు అనిపించుకోవాలి, అందరి ప్రేమా పొందాలనే ఆలోచన వల్ల అందరికీ తగ్గట్లు మారిపోతారు.

పర్యవసానాలు:

ప్రజలను మెప్పించడమే అలవాటుగా మారితే ప్రమాదమేంటీ అనుకోకండి. మీలో కోరికలు తగ్గి, నిరాశ పెరిగి జీవితం అంటేనే మీకు నచ్చినట్లు ఉండదు అనే నిర్ణయానికి వచ్చేస్తారు. జీవితం మీద నమ్మకమే పోతుంది. ఒకరికోసం మీకొచ్చిన అవకాశాలు కూడా పనంగా పెట్టేస్తారు. దాంతో జీవితమే నెమ్మదిస్తుంది. మీరు ఏ బంధంలో ఉన్నా ఆరోగ్యకరమైన ప్రేమను పొందలేరు. ఇచ్చిపుచ్చుకోవడం అనే ఆలోచన నుంచి కేవలం ఇవ్వడం అనే ఆలోచనలో స్థిరపడిపోతారు. దీంతో బంధాలు బలహీనపడతాయి.

దాన్నుంచి ఎలా బయటపడాలి?

మనుషలను మెప్పించడం
మనుషలను మెప్పించడం (Unsplash)

కరుణ, జాలి, దయ, ప్రేమ అనేవి మీనుంచే కాదూ, మీరూ ఇతరుల నుంచి పొందగలగాలి. అందుకే ఎవరితో అయినా మీరు చూపించే ప్రేమలో, కరుణలో హద్దులేంటో తెల్సుకోండి. ప్రతిదానికీ రోజూ రాజీపడుతూ ఉంటే మీ జీవన నాణ్యత దెబ్బతింటుంది. ఇతరులు చెప్పే ప్రతి విషయం వినండి. మర్యాద ఇవ్వండి. కానీ మీకది నచ్చకపోతే ఆ విషయం చెప్పడానికి సిద్దంగా ఉండండి. ఇతరుల మెప్పుకోలు కోసం ప్రతిదీ అంగీకరించకండి. నో చెప్పడం అలవాటు చేసుకోండి.

మీకోసం సమయం:

మీ అభిరుచులు తెల్సుకోండి
మీ అభిరుచులు తెల్సుకోండి (Pexels)

మీరు నిజంగా మీ వ్యక్తిత్వం ఏంటో అర్థం చేసుకోడానికి కాస్త సమయం గడపండి. మీ అభిరుచులు, ఆసక్తుల కోసం సమయం కేటాయించండి. మీ కలలను, కోరికలను మీరు ప్రేమిస్తే ఇతరుల మెప్పుకోలు కోసమే బతకాలనే ఆలోచన క్రమంగా తగ్గిపోతుంది. మీరు సాధించిన చిన్న విజయాలను కూడా సెలెబ్రేట్ చేసుకోండి. మీ విలువ మీకు ఒక్కసారి అర్థం అయితే ఇతరులు అభిప్రాయాలకు తగ్గట్లు మారిపోవడం మానుకుంటారు.