Credit card protection | క్రెడిట్ కార్డు ప్రొటెక్షన్ ఎలా? ఈ టిప్స్ పాటించండి-how to protect credit card from frauds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Credit Card Protection | క్రెడిట్ కార్డు ప్రొటెక్షన్ ఎలా? ఈ టిప్స్ పాటించండి

Credit card protection | క్రెడిట్ కార్డు ప్రొటెక్షన్ ఎలా? ఈ టిప్స్ పాటించండి

Credit card protection | క్రెడిట్ కార్డు ప్రొటెక్షన్ అంటే మీ క్రెడిట్ కార్డును నేరగాళ్ల బారి నుంచి కాపాడుకోవడం. అది సైబర్ నేరం కావొచ్చు.. ఇతరత్రా నేరం కావొచ్చు. మీరు క్రెడిట్ కార్డు మోసాల బారి నుంచి కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీరు ప్రశాాంతంగా ఉండొచ్చు.

క్రెడిట్ కార్డ్ సెట్టింగ్స్ మార్చడం ద్వారా నష్టభయం తగ్గించుకోవచ్చు (unsplash)

పెద్ద నోట్ల రద్దు తరువాత నుంచి దేశంలో క్రమంగా నగదు వాడకం తగ్గింది. డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయాయి. దీనికి తోడు క్రెడిట్ కార్డు సంస్థలు మునుపటిలా కాకుండా క్రెడిట్ కార్డులను మంజూరు చేయడంలో నిబంధనలను సరళీకృతం చేశాయి. ముఖ్యంగా వేతన జీవుల్లో ప్రతి ఒక్కరి వద్ద క్రెడిట్ కార్డు ఉండడం సర్వసాధారణంగా మారింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఈకామర్స్ లావాదేవీలు కూడా సాధారణమై పోయాయి.

ఇదే సమయంలో సైబర్ నేరాలు కూడా బాగా పెరిగిపోయాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు నిబంధనలు కఠినతరం చేస్తున్నప్పటికీ సైబర్ ఆర్థిక నేరాలు తగ్గడం లేదు. అందువల్ల మనం క్రెడిట్ కార్డుకు తగిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవడం మంచిది.

నిజానికి క్రెడిట్ కార్డు ప్రొటెక్షన్ ప్లాన్ పేరుతో కొన్ని సంస్థలు క్రెడిట్ కార్డు రక్షణ సేవలు అందిస్తున్నాయి. అయితే దీనికి ఏడాది కాలానికి నిర్ధిష్ట రుసుం చెల్లించాల్సి ఉంటుంది. సుమారు రూ. 1000 వరకు ఈ ప్లాన్ పేరిట వసూలు చేస్తున్నాయి. చెల్లించే స్థోమత ఉన్న వారు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. అయితే అసలే క్రెడిట్ కార్డు. పైగా మళ్లీ ప్రొటెక్షన్ ప్లాన్‌కు రూ. వెయ్యి ఎందుకని భావించే వాళ్లు ఈ చిట్కాలు పాటించండి.

మేనేజ్ క్రెడిట్ కార్డు..

ఈరోజుల్లో అన్ని క్రెడిట్ కార్డులు నేరుగా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నాయి. లేదంటే ఆయా సంస్థల యాప్‌ల ద్వారా కూడా మన లావాదేవీలను నియంత్రించుకోవచ్చు. అంటే ఏ తరహా లావాదేవీకి ఎంత పరిమితి విధించాలో మనం నిర్ణయించుకోవచ్చు. అలాగే ఏ తరహా లావాదేవీలు నిర్వహించవచ్చో, ఏది నిర్వహించరాదో కూడా మనం సెటింగ్స్‌లో మార్చుకోవచ్చు.

ముందుగా ఆయా యాప్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ ఆయా క్రెడిట్ కార్డు సంస్థలకు సూచనలు ఇవ్వాలి. ఇందులో మేనేజ్ మై కార్డ్ అన్న ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు ఏది మేనేజ్ చేయాలనుకుంటున్నారంటూ ఆప్షన్లు అడుగుతుంది.

అందులో ఏటీఎం విత్‌డ్రాయల్స్, ఆన్‌లైన్ (ఈకామర్స్) లావాదేవీలు, మర్చంట్ ఔట్ లెట్(పీఓఎస్), కాంటాక్ట్‌లెస్, ఇంటర్నేషనల్, డొమెస్టిక్.. ఇలా ఆప్షన్లు సూచిస్తుంది. మీరు దీనిలో ఏది మేనేజ్ చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకుని అది ఎంచుకోవాలి. ఎనేబుల్ చేయాలా? డిజేబుల్ చేయాలా అడుగుతుంది. ఉదాహరణకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అవసరం లేదనుకుంటే మీరు దానిని డిజేబుల్ చేయవచ్చు. అలాగే ఏటీఎం విత్‌డ్రాయల్ అవసరం లేదనుకుంటే దానిని కూడా డిజేబుల్ చేయవచ్చు.

పరిమితి కూడా పెట్టుకోవచ్చు..

మీరు నెలకు ఓ రూ.  20 వేల కంటే ఎక్కువగా ఖర్చు చేయరనుకుంటే మీరు మీ క్రెడిట్ కార్డు లావాదేవీల పరిమితిని రూ. 20 వేలకు లాక్ చేయొచ్చు. లేద ఒక ట్రాన్సాక్షన్‌కు కూడా కొంత పరిమితిని పెట్టుకుని లాక్ చేసుకోవచ్చు. ప్రతి లావాదేవీకి సంబంధించి ఇలాంటి పరిమితులు పెట్టుకోవచ్చు. అది ఇంటర్నేషనల్ అయినా, డొమెస్టిక్ అయినా, పీఓఎస్ అయినా ఏదైనా మనం నిర్ధిష్ట మొత్తానికి మనం లాక్ చేసుకోవచ్చు. కాంటాక్ట్‌లెస్ సర్వీస్ అవసరం లేదనుకుంటే కూడా డిజేబుల్ చేసుకోవచ్చు.

మనకు అవసరమైనప్పుడు మనం మార్చుకోవచ్చు. ఒకవేళ ఓ ఖరీదైన వస్తువు కొన్నప్పుడో, భారీ మొత్తంలో ఆస్పత్రి బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడో మన పరిమితులు మనం సడలించుకోవచ్చు. మళ్లీ సేమ్ ప్రాసెస్‌లో పరిమితి తొలగించవచ్చు. పరిమితి విధించుకున్నాక ఒకవేళ మరిచిపోయి ట్రాన్సాక్షన్ చేసినప్పటికీ నష్టం లేదు. కేవలం మీ ట్రాన్సాక్షన్ డిక్లైన్ అవుతుంది. వెంటనే పరిమితి పెంచుకుంటే సరిపోతుంది.

ఇలా పరిమితులు విధించుకుంటే ఒకవేళ మీ క్రెడిట్ కార్డు పోయినా, సైబర్ నేరగాళ్లు మోసం చేయాలనుకున్నా మీ నష్టభయాన్ని తగ్గించుకోవచ్చు. మీరే ఆంక్షలు విధించినప్పుడు మొత్తం క్రెడిట్ కార్డు లిమిట్‌ను వారు వాడలేరు. ఆ విధంగా నష్ట భయాన్ని చాలా వరకు తగ్గించుకుని ప్రశాంతంగా ఉండొచ్చు.

 

సంబంధిత కథనం