Stretch marks on breasts: ఛాతీ మీద తెల్లని చారలున్నాయా? మీ ఇబ్బందిని తగ్గించే చిట్కాలివే
Stretch marks on breasts: శరీరంలో స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడైనా రావచ్చు. కొంతమంది మహిళల్లో చాతీ దగ్గర స్ట్రెచ్ మార్క్స్ వచ్చి ఇబ్బంది పెడతాయి. ఈ కారణంలో ఎబ్బెట్టుగా కనిపిస్తుంది కొన్ని రకాల డ్రెస్సులు కూడా వేసుకోలేరు. దీనికి కారణాలు, ఇంట్లోనే తగ్గించుకునే సహజ మార్గాలు తెల్సుకోండి.
తొడలు, పిరుదులు, చంకల్లో, పొత్తికడుపు దగ్గర ఎక్కువగా స్ట్రెచ్ మార్క్స్ వస్తుంటాయి. కానీ కొంతమంది మహిళల్లో చాతీ దగ్గర కూడా ఈ సమస్య కనిపిస్తుంది. బరువు పెరగడం తగ్గడం నుంచి ప్రెగ్నెన్సీ దాకా దీనికి అనేక కారణాలున్నాయి. చూడ్డానికి తెల్లని చారల్లాగా ఉండే వీటిని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు.
స్ట్రెచ్ మార్క్స్:
చర్మం ఎక్కువగా సాగినా, దగ్గరికి అయినా స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి.]చర్మంలో వచ్చే మార్పులు చర్మం సాగుదలకు కారణమయ్యే కొలాజిన్, ఎలాస్టిన్ మీద ప్రభావం చూపుతాయి. చాతీ పరిమాణం పెరగడం తగ్గడం వల్ల కొలాజెన్ దెబ్బతింటుంది. దాంతో అక్కడ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి.
కారణాలు:
1. యుక్త వయసు:
ఈ యవ్వన వయసులో హార్మోన్లలో చాలా మార్పులొస్తాయి. దీంతో చాతీ పరిమాణంలో మార్పు వస్తుంది. రొమ్ము కణజాలం పెరగడం వల్ల చర్మం సాగుతుంది. చర్మం పలుచగా మారి స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి. పిరుదులు, తొడలల్లో కూడా ఈ సమస్య ఉంటుంది.
2. ప్రెగ్నెన్సీ:
ముఖ్యమైన కారణాల్లో ప్రెగ్నెన్సీ కూడా ఒకటి. గర్భవతిగా అయిన 6 వారాల్లోనే చాతీ పరిమాణంలో మార్పు రావడం మొదలవుతుంది. ఈస్ట్రోజెన్ స్థాయులు పెరగడం వల్ల చాతీ పెరుగుతంది. ఇలా ఉన్నట్లుండి మార్పు రావడంతో చాతీ మీద స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి.
3. బరువు:
మహిళల్లో బరువు పెరిగితే సాధారణంగా చాతీ పరిమాణం కూడా పెరగుతుంది. దాంతో చాతీలో స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. అలాగే బరువు తగ్గినప్పుడు రొమ్ముల్లో ఉండే కొవ్వు కణజాలం తగ్గిపోవడం వల్ల కూడా ఈ సమస్యకు కారణమే.
రాకుండా జాగ్రత్తలు:
- రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. చర్మం తేమగా ఉంటే సాగే గుణాన్ని సంపాదించుకుంటుంది.
- చర్మానికి మాయిశ్చరైజర్ రాయడం, మృతకణాలు తొలగించడానికి ఎక్స్‌ఫోలియేషన్ చేయడం మర్చిపోవద్దు.
- విటమిన్ సి ఎక్కువుంటే బెర్రీలు, క్యాబేజీ, కివి, బటానీ, క్యాప్సికం, బ్రొకలీ, పైనాపిల్, పాలకూర, టమాటాలు ఎక్కువగా తీసుకోవాలి.
- ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లుండే వాల్‌నట్స్, అవిసెగింజలు, చియా గింజలు, సాల్మన్, క్యాలీ ఫ్లవర్ తినాలి.
ఇంటి చిట్కాలు:
1. కలబంద గుజ్జు:
దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. స్ట్రెచ్ మార్క్స్ మీద రాసుకుంటే దురద తగ్గుతుంది. క్రమంగా అవి ఎక్కువ అవ్వకుండా ఉంటాయి. దానికోసం నేరుగా కలబంద గుజ్జును సమస్య ఉన్న చోట రాసి పావుగంట మర్దనా చేయాలి. తర్వాత కడుక్కుంటే చాలు. వారానికి రెండు సార్లయినా ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
2. ఆలివ్ నూనె:
దీనికి మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. స్వచ్ఛమైన ఆలివ్ నూనెను స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రోజూ రాసుకుంటే సమస్య తగ్గుతుంది.
3. కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. కొలాజెన్ దెబ్బతినకుండా కాపాడుతుంది. సమస్య ఉన్న చోట ఈ నూనె రాసుకుని చర్మం ఇంకి పోయేదాకా మర్దనా చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే సమస్య తగ్గుతుంది.