Potato halwa: ఆలూ హల్వా రుచి చూశారా.. ఈనాలుగు పదార్థాలుంటే చాలు..-how to make potato halwa at home in simple way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Potato Halwa: ఆలూ హల్వా రుచి చూశారా.. ఈనాలుగు పదార్థాలుంటే చాలు..

Potato halwa: ఆలూ హల్వా రుచి చూశారా.. ఈనాలుగు పదార్థాలుంటే చాలు..

Koutik Pranaya Sree HT Telugu
Jun 25, 2024 04:30 PM IST

Potato halwa: బంగాళదుంపలతో హల్వా పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. కేవలం నాలుగు పదార్థాలతో దీన్ని సులువుగా చేసుకోవచ్చు. అదెలాగో చూడండి.

ఆలూ హల్వా
ఆలూ హల్వా

బంగాళదుంపలతో హల్వా ఏంటీ అనుకోకండి. మనం ఆలూతో కూరలు, పరాటాలు, చిప్స్.. ఎక్కువగా కారంగా ఉండే వంటకాలే ఎక్కువగా చేస్తాం. ఆలూ హల్వా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వంటకం. ఆలూతో హల్వా ఎలా ఉంటుందోనని సందేహం అక్కర్లేదు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. ఆలూతో చేసినట్లు చెప్తే కానీ తెలీదు. అంత బాగుంటుంది. కేవలం పదే నిమిషాల్లో దీని తయారీ పూర్తవుతుంది. దానికోసం ఏం కావాలో, ఎలా చేసుకోవాలో చూసేయండి.

yearly horoscope entry point

బంగాళదుంప హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు:

3 పెద్ద బంగాళదుంపలు

1 కప్పు పంచదార

3 చెంచాల నెయ్యి

సగం టీస్పూన్ యాలకుల పొడి

కొద్దిగా కుంకుమపువ్వు (ఆప్షనల్)

బంగాళదుంప హల్వా తయారీ విధానం:

1. ముందుగా బంగాళదుంపల్ని ప్రెజర్ కుక్కర్లో ఉడికించుకోవాలి. వాటి తొక్కతీసి పక్కన పెట్టుకోవాలి.

2. కాస్త చల్లారాక ఫోర్క్ సాయంతో మెత్తగా మెదుపుకోవాలి.

3. ఒక కడాయి పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కాక అందులో మెదిపి పెట్టుకున్న బంగాళదుంప ముద్ద వేసుకోవాలి.

4. స్టవ్ మీడియం మంట మీద పెట్టుకుని ముద్దను కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాల్లో బంగాళదుంప గుజ్జు రంగు మారుతుంది. మంచి వాసన వస్తుంది.

5. అయినా మరో అయిదు నిమిషాలు అలా కలుపుతూనే ఉంటే నెయ్యిలో బాగా ఉడికి రుచి పెరుగుతుంది. అడుగంటకుండా ఉండాలంటే కలుపుతూ ఉండాలి.

6. ఇప్పుడు పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పటిదాకా చిక్కగా ఉన్న మిశ్రమం కాస్త పలుచగా అవుతుంది. మళ్లీ కాసేపు అలాగే కలుపుతూ ఉంటే ముద్దలాగా అయిపోతుంది. కడాయికి అంటుకోకుండా ముద్దలా అయిపోతుంది.

7. చివరగా యాలకుల పొడి, ఇష్టముంటే కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని ఒకసార కలియబెట్టి స్టవ్ కట్టేసుకుంటే చాలు. దీన్ని వేడిగా సర్వ్ చేస్తేనే రుచిగా ఉంటుంది.

పొటాటో లేదా ఆలూ ఎక్కువగా తినకూడదనే విషయం మన మనసులో ఉంటుంది. కానీ దాన్ని సరైన పద్ధతిలో వండుకుంటే మన శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. డీప్ ఫ్రై చేసిన చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైలు, బోండాల్లాంటివి అవి తయారు చేసే పద్ధతి వల్ల అనారోగ్యకరం కానీ లేదంటే బంగాళదుంప తినడం మంచిదే. బంగాళదుంపల్లో విటమిన్ సి, పీచు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

 

 

Whats_app_banner