Poha Fingers: అటుకులతో పోహా ఫింగర్స్ చేయండి, క్రంచీగా క్రిస్పీగా రుచిగా ఉంటాయివి-how to make poha fingers for evening snack recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Poha Fingers: అటుకులతో పోహా ఫింగర్స్ చేయండి, క్రంచీగా క్రిస్పీగా రుచిగా ఉంటాయివి

Poha Fingers: అటుకులతో పోహా ఫింగర్స్ చేయండి, క్రంచీగా క్రిస్పీగా రుచిగా ఉంటాయివి

Koutik Pranaya Sree HT Telugu
Oct 19, 2024 03:30 PM IST

Poha Fingers: అటుకులతో పోహా మాత్రమే కాదు రుచికరమైన స్నాక్స్ కూడా రెడీ చేయొచ్చు. అలాంటి టేస్టీ స్నాక్ పోహా ఫింగర్స్. ఆలూ రుచి కాస్త తగులుతూ క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ స్నాక్ రెసిపీ చూడండి.

పోహా ఫింగర్స్
పోహా ఫింగర్స్

అటుకులతో ఊరికే పోహా తిని బోర్ కొట్టేస్తుంది కదూ. అయితే సాయంత్రం పూట ఇలా రుచిగా పోహా బైట్స్ చేసేయండి. లోపల గుల్లగా, బయట క్రిస్పీగా, క్రంచీగా ఉండే ఈ స్నాక్స్ రుచి ప్రత్యేకమే. పిల్లలకైతే పక్కాగా నచ్చేస్తాయి. వీటి తయారీ ఎలాగో చూసేయండి.

పోహా ఫింగర్స్ తయారీ కోసం కావాల్సినవి:

కప్పున్నర సన్నం అటుకులు

2 లేదా 3 బంగాళదుంపలు

అరచెంచా పచ్చిమిర్చి ముద్ద

అరచెంచా వెల్లుల్లి తరుగు

అర చెంచా అల్లం ముద్ద

అర టీస్పూన్ కారం

అర టీస్పూన్ మిరియాల పొడి

గుప్పెడు కొత్తిమీర తరుగు

అర టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్

అర చెంచా ఉప్పు

పావు కప్పు మైదా

డీప్ ఫ్రై కోసం నూనె

పోహా ఫింగర్స్ తయారీ విధానం:

  1. ముందుగా బంగాళదుంపలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అటుకులను తీసుకుని మిక్సీలో వేసుకుని మెత్తటి పొడి పట్టుకోవాలి.
  2. ఈ పొడిని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో ఉడికించుకున్న బంగాళదుంపను ముద్దలాగా చేసి వేసుకోవాలి.
  3. అందులోనే పచ్చిమిర్చి ముద్ద, వెల్లుల్లి తరుగు, అల్లం ముద్ద, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కారం, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
  4. బంగాళదుంపలో ఉండే నీటిశాతంతోనే దాదాపుగా ముద్ద రెడీ అవుతుంది. అందులో ఇప్పుడు కాస్త మైదా కూడా వేసుకోండి. అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. అవసరం అనుకుంటేనే రెండు చెంచాల నీళ్లు పోసుకోండి.
  5. మైదా బదులుగా కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి కూడా వాడొచ్చు.
  6. ఇప్పుడు అరచేతులకు నూనె రాసుకుని చిన్న పిండి ఉండను తీసుకుని చేతులతో పొడవుగా తాల్చినట్లు చేయాలి.
  7. కాస్త మురుకుల ఆకారంలోకి తీసుకొస్తే చాలు. అన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకోండి.
  8. ఇప్పుడు కడాయి పెట్టుకును నూనె పోసుకుని వేడెక్కాక అందులో ఈ పోహా ఫింగర్స్ కొన్ని కొన్ని వేసుకుని బంగారు వర్ణంలోకి మారేదాకా వేయించుకోండి.
  9. క్రిస్పీగా అవగానే ఒక పేపర్ టవెల్ మీదకి తీసుకోండి. దాంతో కాస్త ఎక్కువగా నూనె ఉంటే అది పీల్చుకుంటుంది. పోహా ఫింగర్స్ రెడీ అయినట్లే.
  10. టమాటా సాస్ అద్దుకుని వీటిని తింటే ఎవరికైనా నచ్చేస్తాయి.

Whats_app_banner