Potato smiles: క్రిస్పీ పొటాటో స్మైల్స్ రెసిపీ, పది నిమిషాల్లో తయార్
Potato smiles: బంగాళదుంపలు ఉడకబెట్టిన మిశ్రమంతో చేసే పొటాటో స్మైల్స్ స్నాక్స్‌గా చేయడానికి చాలా బాగుంటాయి. వీటి తయారీ సులభమే.
పొటాటో స్మైల్స్ (pinterest)
పిల్లలకు, పెద్దలకు నచ్చే పొటాటో స్మైలీలు ఒకసారి చేసి చూడండి. బంగాళదుంపలు ఉడికించి చాలా సింపుల్ గా చేయొచ్చు వీటిని. పిల్లల పుట్టిన రోజు అతిథులకు, రోజూవారీ స్నాక్స్ లాగా కూడా చేయొచ్చు. రుచితో పాటూ చూడ్డానికి కూడా ఇవి భిన్నంగా అనిపిస్తాయి. వీటి తయారీ చూసేయండి.
పొటాటో స్మైల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
2 ఉడికించిన బంగాళదుంపలు
పావు కప్పు బ్రెడ్ క్రంబ్స్ (వీటి తయారీ కూడా ఇంట్లోనే చేయొచ్చు)
2 చెంచాల కార్న్ ఫ్లోర్ (లేకపోతే బియ్యం పిండి వాడొచ్చు)
సగం చెంచా కారం
సగం చెంచా ఉప్పు
డీప్ ఫ్రై కి సరిపడా నూనె
పొటాటో స్మైల్స్ తయారీ విధానం:
- ముందుగా ఉడికించిన బంగాళదుంపలను సన్నగా తురుముకోవాలి. చేత్తో మెదిపితే ఉండలుగా ఉంటుంది. తురుముకుంటే సన్నటి మిశ్రమం వస్తుంది.
- ఆలూ తురుమును ఒక పెద్ద బౌల్ లోకి తీసుకోవాలి. అందులో బ్రెడ్ క్రంబ్స్ వేసుకోవాలి.
- బ్రెడ్ క్రంబ్స్ మార్కెట్లో దొరుకుతాయి. లేదంటే ఇంట్లోనే రెండు బ్రెడ్స్ నూనె లేకుండా పెనం మీద పెట్టి క్రిస్పీగా అయ్యేదాకా కాల్చుకోవాలి.
- చల్లారాక వాటిని మిక్సీ పట్టుకుంటే బ్రెడ్ క్రంబ్స్ రెడీ అవుతాయి.
- బంగాళదుంప ముద్దలో బ్రెడ్ క్రంబ్స్, కార్న్ ఫ్లోర్, కారం, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
- పలుచగా అనిపిస్తే మరిన్ని బ్రెడ్ క్రంబ్స్ కాస్త కార్న్ ఫ్లోర్ కలుపుకోవచ్చు.
- ఈ ముద్దను ఫ్రిజ్ లో కనీసం అరగంటపాటూ పెట్టుకోవాలి. దాంతో పిండి బాగా సెట్ అవుతుంది.
- ఇప్పుడు ఆ పిండి ముద్దను చపాతీ కర్రతో కాస్త మందంగా ఒత్తుకోవాలి. చిన్న గిన్నె లేదా గ్లాసు సాయంతో గుండ్రటి ఆకారాలు కట్ చేసుకోవాలి.
- స్ట్రా వాడి రెండు కళ్లు, స్పూన్ తో నవ్వు ఆకారం కాస్త నొక్కినట్లు చేయాలి. స్మైలీ రెడీ అవుతుంది.
- ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకుని వీటిని ఒక్కోటి మెల్లగా వేసుకోవాలి. బంగారు వర్ణంలోకి మారాక తీసుకుంటే క్రిస్పీ ఆలూ స్మైలీ రెడీ అయినట్లే. దీన్ని సాస్ లేదా మయోనైజ్ తో సర్వ్ చేసుకోవచ్చు.