ఉసిరికాయ, మందార… ఈ రెండూ కూడా జుట్టును ఒత్తుగా పెంచుతాయి. జుట్టు రాలకుండా అడ్డుకుంటాయి. కానీ చాలా మందికి ఈ రెండింటినీ జుట్టు కోసం ఎలా వాడాలో తెలియదు. ఉసిరి, మందార ఉపయోగించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే నూనెను తయారు చేసుకోవచ్చు.
ఈ నూనెలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. నెత్తిపై రక్త ప్రసరణను పెంచుతుంది. రక్తప్రసరణ చురుకుగా మారితే జుట్టు పెరుగుదల కూడా బావుంటుంది. ఈ నూనెను ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఉసిరి కాయ, మందార ఆకులు ఉపయోగించి నూనె ఎలా తయారుచేయవచ్చో ఇచ్చాము. ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
రెండు స్పూన్ల ఉసిరికాయ పొడి, పది నుంచి పదిహేను మందార ఆకులు, రెండు మూడు మందార పువ్వులు తీసుకోవాలి. ఆ మందార ఆకులను ఎండలో కాకుండా నీడలోనే రెండు రోజులు ఎండబెట్టాలి. ఒక కప్పు కొబ్బరి నూనె, ఒక కప్పు నువ్వుల నూనె తీసుకుని ఒక గిన్నెలో వేయండి. దీన్ని చిన్న మంట మీద వేడి చేయాలి. అందులో మందార ఆకులు, మందార పువ్వు రేకులు, ఉసిరిపొడి వేసి కొన్ని నిమిషాలు వేడిచేయాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 20 నిమిషాలు వేడి చేస్తే సరిపోతుంది.
తర్వాత స్టవ్ మీద నుంచి దింపి చల్లారనివ్వాలి. గది ఉష్ణోగ్రతకు వచ్చాక ఫిల్టర్ చేయాలి. నూనె వడగట్టి అవశేషాలు బయటపడేయాలి. ఈ నూనెను ఒక సీసాలో ఉంచుకుని దాచుకోవాలి.
ఈ నూనెను తలకు అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. కొన్ని గంటలు అలా వదిలేయాలి లేదా రాత్రంతా తలకు పట్టించాలి. ఆ తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా ఆరు నెలల పాటు నిరంతరాయంగా వాడితే జుట్టు మందంగా పెరుగుతుంది. మీకు కావాల్సినంత తయారు చేసి ఫలితాలను పొందుతారు.
ఉసిరికాయ మన దేశానికి చెందినదే. దీనిలో ఔషధ గుణాలు ఎక్కువ. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా నిండి ఉంటాయి. ఉసిరికాయలను తినడం వల్లే కాదు, నూనెలుగా మార్చి జుట్టుకు రాయడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇంట్లో ఉసిరి నూనె వాడుతూ ఉంటారు. ఇక్కడ తయారు చేసిన నూనెను జుట్టుకు తరచూ అప్లై చేయడం వల్ల అది సహజంగానే కండిషనర్ గా పనిచేస్తుంది. జుట్టుకు పోషణ, బలం లభిస్తుంది. వెంట్రుకలు విరిగిపోవడం చాలావరకు తగ్గుతుంది. ఆరోగ్యకరంగా జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. అలాగే మెరుపును కూడా ఇస్తుంది. ఉసిరి నూనె వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉన్నాయని ఇంతవరకు ఏ అధ్యయనము తేల్చలేదు.
ఈ నూనె తయారీలో మందార పువ్వులు, మందార ఆకులను కూడా కలిపాము. ఇవి కూడా జుట్టుకు, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. మందారలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్ ఏ, విటమిన్ సి, అమైనో యాసిడ్లు నూనెలో చేరుతాయి. ఇవి జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తాయి. చుండ్రు పట్టకుండా అడ్డుకుంటాయి. అలాగే మాడుపై ఇన్ఫ్లమేషన్ రాకుండా అడ్డుకుంటుంది. అతినీలలోహిత కిరణాల నుండి జుట్టును రక్షించేందుకు సహాయపడుతుంది.
ఉసిరి, మందార కలిపిన ఈ నూనెను తరచూ రాయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రెండు నెలలపాటు ఈ ఇక్కడ ఇచ్చిన పద్ధతిలో మీరు నూనెను తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేసి చూడండి. మీకు మంచి ఫలితాలు కనిపించడం మొదలవుతాయి.
సంబంధిత కథనం