Kulhad Pizza: మట్టి గ్లాసులో అదిరిపోయే కుల్హడ్ పీజ్జా రెసిపీ, మామూలు పీజ్జా కన్నా దీని తయారీయే సులభం
Kulhad Pizza: కుల్హడ్ పీజ్జా ఈ మధ్య చాలా వైరల్ అవుతోంది. ఈ స్ట్రీట్ ఫుడ్ రెసిపీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలైతే తెగ ఇష్టంగా తింటారు. దీన్నెలా తయారు చేయాలో చూడండి.
కుల్హడ్ పీజ్జా రెసిపీ (pinterest)
కుల్హడ్ పీజ్జాలో కుల్హడ్ అంటే మట్టితో చేసిన పాత్ర అని అర్థం. ఈ పీజ్జాను మట్టితో చేసిన గ్లాసులో, లేదా చిన్న కుండలోనూ తయారు చేస్తారు. మామూలు పిజ్జాలా కాకుండా దీని తయారీ కాస్త వెరైటీగానే ఉంటుంది. అయితే మట్టిలో పీజ్జా ఉడకడం వల్ల పీజ్జాకు ప్రత్యేక రుచి వస్తుంది. దీన్ని చిన్న పార్టీలకు మంచి స్టార్టర్ లాగానూ సర్వ్ చేయొచ్చు. రెసిపీ చూసేయండి.
కుల్హడ్ పీజ్జా తయారీకి కావాల్సిన పదార్థాలు:
2 చెంచాల బటర్
1 చిన్న ఉల్లిపాయ సన్నటి ముక్కల తరుగు
1 చెంచా సన్నగా తరిగిన టమాటా ముక్కలు
1 చెంచా సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు
2 చెంచాల స్వీట్ కార్న్
2 చెంచాల పీజ్జా సాస్
పావు కప్పు పన్నీర్ ముక్కలు
1 చెంచా వెల్లుల్లి తురుము
1 పీజ్జా బేస్
1 కప్పు చీజ్
పావు చెంచా చిల్లీ ఫ్లేక్స్
చిటికెడు ఆరిగానో పొడి
1 చెంచా ఫ్రెష్ క్రీం
1 చెంచా బ్లాక్ ఆలివ్స్
కుల్హడ్ పీజ్జా తయారీ విధానం:
- ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో బటర్ వేసుకోవాలి. అది కరిగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
- అవి కాస్త రంగు మారాక టమాటా ముక్కలు, క్యాప్సికం తరుగు, స్వీట్ కార్న్ వేసి మూత పెట్టి మగ్గించాలి. రెండు నిమిషాలయ్యాక పీజ్జా సాస్, పన్నీర్ కూడా వేసి కలపాలి.
- ఇప్పుడు మరో ప్యాన్ లో బటర్ వేసుకుని వెల్లుల్లి తురుము వేసి వేయించాలి. అందులోనే పీజ్జా బేస్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ కట్టేయాలి.
- ఇప్పుడు ఒక కుల్హడ్ లేదా మట్టి కుండ లేదా మట్టి గ్లాస్ తీసుకోవాలి. కింది పీజ్జా కూరగాయల మసాలా పెట్టుకోవాలి. మీద ఒక చెంచా పీజ్జా బేస్ మిశ్రమం, చీజ్ తురుముకోవాలి.
- మళ్లీ కాస్త కూరగాయల మిశ్రమం వేసుకోవాలి. చీజ్ తరుముకుని చిల్లి ఫ్లేక్స్, ఫ్రెష్ క్రీం వేసుకోవాలి.
- చివరగా మళ్లీ పీజ్జా బేస్ ముక్కలు వేసుకుని చీజ్ తురుముకోవాలి. మీద చిల్లీ, ఆరిగానో, ఆలివ్ ముక్కలు పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఓవెన్ టెంపరేచర్ 160 నుంచి 170 డిగ్రీల పెట్టి నాలుగైదు నిమిషాలు ఉంచాలి. అంతే చీజ్ కరిగిపోయి, బాగా ఉడికి కుల్హడ్ పీజ్జా రెడీ అవుతుంది. ఓవెన్ లేకపోతే ఒక అడుగు మందం ఉన్న కడాయిలో ఉప్పు వేసి అది వేడెక్కాక మధ్యలో ఈ కుల్హడ్ పెట్టాలి. మూత పెట్టి ఉడికించినా పీజ్జా రెడీ అవుతుంది.