Akki Roti : అక్కి రొట్టె.. రుచితోపాటు ఆరోగ్యకరమైన అల్పాహారం-how to prepare akki roti for breakfast karnataka special recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Akki Roti : అక్కి రొట్టె.. రుచితోపాటు ఆరోగ్యకరమైన అల్పాహారం

Akki Roti : అక్కి రొట్టె.. రుచితోపాటు ఆరోగ్యకరమైన అల్పాహారం

Anand Sai HT Telugu

Akki Roti For Breakfast : ఉదయంపూట రోజూ ఒకేరకమైన బ్రేక్ ఫాస్ట్ చేస్తూ బోర్ కొడుతుందా? అయితే కొత్తగా కర్ణాటక స్టైల్‌లో అక్కి రోటీ చేయండి.

అక్కి రోటీ

సౌత్ ఇండియన్ వంటకాలు చాలా ఉంటాయి. నాలుకకు మంచి రుచిని ఇస్తాయి. అల్పాహారంలో కూడా విభిన్న రుచులు దొరుకుతాయి. అల్పాహారం రోజంతా శక్తిని ఇస్తుంది. ఇడ్లీ, దోసలాంటివి రోజూ చేసుకుని తింటాం. అయితే కొత్తగా కర్ణాటక స్టైల్ అక్కి రోటీ ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి కూడా ఉంటుంది. అక్కి రోటీ గ్లూటెన్ ఫ్రీ. ఇది బియ్యం పిండి, కూరగాయలను జోడించడం ద్వారా తయారు చేస్తారు.

క్రిస్పీగా, రుచికరమైన రైస్ రోటీ అల్పాహారం కోసం సరైనది. కర్నాటకలో చేసే అక్కి రోటీ వివిధ రకాల కూరగాయలతో తయారు చేస్తారు. ఇది సాధారణంగా అల్పాహారం కోసం తింటారు. బియ్యప్పిండితో తయారయ్యే ఈ రోటీలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది త్వరగా శక్తినిస్తుంది. సాంప్రదాయ పద్ధతిలో తయారుచేసిన అక్కి రోటీ తక్కువ కొవ్వు గల అల్పాహారం. కూరగాయలు, మసాలా దినుసులు జోడించడం వల్ల డైట్‌లో ఉన్నవారికి ఇది ఉత్తమమైనది. అక్కి రోటీని కొన్ని చోట్ల తాళిపట్టి అని కూడా అంటారు. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచికరమైన, క్రిస్పీ అక్కి రోటీని ఇలా చేయండి.

అక్కి రోటీకి కావాల్సిన పదార్థాలు

బియ్యం పిండి 2 కప్పులు

పావు కప్పు తురిమిన కొబ్బరి

ఉల్లిపాయలు ఒకటి

మిరపకాయ 2–3

కొత్తిమీర కొంచెం

కరివేపాకు 8-10

ఒక అంగుళం అల్లం

జీలకర్ర పొడి పావు చెంచా

ఉప్పు రుచికి సరిపడా

నూనె కావాల్సినంత

అక్కి రోటీ తయారీ విధానం

ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, కరివేపాకు, అల్లం చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

ఒక పాత్ర తీసుకుని అందులో బియ్యప్పిండి వేయాలి. దానికి తరిగిన కూరగాయలను వేసుకోవాలి .

ఇప్పుడు కొబ్బరి తురుము, జీలకర్ర పొడి, ఉప్పు వేయాలి.

దీన్ని బాగా కలపాలి.

కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా చేసుకోవాలి. చపాతీ పిండి కంటే పిండి కాస్త మెత్తగా ఉండనివ్వండి. దానికి ఒక చెంచా వంట నూనెను తప్పకుండా కలపండి. అప్పుడే మీరు చేసే రోటీ మెత్తగా ఉంటుంది. మూత మూసివేసి 10 నిమిషాలు ఉంచండి.

అరటి ఆకుపై కొద్దిగా నూనె వేయండి. ఇప్పుడు పిండిని చిన్న బంతిని తీసుకోండి. మీ చేతితో సున్నితంగా నొక్కండి. అరచేతి వెడల్పు రోటీని తయారు చేయండి.

ఇప్పుడు పాన్ వేడి చేయండి. దానిపై రోటీని ఉంచండి. నూనె వేసి రెండు వైపులా బాగా కాల్చాలి.

కొబ్బరి చట్నీ లేదా ఊరగాయతో అక్కి రోటీని ఆస్వాదించండి.

అక్కి రోటీలో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇది పిల్లల లంచ్ బాక్స్‌లకు కూడా చాలా బాగుంటుంది.

అక్కి రోటీ నోరూరించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది క్యారెట్, కొబ్బరి, మసాలా దినుసులతో తయారుచేస్తారు కాబట్టి.. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.