Egg Rice Recipe : సాస్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎగ్ రైస్ చేసేయండి
Egg Rice In Telugu : చాలా మంది ఎగ్ రైస్ తినేందుకు ఇష్టపడుతారు. కానీ బయట తినడం మంచిది కాదు. సాస్ లేకుండా ఇంట్లోనే ఎగ్ రైస్ కింది విధంగా చేసుకోండి.

రోడ్డు మీద వెళ్తుంటే.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసే ఎగ్ రైస్ వాసనతో మనసు లాగేస్తుంది. ఎలాగైనా తినాలనే ఆలోచనలో ఉంటారు. అయితే అందులో వివిధ రకాల పదార్థాలు మిక్స్ చేస్తారు. దీంతో సమస్యలు వస్తాయి. అదే ఇంట్లో చేసుకుంటే బెటర్.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినాలని అనుకుంటారు, కానీ ఆరోగ్య కారణాల వల్ల కొందరు తినరు. ఎందుకంటే ఈ ఎగ్ రైస్‌ను తయారు చేయడానికి వంట సోడా, సాస్‌లను ఉపయోగిస్తారు. అలాగే వేరేవాటికి ఉపయోగించిన నూనెను వాడుతారు. అయితే ఎగ్ రైస్ తినడానికి మాత్రం చాలా రుచిగా ఉంటుంది. అందుకే అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. అందుకే ఎలాంటి సాస్ వాడకుండా ఇంట్లోనే ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఎగ్ రైస్ చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటి? ఎగ్ రైస్ చేయడానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం..
ఎగ్ రైస్ కోసం కావలసిన పదార్థాలు
గుడ్లు - 5, బియ్యం - 1 గిన్నె, ఉల్లిపాయ - 3, పచ్చిమిర్చి - 3, టొమాటో - 1, ధనియాల పొడి - 1/2 tsp, పసుపు పొడి - 1/4 tsp, జీలకర్ర పొడి - 1/4 tsp, ఎర్ర మిరప పొడి - 1 tsp, గరం మసాలా పొడి - 1/2 tsp, క్యాప్సికమ్-1/2, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు - 1 టేబుల్ స్పూన్, వంట నునె, రుచికి ఉప్పు
ఎగ్ రైస్ తయారీ విధానం
ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర ఉంచి నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలు చేసి అందులో వేయాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
రెండు నిముషాలు వేగిన తర్వాత టమోటో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. తర్వాత అరకప్పు క్యాప్సికమ్ వేసి వేయించాలి. 1 నిముషం వేగిన తర్వాత పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరో నిమిషం వేయించాలి.
దీని తరువాత 5 గుడ్లు పగలగొట్టి అందులో వేసుకోవాలి. 1 నిమిషం వదిలి బాగా కలపండి. గుడ్డు ఉడికినంత వరకు వేయించాలి.
తర్వాత అప్పటికే తయారు చేసుకున్న అన్నం జోడించండి. అన్నం కలిపిన తర్వాత మంట తగ్గించాలి. దీనికి గరం మసాలా వేసి బాగా కలపాలి. కాసేపు కలుపుతూ ఉండాలి.
చివరగా కొత్తిమీర తరుగు వేసి కలపాలి. మీ ముందు ఎగ్ రైస్ సిద్ధంగా ఉంది.
మీరు ఇంట్లో ఉంటే దీనికి చిటికెడు బేకింగ్ సోడా జోడించవచ్చు. లేకుంటే సమస్య లేదు. క్యాప్సికమ్ జోడించాల్సిన అవసరం లేదు. ఎలాంటి సాస్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. బయట తినేబదులుగా ఇంట్లోనే చేసుకుంటే మీ ఆరోగ్యానికి కూడా మంచిది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.