Sweetcorn pakodi: స్వీట్ కార్న్‌తో ఇలా క్రిస్పీ పకోడీ చేసేయండి, అసలే నూనె పీల్చవు
Sweetcorn pakodi: స్వీట్ కార్న్‌తో పకోడీ రెసిపీ చాలా సింపుల్. క్రిస్పీగా పకోడీకోసం ఏమేం కావాలో, తయారీ విధానం ఏంటో చూడండి.
స్వీట్ కార్న్ పకోడీ
స్వీట్ కార్న్‌తో పకోడీనే స్వీట్ కార్న్ ఫ్రిట్టర్స్ అని బయట తినే ఉంటారు. కాస్త మార్చి ఇంట్లోనే చాలా సులభంగా వీటిని చేసేయండి. స్వీట్ కార్న్ తీపి రుచితో, మసాలాల కారం, ఉప్పు రుచి కలిసి వీటి రుచి ప్రత్యేకంగా ఉంటుంది. తయారీ చూసేయండి.
స్వీట్ కార్న్ పకోడీ కోసం కావాల్సినవి:
2 కప్పులు ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు
ఒక చిన్న కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు
అరకప్పు శనగపిండి
2 టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి
చిటికెడు పసుపు
సగం చెంచా కాశ్మీరీ కారం
అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
ఒక టీస్పూన్ చాట్ మసాలా
రుచికి తగినంత ఉప్పు
స్వీట్ కార్న్ పకోడీ తయారీ విధానం:
- ముందుగా మిక్సీలో ఉడికించిన మొక్కజొన్న గింజల్ని వేసుకుని ఒక్కసారి తిప్పాలి.
- మొత్తం ముద్దలా అవ్వకుండా కొన్ని గింజలు కూడా అలాగే ఉండేలా చూసుకోవాలి.
- ఈ ముద్దను బౌల్ లోకి తీసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బియ్యం పిండి, పసుపు, కారం, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, ఉప్పు వేసి కలపాలి.
- తర్వాత నీళ్లు అస్సలే వేయకుండా అదే నీటితో గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి.
- ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి.
- ఈ పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పకోడీల్లాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే చాలు. స్వీట్ కార్న్ పకోడీ రెడీ.