Bike Parcel In Railway : రైల్వేలో పార్శిల్ ద్వారా బైక్ ఎలా పంపాలి? ఎంత ఖర్చు అవుతుంది?-how to send bike through train in parcel indian railways terms and conditions ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bike Parcel In Railway : రైల్వేలో పార్శిల్ ద్వారా బైక్ ఎలా పంపాలి? ఎంత ఖర్చు అవుతుంది?

Bike Parcel In Railway : రైల్వేలో పార్శిల్ ద్వారా బైక్ ఎలా పంపాలి? ఎంత ఖర్చు అవుతుంది?

Anand Sai HT Telugu
Dec 19, 2023 10:00 AM IST

Indian Railways Parcel Service : కొన్నిసార్లు బైక్ చాలా దూరం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో అంత దూరం వెళ్లలేం. రైల్వేలో పార్శిల్ ద్వారా పంపొచ్చు. అయితే ఎలా పంపాలి అనేది కూడా తెలిసి ఉండాలి కదా.

బైక్ పార్శిల్
బైక్ పార్శిల్

చదువు, ఉద్యోగం, వ్యాపారం.. బతుకు దెరువు కోసం కొన్ని సమయాల్లో చాలా దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంటి దగ్గరే బైక్‌ను ఖాళీగా వదిలిపెట్టి వెళ్లలేం. అలా అని వందల కిలో మీటర్లు బైక్ మీద ప్రయాణం కూడా చేయలేం. ఆరోగ్యానికి మంచిది కాదు. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరగొచ్చు. కాస్త దూరమైతే ఈజీగానే వెళ్లొచ్చు. పక్క రాష్ట్రాలకు అయితే మాత్రం చాలా కష్టం. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూల నుంచి ఆ మూలకు వెళ్లాలనుకున్నా బైక్ ప్రయాణం సురక్షితం కాదు. అటువంటి సమయంలో అందరికీ గుర్తొచ్చేది ఇండియన్ రైల్వే(Indian Railway).

ఇండియన్ రైల్వే ద్వారా రోజూ లక్షల సంఖ్యలో పార్శిల్స్ వెళ్తాయి. మీరు ఎప్పుడైనా గమనించినట్టైతే అందులో బైక్స్ కూడా ఉంటాయి. వాటిని ఎలా పంపిస్తారు? ప్రాసెస్ ఏంటి అని చాలా మందికి అనుమానం ఉండే ఉంటుంది. చాలా ఈజీ పనే కాస్త టైమ్ తీసుకుంటే చాలు. డబ్బులు ఎంత ఖర్చు అవుతాయని కూడా కొందరికి తెలియదు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎక్కువ దూరం బైక్‌లను తీసుకెళ్లడం కాస్త కష్టమే. అదే సమయంలో ప్రైవేట్ పార్శిల్ కంపెనీల ద్వారా బండ్లను పంపాలంటే చాలా ఖర్చు అవుతుంది. దీనికి భారతీయ రైల్వే సరైన పరిష్కారం చూపిస్తుంది. రైలు మార్గంలో బైక్‌లను పార్శిల్(Bike Parcel In Railway) చేసే సదుపాయాన్ని మనం తెలుసుకోవాలి. సంబంధిత పత్రాలు అందుబాటులో ఉంటే బండి బరువు, దూరం ఆధారంగా ద్విచక్ర వాహనాలను పార్శిల్ ద్వారా రవాణా చేయవచ్చు.

పార్శిల్‌లు సరుకు రవాణా రైళ్లలో తీసుకువెళతారు. మీరు ఒరిజినల్ వెహికల్ సర్టిఫికేట్‌లను కలిగి ఉంటే మాత్రమే మీరు భారతీయ రైల్వేలో టూ వీలర్ పార్శిల్‌లను(Two Wheeler Parcel) పంపగలరు. ముందుగా మీరు మీ సమీపంలోని రైల్వే స్టేషన్‌కి వెళ్లి, బండిని రైలులో పంపడం గురించి అక్కడ ఉన్న పార్శిల్ కార్యాలయాన్ని అడగాలి. అందుకు వారు ఇచ్చిన దరఖాస్తులను పూరించాలి. దరఖాస్తును నింపేటప్పుడు మీ వాహనం RC బుక్, బీమా అసలైన సర్టిఫికేట్ మీ వద్ద ఉండాలి.

అలాగే ఆ సర్టిఫికెట్ల కాపీలను మీ దగ్గర ఉంచుకోవడం మంచిది. అధికారులు వాటిని తనిఖీ చేసి బైక్ పార్శిల్ చేయడానికి అనుమతిస్తారు. మీరు ఎప్పుడు పంపాలనుకుంటున్నారో సరైన తేదీని పెట్టాలి. సాధారణంగా మీ బైక్‌ను 500 కిలోమీటర్ల దూరానికి పంపడానికి 1200 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ బండి బరువు, దూరాన్ని బట్టి అది మారుతుంది. అదేవిధంగా బైక్ ప్యాకింగ్ కు 300 నుంచి 500 రూపాయలు ఖర్చవుతుంది. బైక్ పాడవకుండా కొన్ని రకాల చర్యలు తీసుకోవాలి కదా.

ప్రాథమికంగా బైక్‌ను ప్యాక్ చేయడానికి ఇచ్చే ముందు అందులో ఇంధనం ఉండకూడదు. ఇది మీరు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పెట్రోల్ ట్యాంక్ ఖాళీ చేసిన తర్వాత ఇవ్వండి. కొన్ని సందర్భాల్లో లోపల పెట్రోల్ ఉంటే జరిమానా విధించవచ్చు. పెట్రోల్ ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పార్శిల్ చేసిన తర్వాత రైల్వే సిబ్బంది ఇచ్చే రశీదులను భద్రంగా ఉంచుకోవాలి. బైక్ తీసుకునే చోట వాటిని వాటిని చూపించండి.

మీ బైక్ ఏ రైలులో రవాణా చేయబడుతుందో, అది అక్కడికి ఎప్పుడు వస్తుందో మీరు తెలుసుకోవాలి. సరైన సమయానికి వెళ్లి బైక్ డెలివరీ తీసుకోవాలి. బైక్ ఆలస్యంగా తీసుకున్నా స్వల్ప జరిమానా ఉంటుందని గుర్తుంచుకోవాలి.

Whats_app_banner