Palak Paneer Paratha: పన్నీర్ స్టఫ్టింగ్‌తో పాలకూర పరాటాలు, రెండు తింటే కడుపు నిండిపోతుంది-how to make palak paneer paratha for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Palak Paneer Paratha: పన్నీర్ స్టఫ్టింగ్‌తో పాలకూర పరాటాలు, రెండు తింటే కడుపు నిండిపోతుంది

Palak Paneer Paratha: పన్నీర్ స్టఫ్టింగ్‌తో పాలకూర పరాటాలు, రెండు తింటే కడుపు నిండిపోతుంది

Koutik Pranaya Sree HT Telugu
Sep 17, 2024 06:30 AM IST

Palak Paneer Paratha: పాలక్, పన్నీర్ కాంబినేషన్‌లో పరాటా చేసి చూడండి. అల్పాహారంలోకి, డిన్నర్ లోకి కూడా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ. చపాతీలు చేసినంత సులువుగా చేసేయొచ్చు. ఎలాగో చూడండి.

పాలక్ పన్నీర్ పరాటా
పాలక్ పన్నీర్ పరాటా (pinterest)

పాలక్ పన్నీర్ కర్రీయే కాదు. పరాటా కూడా ప్రయత్నించొచ్చు. అన్ని పరాటాలతో పోలిస్తే దీని రుచి మరింత బాగుంటుంది. తయారీ కూడా సులభమే. పన్నీర్ రుచితో పాలకూర రుచితో తింటే యమ్మీగా అనిపిస్తుందిది. దీనికి కావాల్సినవి, తయారీ విధానం ఏంటో చూసేయండి.

పాలక్ పన్నీర్ పరాటా తయారీకి కావాల్సినవి:

1 కప్పు గోధుమపిండి

2 కట్టల పాలకూర, తరుగు

ఒకటిన్నర కప్పుల పన్నీర్ తురుము

3 పచ్చిమిర్చి, సన్నం ముక్కల తరుగు

పావు టీస్పూన్ ఉప్పు

పావు కప్పు నూనె

1 ఉల్లిపాయ, సన్నటి ముక్కల తరుగు

గుప్పెడు కొత్తిమీర తరుగు

సగం చెంచా జీలకర్ర పొడి

సగం చెంచా కారం

సగం చెంచా గరం మసాలా (ఆప్షనల్)

సగం చెంచా ఉప్పు

2 చెంచాల నెయ్యి

పాలక్ పన్నీర్ పరాటా తయారీ విధానం:

  1. ముందుగా ఒక పాత్రలో గోధుమపిండి తీసుకుని ఉప్పు, చెంచా నూనె వేసుకోవాలి. నీళ్లు పోసుకుని చపాతీ పిండికన్నా కాస్త గట్టిగా కలుపుకోవాలి.
  2. పిండిని పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు స్టఫ్ఫింగ్ సిద్ధం చేసుకోవాలి.
  3. ఒక పాత్రలో పాలకూర వేసుకుని సగం కప్పు నీళ్లు వేసుకుని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి.
  4. నీళ్లలో నుంచి తీసేసి ఆ పాలకూరలో పన్నీర్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మసాలాలు వేసి బాగా కలుపుకోవాలి.
  5. ఇప్పుడు గోధుమపిండిని చిన్న ఉండలుగా చేసుకుని కాస్త చపాతీలా ఒత్తుకుని మధ్యలో పాలకూర స్టఫ్ఫింగ్ ఒక చెంచాడు పెట్టుకోవాలి.
  6. పిండి ఉండను అన్ని వైపులా మూసేసినట్లు చేయాలి. తర్వాత గోధుమపిండి చల్లుకుంటూ కాస్త మందంగా పరాటాలా ఒత్తుకోవాలి.
  7. పెనం పెట్టుకుని వేడెక్కాక ఈ పరాటాలు వేసుకోవాలి. అంచుల వెంబడి నూనె వేసుకుని కాల్చుకోవాలి.
  8. కాస్త రంగు మారితే చాలు. పరాటా ఉడికినట్లే. తీసి వేడిగా సర్వ్ చేసుకోండి చాలు.