Endu Royyala karam: ఎండు రొయ్యల కారం పొడి ఎప్పుడైనా తిన్నారా? వేడి వేడి అన్నంలో కలిపి తిన్నారంటే రుచి అదిరిపోతుంది!-how to make dry prawns powder endu royyala karam podi tasty and easy non veg recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Endu Royyala Karam: ఎండు రొయ్యల కారం పొడి ఎప్పుడైనా తిన్నారా? వేడి వేడి అన్నంలో కలిపి తిన్నారంటే రుచి అదిరిపోతుంది!

Endu Royyala karam: ఎండు రొయ్యల కారం పొడి ఎప్పుడైనా తిన్నారా? వేడి వేడి అన్నంలో కలిపి తిన్నారంటే రుచి అదిరిపోతుంది!

Ramya Sri Marka HT Telugu
Feb 02, 2025 05:00 PM IST

మీరు కరివేపాకు కారం తిని ఉంటారు, మునగాకు కారంపొడి కూడా రుచి చూసే ఉంటారు. కానీ ఎప్పుడైనా ఎండు రొయ్యల కారంపొడి తిని చూశారా? వేడి వేడి అన్నంతో కలిపి తిన్నారంటే అదిరింది అనకుండా ఉండలేరు! సీ ఫుడ్ ఇష్టపడేవారైతే దీన్ని తప్పకుండా ట్రై చేయాల్సిందే! ఎండు రొయ్యల కారంపొడి ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

ఎండు రొయ్యల కారం పొడి తయారు చేసే విధానం ఇక్కడ ఉంది
ఎండు రొయ్యల కారం పొడి తయారు చేసే విధానం ఇక్కడ ఉంది (Pinterest )

మీరు ఇప్పటి వరకూ కరివేపాకు కారం పొడి తిని ఉంటారు, మునగాకు కారం, ఉసిరి కారం వంటి రకరకాల పొడులను రుచి చూసే ఉంటారు. కానీ ఎప్పుడైనా ఎండు రొయ్యలతో తయారు చేసిన కారంపొడి రుచి చూశారా? ఇప్పటి వరకూ లేకపోతే మీరు అద్భుతమైన రుచి మిస్ అయినట్టే. మీరు మాంసాహార ప్రియులు అయితే, ముఖ్యంగా సీ ఫుడ్ లవర్స్ అయి ఉంటే ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో ఈ కారం పొడిని వేసుకుని తిన్నారంటే అబ్బా అదిరిపోయింది అనకుండా ఉండలేరు. ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నెలల తరబడి దాచుకుని తినచ్చు. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. ఆలస్యం చేయకుండా ఎండు రొయ్యల కారంపొడికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

yearly horoscope entry point

ఎండు రొయ్యల కారంపొడి తయారీకి కావాల్సిన పదార్థాలు:

  • ఎండు రొయ్యలు- 2 కప్పులు,
  • ఎండు మిరపకాయలు- 35 నుంచి 40,
  • ఎండు కొబ్బరి- 2 కప్పులు,
  • ధనియాలు- 3 టేబుల్ స్పూన్లు,
  • జీలకర్ర- 1 టేబుల్ స్పూన్,
  • కుంకుమపువ్వు- అర టేబుల్ స్పూన్,
  • చింతపండు- 1 చిన్న నిమ్మకాయ పరిమాణం,
  • ఉప్పు- రుచికి తగినంత,
  • వెల్లుల్లి రెబ్బలు- 12,
  • నూనె- అవసరమైనంత.

ఎండు రొయ్యల కారంపొడి తయారీ విధానం:

  • ఎండు రొయ్యల కారం పొడి తయారు చేయడానికి ముందుగా ఎండు రొయ్యలను తీసుకుని చక్కగా శుభ్రం చేయాలి. అంటే దాని తల భాగం, తోక భాగాన్ని తీసేయాలి.
  • తర్వాత వాటిని నీటిలో మూడు నుండి నాలుగు సార్లు బాగా కడిగి శుభ్రం చేయండి.
  • కడిగిన ఎండు రొయ్యలను ఎండ తగిలే చోట ఏదైనా వస్త్రంలో వేసి ఆరబెట్టాలి.
  • ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని దాంట్లో ఎండిన రొయ్యలను వేసి వేయించండి. వీటిని చిన్న మంట మీద మాత్రమే వేయించాలి. ఇలా 8 నుంచి 10నిమిషాల పాటు వేయించిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన పెట్టండి.
  • ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా నూనె పోసి వేడి చేయండి.
  • నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఎండు మిరపకాయలను వేసి వేయించండి.తర్వాత వీటిని ఒక ప్లేటులోకి తీసుకుని పక్కకు పెట్టుకోండి.
  • తరువాత అదే ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి.
  • ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఎండు మిరపకాయలు ఉంచిన ప్లేటులోకి తీసుకుని చల్లారే వరకూ పక్కకు ఉంచండి.
  • చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలతో పాటు ఉప్పు, చింతపండు వేసి పొడిలా తయారు చేయండి.
  • తరువాత ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసి ప్యాన్లో వేసి వేయించండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి చక్కగా పొడి చేయండి.
  • ఈ కొబ్బరి పొడిని ముందుగా తయారు చేసుకున్న ఎండు మిరపకాయల పొడితో కలిపి ఒకసారి మిక్సీ పట్టండి.
  • తర్వాత ఈ మిశ్రమాన్ని ఎండు రొయ్యల్లో వేసి చేత్తో బాగా కలపండి.

అంతే స్పైస్సీ అండ్ టేస్టీ ఎండు రొయ్యల కారం పొడి తయారైనట్టే.

దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి నిల్వ చేశారంటే రెండు నెలల పాటు తాజాగా ఉంటుంది.

ఇంట్లో కూరలు నచ్చనప్పడు, లేదా రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు వేడి వేడి అన్నంతో కలుపుకుని తిన్నారంటే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది.

Whats_app_banner