Methi rava biscuits: మెంతికూర రవ్వ బిస్కట్లు, ఓవెన్ లేకుండానే చేసే సింపుల్ రెసిపీ-how to make methi rava biscuits for healthy snack ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Methi Rava Biscuits: మెంతికూర రవ్వ బిస్కట్లు, ఓవెన్ లేకుండానే చేసే సింపుల్ రెసిపీ

Methi rava biscuits: మెంతికూర రవ్వ బిస్కట్లు, ఓవెన్ లేకుండానే చేసే సింపుల్ రెసిపీ

Koutik Pranaya Sree HT Telugu
Sep 24, 2024 03:30 PM IST

Methi rava biscuits: మెంతికూర ఫ్లేవర్‌తో బిస్కట్లు మంచి రుచిగా ఉంటాయి. ఇంట్లోనే హెల్తీగా ప్రతిదీ తినాలనుకునేవాళ్లు వీటిని ప్రయత్నించండి. ఈ మెంతికూర ఫ్లేవర్ బిస్కట్ల తయారీ చాలా సింపుల్.

మెంతికూర రవ్వ బిస్కట్లు
మెంతికూర రవ్వ బిస్కట్లు

మెంతికూర ఫ్లేవర్ చాలా మందికి నచ్చుతుంది. కొన్ని రెడీమేడ్ బిస్కట్లలో ఈ ఫ్లేవర్ ఉంటే చాలా మందికి ఇష్టం కూడా. ఇంట్లోనే ఈ రుచితో మెంతికూర రవ్వ బిస్కట్లు చేసేయొచ్చు. డబ్బాలో ప్యాక్ చేసి ఇచ్చారంటే బయట కొన్న బిస్కట్లనే అనుకుంటారు. తయారీ చూసేయండి. మీకు మెంతికూర రుచి నచ్చితే ఒక కట్ట వేసేయండి. లేదంటే తక్కువగా వాడండి చాలు.

మెంతికూర రవ్వ బిస్కట్ల తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 కట్ట మెంతికూర

సగం కప్పు రవ్వ

పావు చెంచా జీలకర్ర

సగం చెంచా కారం

పావు చెంచా ఉప్పు

సగం టీస్పూన్ మిరియాల పొడి

2 కప్పుల మైదా

3 చెంచాల నెయ్యి

డీప్ ఫ్రైకి సరిపడా నూనె

మెంతికూర రవ్వ బిస్కట్ల తయారీ విధానం:

  1. ముందుగా మెంతికూరను వీలైనంత సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
  2. ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని అందులో మైదా, రవ్వ, జీలకర్ర, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసుకోవాలి.
  3. ఒక నిమిషం నీళ్లు వేయకుండానే పొడిగా అన్నీ కలిసేలా పిండి తడుపుకోవాలి.
  4. తర్వాత కరిగించిన నెయ్యి వేసుకుని కాస్త ముద్దలాగా అనుకుంటూ పిండిని మరోసారి కలపాలి. నెయ్యికి బదులుగా బటర్ వాడినా కూడా మంచి రుచి వస్తుంది. తింటున్నప్పుడు ఆ రుచి తెలుస్తుంది.
  5. ఇప్పుడు మెంతికూర తరుగు కూడా వేసి ఒకసారి కలిపి నీళ్లు పోసుకోవాలి. పిండి ముద్దలాగా అయితే చాలు. అన్ని నీళ్లు పోసి ఆపేయడమే. అంతకన్నా ఎక్కువ నీళ్లు పోస్తే బిస్కట్ల ఆకారం నిలవదు.
  6. ఇప్పుడు ఈ పిండిని కాస్త తీసుకుని చపాతీ కన్నా కాస్త మందంగా ఒత్తుకోవాలి. అవసరమైతే కాస్త పిండి చల్లుకోండి. చాకు సాయంతో మీకిష్టమైన ఆకారంలో కట్ చేసుకోవాలి.
  7. కుకీ కట్టర్లు ఉంటే వాటిని వాడి రకరకాల ఆకారాల్లోనూ ఈ బిస్కట్లు చేయొచ్చు.
  8. కడాయి పెట్టుకుని నూనె పోసి వేడి అవ్వనివ్వాలి. మంట మీడియం పెట్టుకుని కొన్ని కొన్నిగా బిస్కట్లు వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
  9. మంట మరీ ఎక్కువుంటే బిస్కట్లు బయట రంగు మారి, లోపల ఉడకవని గుర్తుంచుకోండి.
  10. కాస్త రంగు మారాక బిస్కట్లను పల్లెంలోకి తీసుకోండి. చల్లారిన తర్వాత డబ్బాలో వేసి పెట్టారంటే రెండు వారాలైనా పాడవ్వవు. క్రిస్పీగానే ఉంటాయి.

టాపిక్