Ragi Upma For Breakfast : బ్రేక్ ఫాస్ట్‌లోకి రాగి ఉప్మా.. చేయడం చాలా ఈజీ.. పోషకమైనది కూడా-how to prepare ragi upma for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ragi Upma For Breakfast : బ్రేక్ ఫాస్ట్‌లోకి రాగి ఉప్మా.. చేయడం చాలా ఈజీ.. పోషకమైనది కూడా

Ragi Upma For Breakfast : బ్రేక్ ఫాస్ట్‌లోకి రాగి ఉప్మా.. చేయడం చాలా ఈజీ.. పోషకమైనది కూడా

Anand Sai HT Telugu
Jun 11, 2024 06:30 AM IST

Ragi Upma Recipe In Telugu : రాగులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వీటితో బ్రేక్ ఫాస్ట్‌ను వివిధ రకాలుగా చేసుకోవచ్చు. అందులో ఒకటి రాగి ఉప్మా. ఈ రెసిపీ తయారీ విధానం తెలుసుకుందాం..

రాగి ఉప్మా తయారీ విధానం
రాగి ఉప్మా తయారీ విధానం

సాధారణంగా ఇంట్లో ఇడ్లీ, దోసెలే ఎక్కువగా చేసుకుని తింటుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో రవ్వ ఉప్మా చేసుకున్నా.. చాలా మందికి తినాలి అనిపించదు. కొందరు ఉప్మా చూస్తేనే.. దూరం పారిపోతారు. ఎప్పుడూ ఇంట్లో ఉదయం పూట ఇడ్లీ, దోసె తినితిని బోర్ కొట్టినవారు.. రాగుల పిండితో ఉప్మా తయారు చేయండి.

yearly horoscope entry point

సాధారణంగా మనం రాగుల పిండితో జావ, రాగి ముద్దు చేసుకుని తింటాం. అయితే ఒక్కసారి రాగుల పిండితో ఉప్మా చేసి చూడండి. ఈ ఉప్పు రుచికరమైనది మాత్రమే కాదు, పోషకమైనది కూడా. మీరు రాగి ఉప్మా చేసేందుకు సమయం కూడా ఎక్కువగా పట్టదు. ఈజీగా తయారు చేయవచ్చు. రాగులు ఆరోగ్యానికి కూడా మంచివి. అనేక పోషక విలువలు కలిగి ఉంటాయి. వీటిని తినడం ఉపయోగకరం. రాగి ఉప్మా ఎలా చేయాలి? తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం..

రాగి ఉప్మాకు కావాల్సిన పదార్థాలు

నూనె - 1 టేబుల్ స్పూన్, నెయ్యి - 1 టేబుల్ స్పూన్, ఆవాలు - 1 టేబుల్ స్పూన్, శనగలు - 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు - 10, అల్లం - చిన్న ముక్క (సన్నగా తరిగినది), పచ్చిమిర్చి - 1, కరివేపాకు - 1 కట్ట, ధనియాల పొడి - కొద్దిగా, ఉల్లిపాయ - 1 సన్నగా తరగాలి, రవ్వ - 1 కప్పు, రాగుల పిండి - 1 కప్పు, నీరు - 4 కప్పులు, ఉప్పు - రుచి ప్రకారం

రాగి ఉప్మా తయారీ విధానం

ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె, నెయ్యి పోసి వేడయ్యాక ఆవాలు వేసి వేయించాలి.

తర్వాత దానికి పప్పు వేసి కొద్దిగా రంగు మారడం మొదలయ్యే వరకు వేయించాలి.

అనంతరం జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి సువాసన వచ్చేవరకు వేయించాలి.

తర్వాత నెయ్యి వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, 1 టీస్పూన్ ఉప్పు చల్లి ఉల్లిపాయను వేయించాలి.

అనంతరం తర్వాత దానికి 1 కప్పు రవ్వ వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. బాగా వేగిన తర్వాత దానికి 1 కప్పు రాగుల పిండి వేసి మీడియం మంట మీద బాగా వేయించాలి.

తర్వాత అందులో 4 కప్పుల నీళ్లు పోసి కలపాలి. అలా కలుపుతున్నప్పుడు తక్కువ మంట మీద ఉంచాలి. రవ్వ, రాగి పిండి బాగా వేగితే.. నీరు పోసేటప్పుడు కలిసి ఉండవు. లేదంటే ముద్దగా తయారవుతుంది.

సాధారణంగా రవ్వ త్వరగా ఉడుకుతుంది. కానీ రాగుల పిండి వండడానికి చాలా సమయం పడుతుంది. మూతపెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వండి.

5 నిమిషాల తర్వాత మూత తెరిచి కలపాలి. తర్వాత మళ్లీ మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే రాగి ఉప్మా రెడీ అయిపోయినట్టే. బ్రేక్ ఫాస్ట్‌లోకి తినేయెుచ్చు.

Whats_app_banner