Bike Safety Rules: బైక్ నడపడంలో మీకు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, ఈ చిన్న తప్పిదాలతోనే యాక్సిడెంట్స్ అవ్వొచ్చు జాగ్రత్త!-how to ride a bike safely and why you need to know the rules ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bike Safety Rules: బైక్ నడపడంలో మీకు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, ఈ చిన్న తప్పిదాలతోనే యాక్సిడెంట్స్ అవ్వొచ్చు జాగ్రత్త!

Bike Safety Rules: బైక్ నడపడంలో మీకు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, ఈ చిన్న తప్పిదాలతోనే యాక్సిడెంట్స్ అవ్వొచ్చు జాగ్రత్త!

Galeti Rajendra HT Telugu

బైక్ రైడింగ్‌ను చాలా మంది లైట్ తీసుకుంటారు. మనం రోజూ నడిపే బండే, వెళ్లే రూటే కదా కని ఏమరపాటుగా ఉంటారు. కానీ.. మనం చేసే కొన్ని తప్పిదాలతో యాక్సిడెంట్స్‌కి గురయ్యే ప్రమాదం ఉంది.

బైక్ సేప్టీ రూల్స్

బైక్ యాక్సిడెంట్స్ ఇటీవల చాలా ఎక్కువగా అయిపోయాయి. మనం రోడ్డుపై జస్ట్ ఓ 10 కిలో మీటర్లు జర్నీ చేస్తే.. కనీసం ఒక్క బైక్ యాక్సిడెంట్ అయినా కనిపిస్తుంటుంది. బైక్ యాక్సిడెంట్ అంటే ప్రాణాలు పోయేలా లేదా గాయపడేంత తీవ్రంగా ఊహించుకోవద్దు. మన బైక్‌తో ఒక కారుకి వెనుక వైపు నుంచి ఢీకొట్టినా లేదా మనమే పట్టుజారి కిందపడిపోయినా దాన్ని బైక్ యాక్సిడెంట్‌గా పరిగణించాలి. ఎందుకంటే మిగిలిన యాక్సిడెంట్స్‌తో పోలిస్తే బైక్ యాక్సిడెంట్స్ సమయంలో నడిపేవారికి, వెనుక కూర్చున్న వారికి గాయాలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.

సాధారణంగా బైక్ నడిపే సమయంలో మనం చేసే తప్పిదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం

స్పీడ్ కంట్రోల్

మీకు బైక్ నడపడంలో ఎంత అనుభవం ఉన్నా.. తెలియని రోడ్లపై వెళ్తున్నప్పుడు నెమ్మదిగా వెళ్లడం ఉత్తమం. మీరు స్పీడ్‌ని కంట్రోల్ చేయవచ్చులే అనుకుంటారు. కానీ.. కొత్త రోడ్లపై ఎక్కడ ఎత్తు పల్లాలు, గోతులు ఉన్నాయో మీకు తెలియదు. కాబట్టి.. కంట్రోల్ చేయగలిగినంత వేగంలోనే వెళ్లడం మంచిది. అతివేగంగా వెళ్తే యాక్సిడెంట్స్‌ని ఆహ్వానించినట్లే అవుతుంది. రోడ్డు పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ వేగంలో మార్పులు చేసుకుంటూ వెళ్లడం మంచిది.

మిర్రర్ చెక్

బైక్ మీద ఉన్న సైడ్ మిర్రర్స్ సరిగా ఉన్నాయో లేదో జర్నీని ప్రారంభించే ముందు ఒకసారి సరిచూసుకోవాలి. అలానే జర్నీ సమయంలో వాటిని ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. యూ-టర్న్, టర్నింగ్ తీసుకునే సమయంలో ఒకసారి మిర్రర్‌లో చెక్ చేసుకుని, ఇండికేటర్ వేస్తూ టర్న్ తీసుకోవడం ఉత్తమం. జిగ్-జాగ్ డ్రైవింగ్ చేయడం, అనాలోచితంగా టర్న్ తీసుకోవడం, ఇండికేటర్ లేదా హ్యాండ్ సిగ్నల్ ఇవ్వకుండా టర్న్ తీసుకుంటే వెనుక వైపు నుంచి వచ్చే వాహనాలు ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది.

నైట్ జర్నీ

పగలు జర్నీ కంటే.. రాత్రి జర్నీ సమయంలో బైక్‌ నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణానికి ముందే హెడ్‌లైట్స్ సరిగా ఉన్నాయా లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. అలానే హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. రాత్రి వేళ్లల్లో కళ్లల్లోకి కీటకాలు ఎక్కువగా పడే ప్రమాదం ఉంటుంది. అలానే రోడ్డు పక్కన రోడ్ సేప్టీ ఇండికేషన్స్‌ను జాగ్రత్తగా గమనిస్తూ దానికి తగినట్లుగా స్పీడ్ బ్రేకర్స్, కర్వ్, బ్రిడ్జ్, సర్వీస్ రోడ్డుల దగ్గర నెమ్మదిగా, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.

వర్షం పడితే

సాధారణ రోజుల కంటే వర్షం పడిన సమయంలో బైక్‌ను డ్రైవ్ చేయడం కొంచెం కష్టం. వర్షం పడినప్పుడు రోడ్డు తడిగా ఉండడం వల్ల టైర్లు స్లిప్ అయ్యే అవకాశం ఉంది. అలానే ఒకవేళ గోతులు ఉంటే అవి నీరుతో నిండిపోయి ఉంటాయి కాబట్టి మరింత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మ్యాన్‌ హోల్స్ ఉండే అవకాశం ఉన్న ప్రదేశాల్లో మరింత జాగ్రత్త అవసరం

గుడ్డిగా ఫాలో అవ్వొద్దు

బైక్‌పై వెళ్లేవారు.. సాధారణంగా తమ ముందు వెళ్తున్న బస్ లేదా కారు లాంటి వెహికల్స్ వెనుక వెళ్లిపోతుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఒకవేళ ఏదైనా సడన్‌గా గుంత వస్తే ఆ 4 చక్రాల వెహికల్స్ ఆ గోతిని మిడల్ చేయగలవు. కానీ.. మీకు ఆ గోతి వెంటనే కనబడదు కాబట్టి నేరుగా వెళ్లి మీ బైక్ టైర్ అందులో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి.. కనీసం 50 మీటర్ల దూరంలో వెళ్లడం ఉత్తమం.

వన్ వే.. రాంగ్ రూట్

అలానే రాంగ్ రూట్స్‌లో వెళ్లకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినప్పుడు.. ఇండికేటర్స్ వేసుకుంటూ నెమ్మదిగా వెళ్లాలి. లేకపోలే.. అపోజిట్‌లో వచ్చే వెహికల్స్ ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. చాలా మంది వన్-వే బోర్డు కనిపిస్తున్నా గాబరాగా వెళ్లిపోతుంటారు. ఇది మంచిది కాదు. చుట్టూ ప్రయాణమైనా.. సురక్షితమైన ప్రయాణాన్ని ఎంచుకోండి.

క్వాలిటీ హెల్మెట్

మంచి క్వాలిటీ హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. ఇది మీ తలకి గాయం కాకుండా కాపాడుతుంది. అలానే మీ కళ్లల్లోకి దుమ్ము, ధూళి లాంటివి పడకుండా రక్షణగా నిలుస్తుంది. మీరు ఒకవేళ లాంగ్ డ్రైవ్‌కి వెళ్తుంటే క్వాలిటీ జాకెట్, గ్లోవ్స్ ధరించడం మంచిది.

మీకు ఒకవేళ హెల్మెట్ అందుబాటులో లేకపోతే గ్లాసెస్ పెట్టుకోవడం మంచిది. హెల్మెట్ లేదా గ్లాసెస్ లేకుండా బైక్‌పై మీరు లాంగ్ వెళితే.. జర్నీలో మీ కళ్లల్లో దుమ్ముతో పాటు ఏవైనా కీటకాలు పడే ప్రమాదం ఉంది. ఇది మీ జర్నీని ప్రభావితం చేయడంతో పాటు ఒక్కోసారి యాక్సిడెంట్‌కి కారణం అవుతాయి.

మీ వెంట ఉండాల్సింది

ఫోన్ మాట్లాడుతూ లేదా ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ డ్రైవింగ్ చేయడం ప్రమాదం. బైక్ మీద ఎక్కువ దూరం ప్రయాణం చేసేవారు.. కనీసం ప్రతి 80-100 కిలోమీటర్లకి ఒకసారి బైక్‌ను ఆపి కాసేపు మీతో పాటు బైక్‌కి విశ్రాంతినివ్వాలి. మీ వెంటఎల్లవేళలా వాటర్ బాటిల్, తినడానికి ఏవైనా స్నాక్స్ ఉంచుకుంటే మీ శరీరానికి ఎప్పటికప్పుడు శక్తినివ్వవచ్చు. అలానే ఎప్పటికప్పుడు బైక్‌లో పెట్రోల్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి. బైక్‌లో కనీసం 2-3 లీటర్లు పెట్రోల్ ఉండగానే నింపుకోవడం ఉత్తమం.