Room freshener DIY: ఇళ్లంతా బట్టల వాసన వస్తోందా? కెమికల్స్ లేని రూం ఫ్రెషనర్స్ మీరే చేసేయండి-how to make room fresheners at home with simple ingredients ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Room Freshener Diy: ఇళ్లంతా బట్టల వాసన వస్తోందా? కెమికల్స్ లేని రూం ఫ్రెషనర్స్ మీరే చేసేయండి

Room freshener DIY: ఇళ్లంతా బట్టల వాసన వస్తోందా? కెమికల్స్ లేని రూం ఫ్రెషనర్స్ మీరే చేసేయండి

Room freshener DIY: రూమ్ ఫ్రెషనర్ బయట కొనకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి.

రూమ్ ఫ్రెషనర్ (Shutterstock)

ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా, అందంగా కనిపించినా దుర్వాసన వస్తుంటే అస్సలు బాగుండదు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంట్లో తేమ వల్ల ఆ వాసన మరింత ఎక్కువుంటుంది. ఇంట్లో మంచి వాసన వస్తే అందరి మూడ్ చాలా ఆహ్లాదంగా, రిఫ్రెష్ గా ఉంటుంది. ఇందుకోసం మార్కెట్ నుంచి ఖరీదైన రూమ్ ఫ్రెషనర్లను కూడా కొనుగోలు చేస్తున్నాం. ఇవి ఖరీదైనవి, మన ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం చూడాల్సిందే. ఇంట్లోనే ఉండే కొన్ని వస్తువులతో అద్భుతమైన రూం ఫ్రెషనర్లను తయారు చేయడానికి ఒక సులభమైన మార్గ చూడండి.

రూం ఫ్రెషనర్లు:

నారింజ వాసన కోసం:

గదిలో కమ్మని నిమ్మకాయ, నారింజ వాసన వస్తే మూడే మారిపోతుంది. దానికోసం ఇంట్లోనే ఇలాంటి వాసననిచ్చే రూం ఫ్రెషనర్ తయారు చేయొచ్చు. దానికోసం పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి అందులో నిమ్మ, నారింజ తొక్కలు, పుదీనా ఆకులు వేసి మరిగించాలి. కాసేపు మరిగిన తర్వాత ఈ నీటిని వడగట్టి స్ప్రే బాటిల్ సాయంతో ఇంట్లో స్ప్రే చేసుకుంటే సరి. లేదంటే బదులుగా ఎసెన్షియల్ నూనెలు కూడా వాడవచ్చు. ఒక గిన్నెలో పది చుక్కలు లెమన్ ఎసెన్షియల్ నూనె, 5 చుక్కలు పెప్పర్ మింట్ నూనె వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇంట్లో స్ప్రే చేసినా అలాంటి ఫలితమే ఉంటుంది.

వెనీలా వాసన కోసం:

మీకు వెనీలా వాసన నచ్చితే, మీరు ఈ గది ఫ్రెషనర్ ఇష్టపడతారు. దాని వాసన చూస్తుంటే మీ ఇల్లు బేకరీనేమో అనిపించడం ఖాయం. ఒక గిన్నె నీటిలో మూడు నుండి నాలుగు టీస్పూన్ల వెనీలా ఎసెన్స్, ఏడెనిమిది చుక్కల నిమ్మ ఎసెన్షియల్ నూనె కలపండి. దీన్ని బాగా మిక్స్ చేసి స్ప్రే బాటిల్ సాయంతో ఇల్లు మొత్తం స్ప్రే చేయాలి. అంతే ఇల్లు సువాసనలు వెదజల్లుతుంది.

గులాబీల పరిమళం రావాలంటే:

గులాబీల వాసన ఎవరికి నచ్చదు? కాబట్టి గులాబీల సహాయంతో సింపుల్‌గా సువాసనలు వెదజల్లే రూం స్ప్రేను ఎందుకు తయారు చేయకూడదు. దీని కోసం మొదట ఒకటి లేదా రెండు కప్పుల నీటిలో గుప్పెడు గులాబీ రేకులను ముద్దలా చేసి వేయండి. అందులో బేకింగ్ సోడా కొద్దిగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడగట్టి అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ లేదా లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. స్ప్రే బాటిల్ సహాయంతో ఇంటి అంతటా చల్లాలి. కొద్ది సేపట్లో మీ ఇల్లంతా గులాబీ తోట వాసన వస్తుంది.

ఎసెన్షియల్ నూనెలతో:

ఎసెన్షియల్ ఆయిల్ సహాయంతో, మీరు మంచి సువాసననిచ్చే, వాసన ఎక్కువ సేపు వచ్చేలా రూం ఫ్రెషనర్ తయారు చేయొచ్చు. మీకు కావలసిందల్లా మీకు ఇష్టమైన ఎసెన్స్ ఆయిల్. గులాబీ, లావెండర్, లెమన్ గ్రాస్, టీ ట్రీ వంటి అనేక రకాల సువాసనలలో ఇవి సులభంగా లభిస్తాయి. ఏదైనా నూనెను ఎంచుకుని, కొన్ని చుక్కల నూనెను కొద్దిగా నీటిలో కలపండి. నీరు బాగా సువాసనగా మారినప్పుడు స్ప్రే బాటిల్ సహాయంతో ఇంట్లో స్ప్రే చేయాలి. మీ ఇల్లంతా వాసన వస్తుంది. ఇది చాలా సింపుల్ మార్గం. ఈ ఎసెన్షియల్ నూనెల తాలూకు వాసన కూడా చాలా సేపు ఉంటుంది.