Masala coke: స్పైసీ మసాలా కోక్ ఇంట్లోనే చేసేయండి.. మీ రుచి దాహం తీరుతుంది
Masala coke: రుచిగా స్పైసీగా ఏదైనా డ్రింక్ తయారు చేయాలనుందా? అయితే ఈ స్పైసీ మసాలా కోక్ తయారు చేసి చూడండి. నిమిషాల్లో రెడీ అవుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ అప్పుడప్పుడు నోటికి రుచిగా, ఏదైనా కొత్తగా కావాలనిపిస్తుంది. ముఖ్యంగా వారాంతాల్లో ఏదైనా స్పెషల్‌గా తాగాలి అనిపిస్తే ఈ స్పెషల్ మసాలా కోక్ తయారు చేసేయండి. దీన్ని తయారు చేయడం చాలా సులభం. మామూలు కోక్‌తోనే దీన్ని తయారు చేయాలి. కాకపోతే మరింత రుచిగా, ఘాటుగా, స్పైసీగా తయారు చేస్తాం. రానున్న రక్షాబంధన్ రోజు కూడా మీ సోదరుడికి ఇది చేసి మీ చేత్తో ఇవ్వండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తాడు.
మసాలా కోక్ తయారీకి కావలసిన పదార్థాలు:
రెండు మూడు నిమ్మకాయలు
గుప్పెడు పుదీనా ఆకులు
అరచెంచా చాట్ మసాలా
అర చెంచా నల్లుప్పు లేదా బ్లాక్ సాల్ట్
పావు టీస్పూన్ కారం
కోక్
మసాలా కోక్ తయారీ విధానం:
1. ముందుగా ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకోండి. దాని అంచులకు నిమ్మ చెక్కతో పూయండి.
2. ఇక ప్లేట్‌లో కారం, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలపండి. నిమ్మరసం రుద్దిన గ్లాసు అంచును ఈ పొడిలో ఒకసారి తిప్పండి. గ్లాస్ అంచులకు ఈ మసాలా బాగా అంటుకుంటుంది.
3. ఇప్పుడు గ్లాసులో నిమ్మకాయ కాస్త పిండాలి, దాంతో పాటే నిమ్మ ముక్కలు కూడా వేసేయాలి. కాస్త కచ్చాపచ్చాగ క్రష్ చేసిన పుదీనా ఆకులు కూడా వేయాలి.
4. లేదంటే గ్లాసులోనే నిమ్మ చెక్క, పుదీనా వేశాక చెంచాతో గట్టిగా మెదిపినట్లు చేయాలి. అన్నీ బాగా కలిసిపోయి వాటి సారం బయటకు వస్తుంది. గ్లాస్ పగలకుండా మాత్రం చూసుకోండి.
5. ఆ మిశ్రమంలో నల్లుప్పు, చాట్ మసాలా, కారం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కోక్ పోసుకోవాలి. అంతే.. టేస్టీ, స్పైసీ స్పైసీ కోక్ రెడీ. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వును తీసుకువచ్చే పానీయం ఇది. తాగిన వెంటనే సూపర్ అనకపోతే చూడండి.
కార్బోనేటెడ్ పానీయాలు తాగడం అంత ఆరోగ్యకరం కాదు. కానీ ఎప్పుడైనా ప్రత్యేక సందర్భంలో మాత్రం ఇలా మసాలాతో టేస్టీ కోక్ చేసి తాగడం మాత్రం మర్చిపోవద్దు. రుచి మీరు మర్చిపోలేరు.