Alu khichdi: ఉపవాసం రోజు తక్షణశక్తి ఇచ్చే ఆలూ కిచిడీ తినండి.. 10 నిమిషాల్లో చేసేయొచ్చు-how to make tasty alu khichdi recipe for fasting ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alu Khichdi: ఉపవాసం రోజు తక్షణశక్తి ఇచ్చే ఆలూ కిచిడీ తినండి.. 10 నిమిషాల్లో చేసేయొచ్చు

Alu khichdi: ఉపవాసం రోజు తక్షణశక్తి ఇచ్చే ఆలూ కిచిడీ తినండి.. 10 నిమిషాల్లో చేసేయొచ్చు

Koutik Pranaya Sree HT Telugu
Aug 16, 2024 03:30 PM IST

Alu khichdi: ఉపవాసం రోజు తినగలిగే ఆలూ కిచిడీ ఒక్కసారి రుచి చూడండి. ఈ కిచిడీ తయారీకి బియ్యం వాడము. కేవలం బంగాళదుంపతోనే దీన్ని తయారు చేస్తాం. కాబట్టి ఉపవాసం రోజు తినొచ్చు. దీంతో తక్షణ శక్తి వస్తుంది. కడుపు కూడా నిండుతుంది. ఆలూ కిచిడీ ఎలా తయారు చేయాలో, కావాల్సిన పదార్థాలేంటో చూసేయండి.

ఆలూ కిచిడీ
ఆలూ కిచిడీ (pinterest)

ఉపవాసం రోజు తక్షణ శక్తినిచ్చే ఆహారాలు తినాల్సిందే. ఉపవాసం రోజున ఒక పూట తిన్నాకూడా రోజంతా నీరసం లేకుండా చేసే ఆహారం తీసుకోవాలి. దానికోసం ఆ రోజు ఎక్కువగా బంగాళదుంపలు, సాబుదానా, చిలగడ దుంపలు, వేరుశనగల్లాంటివి ఆహారంలో ఎక్కువగా తీసుకుంటారు. వాటితోనే రకరకాల వంటలు చేసి తింటారు. ఎప్పుడూ చేసుకునే సాబుదానా కిచిడీ, వడలు కాకుండా ఈ సారి ఉపవాసం రోజున ఆలూతో చేసే కిచిడీ రుచి చూడండి. కిచిడీ కదాని దీంట్లో బియ్యం ఏమీ వాడము. కేవలం ఆలూను తురిమేసి చేస్తాం. దీంతో కడుపు నిండడంతో పాటూ మంచి రుచితో ఉంటుంది. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూసేయండి. 

ఆలూ కిచిడీ తయారీకి కావాల్సిన పదార్థాలు:

2 పెద్ద బంగాళదుంపలు

పావు టీస్పూన్ జీలకర్ర

2 చెంచాల వంటనూనె లేదా నెయ్యి

సగం చెంచా సైంధవ లవణం (ఉపవాసం లేకపోతే ఉప్పు వాడుకోవచ్చు)

1 కరివేపాకు రెమ్మ

సగం చెంచా నిమ్మరసం

పావు కప్పు పల్లీలు

2 పచ్చిమిర్చి, ముద్ద

సగం చెంచా పంచదార

ఆలూ కిచిడీ తయారీ విధానం:

1. ముందుగా బంగాళదుంపల్ని తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. సాధారణంగా కన్నా కాస్త మందంగా ఉండేలా ఆలూ తురుముకోవాలి. సన్నగా ఉంటే రుచి అంత బాగుండదు. కిచిడీ చేసేటప్పుడు ముద్దలాగా అయిపోతుంది.

2. ఈ తరుమును నీళ్లలో వేసి ఒకసారి కడిగి నీళ్లు వంచేయాలి. 

3. ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకుని అందులో నూనె లేదా నెయ్యి వేసుకోవాలి. వేడెక్కాక జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. 

4. అవి కాస్త వేగాక తురుముకున్న బంగాళదుంపను కూడా వేసుకోవాలి. కాస్త ఉప్పు వేసి సన్నం మంట మీద ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. 

5. పది నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే బాగా ఉడికిపోతుంది. ఆలూ ఉడికాక పారదర్శకంగా కనిపిస్తుంది. అప్పుడు కాస్త కచ్చాపచ్చాగా దంచుకున్న పల్లీల పొడి, పచ్చిమిర్చి ముద్ద, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసుకోవాలి. 

6. అన్నీ కలిసేలా బాగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు మూత మూసి మరో రెండు నమిషాలు మగ్గించుకోవాలి. 

7. ఆలూ మిశ్రమం పచ్చివాసన పోయి మెత్తబడ్డాక కాస్త పంచదార కూడా వేసుకుని మరి కాసేపు ఉడికించుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. చాలా సింపుల్‌గా ఆలూ కిచిడీ రెడీ. 

 

 

టాపిక్