Palak paneer pakodi: పాలక్ పన్నీర్ పకోడీలు.. వేడి వేడి స్నాక్ రెసిపీ..
Palak paneer pakodi: పాలకూర రుచితో పన్నీర్ పకోడీలు చేసి చూడండి. చాలా నచ్చేస్తాయి. వాటిని పక్కా కొలతలతో ఎలా చేయాలో చూడండి.
పాలక్ పన్నీర్ అంటే కూరలాగే తిని ఉంటాం కానీ, పకోడీలాగా ఈ కాంబినేషన్ ప్రయత్నించి ఉండము. వినడానికి కొత్తగా ఉన్నా పాలక్ పన్నీర్ పకోడీ రుచిలో కమ్మగా ఉంటుంది. పాలకూరతో ఆరోగ్యం, పన్నీర్ తో కమ్మదనం ఈ పకోడీకి వస్తుంది. దీన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వర్షాకాలంలో సాయంత్రం పూట టక్కుమని వీటిని చేసేయొచ్చు. ఎప్పుడూ చేసే పకోడీల కన్నా కొత్తగా అనిపిస్తాయి. పిల్లలైనా, పెద్దలైనా ఇష్టంగా తింటారు. వాటి తయారీ ఎలాగో చూసేయండి.
పాలక్ పన్నీర్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 కట్ట పాలకూర
2 కప్పుల పన్నీర్ ముక్కలు
1 కప్పు శనగపిండి
తగినంత ఉప్పు
1 చెంచా జీలకర్ర
1 చెంచా ధనియాల పొడి
పావు టీస్పూన్ వాము
1 చెంచా జీలకర్ర పొడి
చిటికెడు ఇంగువ
పాలక్ పన్నీర్ పకోడీ తయారీ విధానం:
1. ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి నీళ్లు మొత్తం పోయేలా ఆరబెట్టాలి. తర్వాత కాడలు తీసేసి ఆకులను మాత్రం ఉంచుకోవాలి.
2. ఈ ఆకులను వీలైనంత సన్నగా తరుగుకోవాలి.
3. ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో పాలకూర తరుగు, శనగపిండి, పన్నీర్ ముక్కలు, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంగువ కూడా వేసుకోవాలి.
4. ముందు నీళ్లు పోసుకోకుండా అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. పన్నీర్ ను బుర్జీలాగా మెదపకూడదు. క్యుబ్స్ గానే ఉండేలా చూడాలి. కొన్ని ముక్కలు విరిగిపోతే పరవాలేదు.
5. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పకోడీ పిండి కలుపుకోవాలి. పిండి గట్టిగానే ఉండాలి. అయితేనే పకోడీ రుచి బాగుంటుంది.జారుడుగా కలుపుకోకూడదు.
6. ఇప్పుడు కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసుకోవాలి. వేడెక్కాక పకోడీలను చెంచాతో వేసుకోవాలి. ప్రతిసారీ పన్నీర్ ముక్క వచ్చేలా చూసుకోవాలి. దాంతో పన్నీర్ ప్రతి పకోడీలో ఉంటుంది. రుచి బాగుంటుంది.
7. పకోడీలు మీడియం మంట మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి రంగు మారి క్రిస్పీగా అవుతాయి.
8. అప్పుడు బయటకు తీసుకుంటే చాలు. పాలక్ పన్నీర్ పకోడీ రెడీ అయినట్లే. వీటిని సాస్ లేదా కెచప్ తో సర్వ్ చేసుకుంటే రుచిగా ఉంటాయి.