ఎప్పుడూ ఉదయం పూట ఒకేలాగా దోసె చేస్తే బోర్ కొడుతుంది కదా. ఇంట్లో వాళ్లు కూడా ముఖం తిప్పుకుంటారు. అందుకే అప్పుడప్పుడు కొత్తగా దోసె చేసేయండి. కుటుంబ సభ్యులు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎప్పటికప్పుడు విభిన్నమైన, సులభమైన వంటకాలను ప్రయత్నించండి. కొత్తగా చేసే వంటలను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం గోధుమ పిండి మసాలా దోసె తయారు చేయండి..
ఈ గోధుమ పిండి మసాలా దోసె సాధారణ గోధుమ దోసెను పోలి ఉంటుంది. కానీ కొన్ని పదార్థాలను కూడా వేయించాలి. ఇలా ఒక్కసారైనా దోసెను కుటుంబ సభ్యులకు పెడితే కచ్చితంగా ఇష్టంగా తింటారు. ప్రధానంగా కొబ్బరి చట్నీ ఈ దోసె కోసం అద్భుతమైన సైడ్ డిష్‌గా ఉంటుంది.
గోధుమ పిండి మసాలా దోసె ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? గోధుమ పిండి మసాలా దోసెను చాలా ఈజీగా తయారు చేయవచ్చు. ఎలా తయారు చేయాలో కింది విధంగా తెలుసుకుందాం..
గోధుమ పిండి - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినట్లు, నీరు అవసరం, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు - 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర - 1/2 టేబుల్ స్పూన్, శనిగలు - 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు - 1 కట్ట (సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి ), ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి), టొమాటో - 1 (సన్నగా తరిగినవి), ఉప్పు - రుచికి అనుగుణంగా
ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకుని, రుచికి సరిపడా ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్లతో కలిపి దోసె పిండిలా చేసుకోవాలి.
సిద్ధం చేసుకున్న పిండిని మూతపెట్టి 5 నిమిషాలు నాననివ్వాలి.
తర్వాత ఓవెన్‌లో కడాయి పెట్టి అందులో 2 టీస్పూన్ల నూనె పోసి వేడి అయ్యాక ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేయాలి. పప్పును కొద్దిగా వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.
తర్వాత అందులో సన్నగా తరిగిన టొమాటోలు వేసి కొంచెం ఉప్పు చల్లి బాగా వేగించాలి. ఇప్పటికే పిండిలో ఉప్పు కలిపినందున, దానికి అనుగుణంగా ఉప్పు వేయండి.
టమాటాలు బాగా వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. వేయించిన పదార్థాలు చల్లారిన తర్వాత నానబెట్టిన గోధుమపిండిలో బాగా కలపాలి.
చివరగా ఓవెన్‌లో దోసె పెనం పెట్టి వేడి అయ్యాక దోసెలా పిండిని పోసి చుట్టూ నూనె పోసుకోవాలి. ముందు, వెనుక కాల్చుకుంటే.. రుచికరమైన గోధుమ మసాలా దోసె రెడీ.