Jonna murukulu: జొన్నపిండి మురుకులు చేయండి.. పిల్లలకు, షుగర్ పేషెంట్లకు మంచి స్నాక్
Jonna murukulu: జొన్నపిండితో ఎక్కువగా స్నాక్స్ చేసుకోరు. కానీ వీటితో చేసే మురుకులు అటు పిల్లలు, డయాబెటిస్ పేషెంట్లు కూడా తినొచ్చు. వీటి తయారీ చాలా సులభం. అదెలాగో చూసేయండి.
జొన్నపిండి మురుకులు
డయాబెటిస్ ఉన్నవాళ్లకి ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. స్నాక్స్ కూడా ఏం తినాలన్నా ఆలోచించాల్సిందే. సాంప్రదాయ వంటకాలన్నీ ఎక్కువగా కేలరీలు పెంచేవే ఉంటాయి. అయితే ఒకసారి ఈ జొన్న పిండి మురుకులు చేసి చూడండి. డయాబెటిస్ ఉన్నవాళ్లకే కాదూ, చిన్న పిల్లలకూ ఇవి నచ్చేస్తాయి. కేవలం పది నిమిషాల్లో వీటి తయారీ పూర్తవుతుంది. అదెలాగో చూడండి.
జొన్న పిండి మురుకుల తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు జొన్నపిండి
పావు కప్పు బియ్యం పిండి
2 చెంచాల సెనగపిండి
1 చెంచా కారం పొడి
1 టీస్పూన్ జీలకర్ర
1 టీస్పూన్ నువ్వులు
పావు టీస్పూన్ ఇంగువ
అరచెంచా ఉప్పు
రెండు చెంచాల బటర్
డీప్ ఫ్రైకి సరిపడా నూనె
జొన్న పిండి మురుకుల తయారీ విధానం:
- ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో జొన్నపిండి, బియ్యం పిండి, శనగపిండి, కారం, జీలకర్ర, నువ్వులు, ఇంగువ, ఉప్పు, బటర్ వేసుకోవాలి.
- అన్నీ బాగా కలుపుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి.
- ఆలోపు కడాయి పెట్టుకుని నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక పిండి ముద్దను మురుకులు ఒత్తుకునే మెషీన్‌లో పెట్టుకోవాలి.
- వేడెక్కిన నూనెలో నేరుగా ఒత్తుకుంటే సరిపోతుంది. వాటిని రంగు మారేంత వరకు వేయించుకుంటే క్రిస్పీగా అవుతాయి.
- నూనెలో నుంచి తీసి చల్లారాక ఒక డబ్బాలో పెట్టుకున్నారంటే రెండు వారాలైనా నిల్వ ఉంటాయి.