Ridge Gourd Curry With Milk : పాలతో బీరకాయ కర్రీ ఎలా చేయాలి? ఇదిగో సింపుల్‍గా ఇలా..
Beerakaya Curry Recipe : మధ్యతరగతి ఇళ్లలో పది రోజులకు ఒకసారి బీరకాయ కర్రీ వండుతూ ఉంటారు. బీరకాయ కూరను పాలు పోసి సింపుల్‍గా చేసేయెుచ్చు. టేస్టీగా ఉంటుంది.
సాధారణంగా ఎక్కువగా తినే కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. ఆరోగ్యానికి దీని ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చాలా రకాలుగా బీరకాయను వండుకుని తినొచ్చు. అన్నం, చపాతీలోకి ఇది టేస్టీగా ఉంటుంది. బీరకాయ రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
బీరకాయను ఫ్రైలాగా కొందరు చేసుకుంటారు. మరికొందరు సూప్ పెట్టుకుంటారు. ఇంకొంతమంది బీరకాయలో పాలు పోసి వండుతారు. ఇలా చేసిన బీరకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. పాలు పోసి టేస్టీగా బీరకాయ కర్రీని ఎలా వండాలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు
బీరకాయలు-500 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ-ఒకటి, తరిగిన పచ్చిమిర్చి-4, నూనె-2 టేబుల్ స్పూన్లు, తాళింపు గింజలు-టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు-4(దంచాలి), పసుపు-పావు టీ స్పూన్, ఉప్పు-సరిపడేంత, కారం-రెండు టీ స్పూన్స్, గరం మసాలా- అర టీ స్పూన్, ధనియాల పొడి- అర టీ స్పూన్, కాచి చల్లార్చిన పాలు-ఒక కప్పు, కొత్తిమీర-కొంచెం.
బీరకాయ కర్రీ చేసే విధానం
మెుదట బీరకాయలను శుభ్రంగా వాష్ చేయాలి. ఆపై వాటి మీద ఉన్న పొట్టును తీసేయాలి. ఇప్పుడు వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కళాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. అనంతరం తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఇక తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. కాసేపటి తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి.
నాలుగైదు నిమిషాలపాటు పెద్ద మంటపై వేయించిన తర్వాత మూత పెట్టి స్విమ్‍లో పెట్టి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ముక్కలు కాస్త ఉడికిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత పాలు పోసి కలపాలి. తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలపాలి. ముక్కలు మెత్తగా అయ్యేలా చూడాలి.
అయితే కర్రీ చేస్తున్న సమయంలో పాలు కాస్త విరిగినట్టుగా కనిపిస్తాయి.. కంగారు పడాల్సిన అవసరం లేదు. కూర చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ ఉడికిన తర్వాత.. కొత్తిమీర చల్లుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే.. టేస్టీ.. టేస్టీ బీరకాయ కర్రీ రెడీ అయినట్టే. దీనిని అన్నంలోకి తినొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా లాగించేస్తారు. కొత్త రుచి దొరుకుతుంది.