Lemon Pickle: తియ్యగా, పుల్లగా నిమ్మకాయ ఊరగాయ, ఊరబెట్టకుండానే తినేయొచ్చు
Lemon Pickle: మార్కెట్లో దొరికే స్వీట్ లెమన్ ఊరగాయ మీకు ఇష్టమైతే ఇంట్లోనే దాన్ని తయారు చేయొచ్చు. ఊరగాయల్లాగా దీనికి చుక్క నూనె కూడా అక్కర్లేదు. తీపి నిమ్మకాయ ఊరగాయ రెసిపీ ఎలాగో చూసేయండి.
నిమ్మకాయ పచ్చడిని నూనె లేకుండా తయారుచేస్తారు. కాబట్టి ఇది తినడం ఆరోగ్యకరం. కాస్త పుల్లగా, తియ్యగా ఉండే నిమ్మకాయ ఊరగాయ ఇంట్లోనే చేసుకోవచ్చు. మార్కెట్‌లో దొరికే తీపి నిమ్మకాయ పచ్చడిని ఇంట్లోనే త్వరగా తయారుచేసుకోవచ్చు. రెండ్రోజులు ఊరబెడితే చాలు. దీన్నెలా తయారు చేయాలో చూడండి.
నిమ్మకాయ ఊరగాయ తయారీకి కావలసిన పదార్థాలు:
10-12 నిమ్మకాయలు
ఒక కప్పు పంచదార
ఒకటిన్నర టీస్పూన్ ఉప్పు
ఒక టీస్పూన్ నల్ల ఉప్పు
అర టీస్పూన్ కారం
ఒక టీస్పూన్ నల్ల మిరియాల పొడి
ఒక టీస్పూన్ వాము
ఒక టీస్పూన్ సోంపు
ఒక టీస్పూన్ ఇంగువ
ఒక టీస్పూన్ మెంతులు
నిమ్మకాయ ఊరగాయ రెసిపీ:
1. ముందుగా నిమ్మకాయలను బాగా కడిగి తడి లేకుండా ఒక గుడ్డతో తుడిచేయాలి.
2. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లో అరకప్పు నీళ్లు పోసి నిమ్మకాయలు కట్ చేయకుండా అలాగే వేసి ఒక విజిల్ వరకు ఉడికించాలి.
3. ముక్కలు చేసి వేస్తే రసం అంతా వృథా అవుతుందని గుర్తుంచుకోండి.
4. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసి నిమ్మకాయలను బయటకు తీసుకోవాలి.
5. చల్లారాక వాటిని ముక్కలు చేసుకుని గింజలు తీసేయాలి. రసం వృథా కాకుండా చూడండి.
6. ఇప్పుడు ఒక కడాయిలో సోంపు, మెంతులు వేయించాలి. దానితో పాటు ఇంగువ, వాము కూడా కలపాలి.
7. వీటన్నింటిని మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసి నిమ్మకాయ ముక్కల్లో కలిపేయాలి.
8. అలాగే ఉప్పు, నల్లుప్పు, మిరియాల పొడి, కారం కూడా వేసి బాగా కలపాలి.
9. ప్రెజర్ కుక్కర్లో మసాలాలు కలిపిన నిమ్మకాయ ముక్కలు మరోసారి వేసుకోవాలి.
10. అందులో పంచదార, నిమ్మరసం వస్తే అది కూడా వేసి ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించాలి.
11. చల్లారాక మంచి డబ్బాలో భద్రపర్చండి. అంతే.. ఇన్స్టంట్ నిమ్మకాయ ఊరగాయ రెడీ.