Juices for digestion: భోజనం తర్వాత ఈ జ్యూసులు తాగండి, ఏం తిన్నా ఇట్టే అరిగిపోతుంది
Juices for digestion: ఆహారం తిన్న వెంటనే పొట్ట నిండుగా అనిపిస్తుందా? ఆహారం జీర్ణం అవడంలో, మల విసర్జణలో ఏ ఇబ్బందీ రాకుండా ఉండాలంటే ఈ జ్యూసులు తాగితే సరిపోతుంది. ఇవన్నీ జీర్ణశక్తిని పెంచేవే.
పండగలంటే రకరకాల ఆహారాలు తినేస్తారు. స్వీట్లు, పిండి పదార్థాలు, నూనెలో వేయించిన వంటకాలన్నీ కడుపునిండా తినాల్సిందే. అయితే తిన్న వెంటనే పొట్ట బరువెక్కినట్లు అనిపిస్తుందా? ఏదైనా కడుపులో పడితే తిన్నదంతా అరిగిపోతే బాగుండు అనిపిస్తుందా? ఈ జ్యూసులు తాగారంటే ఎలాంటి ఆహారం తిన్నా ఇట్టే అరిగిపోతుంది చూడండి.
కీరదోస జ్యూస్:
కీరదోస వల్ల అనేక లాభాలుంటాయి. డీహైడ్రేషన్ కాకుండా ఇది కాపాడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలానూ చూస్తుంది. మలబద్దకం, అజీర్తి లాంటివి రాకుండా చూస్తుంది. ఈ జ్యూస్ తయారీ కోసం ఒక కీరదోసం, గుప్పెడు పాలకూర తీసుకోండి. సగం ముక్క యాపిల్ కూడా అవసరం. ఇవన్నీ మిక్సీలో వేసి జ్యూస్ చేసుకుని తాగడమే.
క్యారట్ సూప్:
క్యారట్‌కు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. డయేరియా కూడా క్యారట్ తగ్గిస్తుంది. ఆహారం జీర్ణమయ్యేలానూ చూస్తుంది. దీనికోసం రెండు క్యారట్లు ఉడికించుకోవాలి. వాటిని మిక్సీ పట్టుకోవాలి. అరకప్పు నీళ్లలో ఈ ముద్ద, కాస్త ఉప్పు, కొద్దిగా బటర్ లేదా నెయ్యి వేసుకుని ఉడికించుకొని తాగితే చాలు. క్యారట్ సూప్ రెడీ అయినట్లే.
లెమనేడ్:
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది అజీర్తి సమస్య తగ్గిస్తుంది. మలబద్దకమూ తగ్గుతుంది. దీనికోసం నిమ్మరసం కాస్త గుజ్జుతో సహా తీసుకోవాలి. ఒక గ్లాసులో వేసుకుని రెండు మంచు ముక్కలు, ఉప్పు, నీళ్లు కలుపుకుని తాగితే చాలు.
పుదీనా టీ:
పుదీనా టీ కూడా అజీర్తి సమస్య తగ్గిస్తుంది. ఈ టీ తయారు చేయడానికి గుప్పెడు పుదీనా ఆకులు కావాలంతే. వీటిని కాస్త కచ్చాపచ్చాగా దంచుకోవాలి. కప్పు వేడి నీళ్లలో ఇలా దంచుకున్న ఆకులను వేసుకోవాలి. అలా కనీసం 10 నిమిషాలు ఆకులను మరగనివ్వాలి. తర్వాత వడకట్టి ఒక కప్పులో పోసుకుని కొన్ని తులసి ఆకులు, తేనె కలుపుకుని తాగితే చాలు. దీంట్లోనే కాస్త అల్లం కూడా దంచుకుని వేసుకోవచ్చు. దాల్చిన చెక్కనూ పుదీనాతో పాటూ మరిగించొచ్చు. ఇవన్నీ జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.
పైనాపిల్:
పైనాపిల్‌లో బ్రొమిలేన్ ఉంటుంది. ఇది మల విసర్జన సాఫీ అయ్యేలా చూస్తుంది.కాబట్టి భోజనం తర్వాత కొద్దిగా పైనాపిల్ జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది.