Rice Zempic:వెయిట్ లాస్ డ్రింక్ రైస్ జెంపిక్ అంటే ఏంటి? ఇంట్లోనే రెండు నిమిషాల్లో సిద్ధం..-how to make rice zempic drink and know its benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rice Zempic:వెయిట్ లాస్ డ్రింక్ రైస్ జెంపిక్ అంటే ఏంటి? ఇంట్లోనే రెండు నిమిషాల్లో సిద్ధం..

Rice Zempic:వెయిట్ లాస్ డ్రింక్ రైస్ జెంపిక్ అంటే ఏంటి? ఇంట్లోనే రెండు నిమిషాల్లో సిద్ధం..

Koutik Pranaya Sree HT Telugu
Published Jul 07, 2024 01:00 PM IST

Rice Zempic: బరువు తగ్గించడంలో రైస్ జెంపిక్ పానీయం మ్యాజిక్ లాగా పనిచేస్తుందని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీన్ని ఎవరు ప్రయత్నించొచ్చు? దీనివల్ల నిజంగా బరువు తగ్గుతామా అని తెల్సుకోండి.

రైస్ జెంపిక్
రైస్ జెంపిక్ (freepik)

రైస్ జెంపిక్ అనే పదం కాస్త వెరైటీగా ఉంది కదూ. మామూలుగా టైప్ 2 డయాబెటిస్ తగ్గడానికి డాక్టర్లు ఒజెంపిక్ అనే మందును సూచిస్తారు. దాన్నే కాస్త మార్చి రైస్ జెంపిక్ అని చెప్పి ఈ బరువు తగ్గించే ద్రావణానికి పేరెట్టేశారు. నిజంగానే ఇది బరువు తగ్గిస్తుందా? ఇంతకి రైస్ జెంపిక్ అంటే ఏంటో తెల్సుకోండి.

ఒజెంపింక్ అనే మెడిసిన్ ను వైద్యులు టైప్ 2 డయాబెటిస్ కోసం సూచిస్తారు. ఇది రక్తంలో చక్కెర స్థాయుల్ని నియంత్రిస్తుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గిస్తుంది. కాకపోతే చాలా మంది ఈ ఒజెంపిక్ ను బరువు తగ్గడానికి వాడేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఖర్చులేనిదే రైస్ జెంపిక్ పానీయం. సోషల్ మీడియాలో చాలా మంది ఇది బరువు తగ్గించడంలో సాయపడుతుందని కూడా చెబుతున్నారు. దీన్ని ఇంట్లోనే రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.

రైస్ జెంపిక్ తయారీ:

ఇది స్టార్చ్ ఉన్న బియ్యం నీళ్లతో తయారు చేస్తారు. బియ్యం నానబెట్టిన నీళ్లలో నిమ్మరసం కలిపి తయారు చేస్తారు. దాన్నెలా చేయాలో చూసేయండి.

  1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.
  2. బియ్యంలో రెండు మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి. కనీసం 4 గంటల పాటూ నానబెట్టుకోవాలి. లేదంటే రాత్రంతా నానబెట్టినా పర్వాలేదు.
  3. ఇప్పుడు ఈ బియ్యం నీటిని వడకట్టి గ్లాసులో పోసుకోవాలి.
  4. అందులో రెండు చెంచాల నిమ్మరసం పోసుకొని తాగడమే. రైస్ జెంపిక్ రెడీ.

రైస్ జెంపిక్ తాగడం వల్ల బరువు తగ్గుతామా?

ఇప్పటివరకైతే ఏ పరిశోధన కూడా దీనివల్ల బరువు తగ్గుతారని చెప్పలేదు. కానీ దీన్ని వాడిన వాళ్లు మాత్రం ఇది బాగా పని చేస్తుందని సోషల్ మీడియాలో చెబుతున్నారు. ఈ నీళ్లు చేసే మ్యాజిక్ పక్కన పెడితే నిమ్మరసానికి మాత్రం బరువు తగ్గించే గుణం ఉంది. దీంట్లో పాలీఫినాల్స్ ఉంటాయి. ఇవి నేరుగా బరువు మీద ప్రభావం చూపుతాయని జర్నల్ ఆఫ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ, న్యూట్రీషన్ ప్రచురించిన కథనం చెబుతుంది. నిమ్మరసం వల్ల జీర్ణక్రియ కూడా వేగవంతం అవుతుంది.

ఎవరు దీన్ని తాగకూడదు?

ఇది బరువు తగ్గించే సంగతిలో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ హానికరమైన పానీయం మాత్రం కాదు. చాలా మట్టుకూ ఎవరైనా దీన్ని తాగొచ్చు. కాకపోతే ఇది స్టార్చ్‌తో చేసిన పానీయం కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్లు దూరంగా ఉండటం మేలు. అలాగే ఇది శరీరానికి కావాల్సిన హైడ్రెషన్ అందిస్తుంది. ఈ ఒక్క పానీయం మ్యాజిక్ చేస్తుందని నమ్మకుండా సరైన ఆహారం మితంగా తీసుకుంటే బరువు తగ్గొచ్చు.

డైటీషియన్ ఏమన్నారంటే..

ఇది స్టార్చ్ ఉన్న పానీయం. ఇది తాగగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. కాకపోతే ఎక్కువసేపు ఆకలి కాకుండా మాత్రం ఉండదు. పిండి పదార్థాలు ఉండటం వల్ల తొందరగా జీర్ణం అయిపోయి, తొందరగా ఆకలేస్తుంది. ఇది శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. ఎలక్ట్రోలైట్లను అందిస్తుంది. అధిక చక్కెరలున్న పానీయాలకు బదులు దీన్ని తాగడం మాత్రం మంచి మార్గమే అనుకోవచ్చు.

Whats_app_banner