Curry Leave Hair Oil : కరివేపాకు నూనె తయారీ విధానం.. ఇది జుట్టుకు అద్భుతం-how to prepare curry leave oil for hair growth black hair and stop hair fall naturally ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curry Leave Hair Oil : కరివేపాకు నూనె తయారీ విధానం.. ఇది జుట్టుకు అద్భుతం

Curry Leave Hair Oil : కరివేపాకు నూనె తయారీ విధానం.. ఇది జుట్టుకు అద్భుతం

Anand Sai HT Telugu
Jan 30, 2024 02:00 PM IST

Curry Leave Oil For Hairs : కరివేపాకు జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. దీనితో తయారు చేసుకునే నూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

కరివేపాకు హెయిర్ ఆయిల్
కరివేపాకు హెయిర్ ఆయిల్ (unsplash)

ఇటీవలి కాలంలో జుట్టు సమస్యలతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని కోసం రకరకాల ఉత్పత్తులను వాడుతున్నారు. కానీ మార్కెట్లో దొరికే ఉత్పత్తులు జుట్టు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. లేనిపోని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

నిజానికి ప్రతి ఒక్కరూ నల్లటి జుట్టు కావాలని కోరుకుంటారు. కానీ కాలుష్యం, దుమ్ము, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నీరు, మరోవైపు జెల్, స్ట్రెయిట్‌నర్ వంటి వివిధ రసాయనాల వల్ల జుట్టు పరిస్థితి దారుణంగా తయారవుతుంది. కరివేపాకు ఒక సహజ సిద్ధమైనది. ఇది జుట్టు మూలం నుండి సమస్యలను నయం చేస్తుంది. కరివేపాకు నూనెను వారానికి ఒకసారి అప్లై చేస్తే.. జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కరివేపాకు నూనెను ఇంట్లోనే తయారు చేయెుచ్చు. చాలా సింపుల్. ఇది మీకు చాలా ఉపయోగరకరంగా ఉంటుంది.

కరివేపాకులో ప్రొటీన్లు, బీటా కెరోటిన్ ఉంటాయి. ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు దొరుకుతాయి. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. కరివేపాకును వాడటం వల్ల స్కాల్ప్ తేమగా ఉండి జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది. కరివేపాకులోని విటమిన్ బి జుట్టు అకాలంగా నెరసిపోవడాన్ని తగ్గిస్తుంది. జుట్టుకు పోషణ, అసలు రంగును పునరుద్ధరించడంలో ఇది సహాయపడుతుంది. కరివేపాకులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. చుండ్రు, ఇన్ఫెక్షన్ల నుండి స్కాల్ప్ ను రక్షిస్తాయి. అయితే కరివేపాకు నూనెను తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం...

కరివేపాకును నీటిలో బాగా కడిగి శుభ్రం చేయాలి. తర్వాత ఆకులను గాలిలో ఆరబెట్టాలి. తడి లేకుండా చూసుకోవాలి. ఒక పాన్‌ పొయ్యి మీద పెట్టి.. మీడియం మంట పెట్టాలి. అందులో కొబ్బరి నూనెను వేడి చేయాలి. నూనె కాస్త వేడి అయ్యాక అందులో కరివేపాకు వేసుకోవాలి. తక్కువ మంట మీద సుమారు 10 నుంచి 15 నిమిషాలు మరిగించాలి. ఈ సమయంలో నూనెను తరచుగా కలపాలి. కొబ్బరి నూనెలో కరివేపాకు ఆకులు బాగా కరిగే వరకు మరిగించాలి. తర్వాత మంట ఆపి చల్లారనివ్వాలి. ఈ కరివేపాకు నూనెను ఒక సీసాలో వడకట్టాలి. కొబ్బరి నూనెకు బదులుగా ఆలివ్ నూనె లేదా బాదం నూనెను కూడా వాడుకోవచ్చు.

తర్వాత కరివేపాకు నూనెను జుట్టు మూలల నుంచి చివర్లదాకా రాయాలి. కాసేపు తలకు మసాజ్ చేయండి. నూనె రాసి మరో గంట సేపు అలాగే ఉంచాలి. షాంపూతో మీ తలను కడగాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ నూనె వాడితే వెంటనే ఫలితం ఉంటుంది. కరివేపాకు నూనె జుట్టుకు పోషణను ఇస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మూలాలను బలపరుస్తుంది. వేగంగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇలా కరివేపాకు నూనెతో జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.

Whats_app_banner