Momos in Idli cooker: ఇడ్లీ కుక్కర్లో వెజ్ మోమోలు.. ఇంట్లోనే హెల్తీగా చేసేయొచ్చు
Momos in Idli cooker: మోమోలు తయారీకి అవసరమయ్యే స్టీమర్ లేకపోతే ఇడ్లీ కుక్కర్లో కూాడా కొన్ని టిప్స్ పాటించి మోమోలు చేసుకోవచ్చు. ఆ పద్ధతిలో వెజ్ మోమోలు ఎలా చేయాలో చూసేయండి.
మోమోలు అంటే చాలా మందికి ఇష్టమే. అయితే వీటిని ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఏమేం అవసరమవుతాయని వాటి జోలికి పోము. నిజానికి మోమోలు మోమో స్టీమర్ మీద ఉడికిస్తారు. మన దగ్గర అది లేకపోతే ఇడ్లీ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్‌గా వెజ్ మోమోలను ఇడ్లీ కుక్కర్లో ఎలా చేసుకోవచ్చో చూసేయండి.
మోమో తయారీకి కావాల్సిన పదార్థాలు:
2 కప్పుల మైదా
5 చెంచాల నూనె
సగం టీస్పూన్ ఉప్పు
మోమో స్టఫ్ఫింగ్ కోసం కావాల్సిన పదార్థాలు:
ముప్పావు కప్పు క్యాబేజీ తరుము
కప్పున్నర క్యాబేజీ తురుము
సగం కప్పు క్యాప్సికం ముక్కలు
3 చెంచాల ఉల్లికాడల తరుగు
4 వెల్లుల్లి రెబ్బలు, సన్నటి ముక్కలు
సగం చెంచా మిరియాల పొడి
1 చెంచా సోయా సాస్
తగినంత ఉప్పు
మోమోల తయారీకి కావాల్సిన పదార్థాలు:
1. మోమోల బయట ఉండే పిండి పొరను తయారు సరిగ్గా చేసుకోవడం ముఖ్యం .లేదంటే మోమోలు తింటున్నప్పుడు పిండి రుచే ఎక్కువగా వస్తుంది.
2. దానికోసం ముందుగా మైదాను ఒక పెద్ద బౌల్ లో తీసుకోవాలి. అందులో 3 చెంచాల నూనె, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నీళ్లు కలుపుతూ మెత్తగా కలుపుకోవాలి. మీరు చపాతీల్లాగా వీలైనంత పలుచగా చేసేలా ఈ పిండి కలుపుకోవాలి. పిండిని కనీసం పది నిమిషాల పాటూ గట్టిగా కలుపుతూ ఉండాలి. చివరగా నూనె రాసుకోవాలి.
3. ఈ పిండిమీద మూత పెట్టేసి కనీసం అరగంట పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకుని వేడెక్కాక వెల్లుల్లి ముక్కలు వేసుకుని వేయించాలి. అవి కాస్త రంగు మారాక ఉల్లికాడల ముక్కలు వేసుకుని నిమిషం వేయించాలి.
5. తర్వాత క్యాబేజీ, క్యారట్ తురుము కూడా వేసుకోవాలి. ఇవి బాగా మగ్గి నీళ్లు తగ్గిపోవాలి. అప్పడు క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి.
6. తర్వాత మిరియాల పొడి, ఉప్పు వేసి మరో నిమిషం మూత పెట్టుకోవాలి.
7. అన్నీ పూర్తిగా మగ్గక్కర్లేదు. పచ్చి వాసన పోతే సరిపోతుంది.
8. ఇప్పుడు సోయాసాస్ కలుపుకుని అన్నీ కలియబెట్టి స్టవ్ కట్టేయాలి. మోమోల కోసం స్టఫ్ఫింగ్ రెడీ అయినట్లే.
9. ఇప్పుడు ఒక చిన్న సైజు పిండి ఉండను తీసుకుని పిండి చల్లుకుంటూ వీలైనంత సన్నగా చపాతీ లాగా ఒత్తుకోవాలి. ఎంత సన్నగా ఉంటే రుచి అంత బాగుంటుంది.
10. ఇప్పడు మధ్యలో మోమో స్టఫ్ఫింగ్ రెండు చెంచాల దాకా పెట్టుకోవాలి. తర్వత చపాతీని మనం కజ్జికాయలు అల్లుకున్నట్లు మీకిష్టమైనట్లుగా అల్లుకుని పిండి పూర్తిగా స్టఫ్ఫింగ్ చుట్టూ ఉండేలా చూడాలి.
11. అలాగే మిగతా మోమోలను కూడా రెడీ చేసుకోండి.
12. ఇడ్లీ కుక్కర్ తీసుకుని అందులో ఉన్న పాత్రకు నూనె రాసుకోండి. ఇడ్లీ కుక్కర్లో మూడు ఇడ్లీ ప్లేట్లుంటే కేవలం పై ప్లేటులో మాత్రమే మనం మోమోలు పెట్టుకుంటాం. అలాగే కింద ఇడ్లీలకు పోసుకున్నన్ని నీళ్లు పోసుకుంటాం.13. పైనుంటే పాత్రకు మాత్రమే నూనె రాసుకోవాలి. వాటిలో మోమోలు దూరంగా సర్దుకోవాలి. కనీసం 10 నిమిషాల పాటూ ఆవిరి మీద ఉడికించుకోవాలి. పైపొర కాస్త పారర్శకంగా మారి, బాగా ఉడికిపోతుంది. అలాగే చేతికి అటుకోవు. అంతే ఇలా ఉంటే మోమోలు ఉడికినట్లే. ఎక్కువగా ఉడికిస్తే గట్టిగా మారిపోతాయి.
టాపిక్