Methi Pulao Recipe : అల్పాహారంలోకి మెంతి పులావ్.. రుచితోపాటుగా ఆరోగ్యం కూడా
Methi Pulao : ఉదయం తీసుకునే అల్పాహారం బాగుండాలి. అప్పుడే మీ మెుత్తం ఆరోగ్యం బాగుంటుంది. మంచి పోషకమైన ఫుడ్ కోసం బ్రేక్ ఫాస్ట్‌లోకి మెంతి పలావ్ చేయండి.
రోజూ ఒకే బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల బోర్ కొడుతుంటే, ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయండి. అయితే కొత్తగా తినేది మీ ఆరోగ్యానికి కూడా మంచి చేయాలి. చాలా మంది రోజూ ఇడ్లీ, దోసెలు తిని తిని బోర్ ఫీలవుతారు. కొత్తగా ఏదైనా తినాలి అనుకుంటారు. అలాంటి వారికి సూపర్ చాయిస్ మెంతి పులావ్. మీరు పులావ్ రెసిపీలో డజన్ల కొద్దీ వంటకాలు చేయవచ్చు. పులావ్ తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం సమయంలో సమయం లేనప్పుడు పులావ్ ను రుచి చూస్తే బాగుంటుంది. అందులో మెంతి పులావ్ చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఈ మెంతి పులావ్ రుచి ఎక్కువగా ఉంటుంది. దీని రుచి ఇతర పులావ్ కంటే భిన్నంగా అనిపిస్తుంది. అన్నింటికంటే ఇది ఆరోగ్యానికి మంచిది. ఈ స్పైసీ మెంతి పులావ్ ఉదయం అల్పాహారంలోకి తీసుకోవచ్చు. మధ్యాహ్నం లంచ్‌లోకి కూడా పట్టుకెళ్లవచ్చు. ఈ మెంతి పులావ్ ఎలా తయారు చేయాలి? ఇది చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటి? తెలుసుకుందాం.
మెంతి పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
పచ్చిమిర్చి - 6, రైస్ రెండు కప్పులు, లవంగాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, పుదీనా ఆకులు, ఉల్లిపాయ - 1 పెద్దది, మెంతి ఆకుల కట్ట- 1, పచ్చి బఠానీలు - అర కప్పు, పసుపు పొడి, పెసరుపప్పు కొద్దిగా, ఉప్పు.
మెంతి పులావ్ తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని గిన్నెలో వేసి 20 నుంచి 30 నిమిషాలు నానబెట్టాలి.
ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడి అయ్యాక పచ్చిమిర్చి, లవంగాలు, పెసరపప్పు, బిర్యానీ ఆకులు, జీలకర్ర, జీడిపప్పు అన్నీ కలిపి వేయించాలి.
అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఉంటే అదే వాడండి. దీని తర్వాత పచ్చిమిర్చి వేయాలి.
పుదీనా, తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో బాగా కడిగిన మెంతి ఆకులు వేయాలి. దీనితో పాటు పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు.
1 నిముషం తర్వాత పసుపు పొడి వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత అందులోనే నీళ్లలో నానబెట్టిన బియ్యాన్ని వేసి 1 నిమిషం పాటు కలపాలి.
తర్వాత జాగ్రత్తగా కలుపుతూ నీరు పోసుకోవాలి. మీరు అన్నం తీసుకున్న కప్పులో దానికి రెండింతలు నీళ్లు పోసి ఉప్పు వేసి బాగా కలపాలి.
ఇలా కలిపిన వెంటనే కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు అలాగే ఉంచాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మంట ఆపేసి అలాగే వదిలేయాలి.
మీకు నచ్చే రుచిగా ఉండే మెంతికూర పులావ్ రెడీ. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ దీనిని ఇష్టంగా తింటారు.
ఈ రెసిపీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మెంతి ఆకుల్లో అనేక పోషక విలువలు ఉన్నాయి. వీటిని ఉదయంపూట తీసుకోవడం వలన శరీరానికి మంచి జరుగుతుంది.