Bonda with dosa batter: మిగిలిన దోసెపిండితో టేస్టీ బోండాలు ఇలా మార్చి చేసేయండి-how to reuse left over dosa batter to make bonda for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bonda With Dosa Batter: మిగిలిన దోసెపిండితో టేస్టీ బోండాలు ఇలా మార్చి చేసేయండి

Bonda with dosa batter: మిగిలిన దోసెపిండితో టేస్టీ బోండాలు ఇలా మార్చి చేసేయండి

Bonda with dosa batter: దోసెల పిండి మిగిలిపోతే వాటితో రుచికరమైన ఆలూ బోండాలు ట్రై చేయొచ్చు. వీటి రుచి మామూలు బోండాల కన్నా బాగుంటుంది. రెసిపీ ఎలాగో చూడండి.

దోస పిండితో బోండాలు

రెండు సార్లు తిన్న తర్వాత కూడా దోసెపిండి మిగిలిపోతే మరోసారి తినలేం. లేదా రెండుసార్లు కంటే ఎక్కువసార్లు దోసెలు తినాలన్నా అందరికీ నచ్చదు. అలాంటప్పుడు మిగిలిన దోసెల పిండినే బోండాలు చేయడానికి వాడొచ్చు. అదెలాగో, కావాల్సిన పదార్థాలేంటో చూసేయండి.

బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల దోసెపిండి

1 చెంచా శనగపిండి

3 ఉడికించిన బంగాళదుంపలు

1 ఉల్లిపాయ, సన్నటి తరుగు

టీస్పూన్ ఆవాలు

టీస్పూన్ మినప్పప్పు

2 పచ్చిమిర్చి, తరుగు

1 టీస్పూన్ పసుపు

కరివేపాకు రెబ్బ

టీస్పూన్ ధనియాలు

తగినంత ఉప్పు

కొద్దిగా కొత్తిమీర తరుగు

డీప్ ఫ్రైకి సరిపడా నూనె

బోండా తయారీ విధానం:

1. చెంచా నూనె వేసుకుని వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు వేసి వేయించాలి. అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి.

2. ఉల్లిపాయలు మగ్గాక ఉడికించుకున్న బంగాళదుంప ముద్ద,పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.

3. ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లారబెట్టుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు కాస్త వెడల్పుగా ఉన్న గిన్నెలో దోసెపిండి, శనగపిండి, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.

5. స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసుకోవాలి. అది వేడెక్కే లోపు ముందుగా సిద్దం చేసుకున్న బంగాళదుంప ఉండల్ని దోసెపిండి మిశ్రమంలో ముంచి వేడెక్కిన నూనెలో ఒక్కోటి వేసుకోవాలి.

6. అవి రంగు మారాక బయటకు తీసుకుని సాంబార్ తో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.